Ration Shops Dealers Frauds in Telangana:ఓ వ్యక్తి రేషన్ కోసం షాపుకు వెళ్లాడు. అయితే అక్కడే ఉన్న వ్యక్తి బియ్యాన్ని ఎలక్ట్రానిక్ కాంటాపై తూకం వేసి ఇచ్చాడు. ఆ తర్వాత సదరు వ్యక్తి ఇంటికి బియ్యాన్ని తీసుకొచ్చేశాడు. అయితే ఆ ఇంట్లో వాళ్లకు బియ్యం తక్కువగా వచ్చాయని అనుమానం వచ్చింది. పక్కనే ఉన్న వేరే షాపుకి వెళ్లి తూకం వేశారు.
ఆ తర్వాత తూకం చూసి సదరు వ్యక్తి ఆశ్చర్యపోయాడు. రేషన్ దుకాణం, కిరాణా షాపు తూకానికి 650 గ్రాములు బియ్యం తక్కువగా వచ్చాయి. తాను మోసపోయానని గ్రహించి అక్కడి నుంచి ఆ వ్యక్తి వెళ్లిపోయాడు. ఈ సమస్య ఇప్పుడు అతని ఒక్కరిదే కాదు రేషన్ తీసుకుంటున్న అందరిది. అసలు ఎలా ఈ మోసాలు చేస్తున్నారని అనుకుంటున్నారా? వీటి నుంచి ఎలా బయటపడాలో తెలుసుకోవాలని అనుకుంటున్నారా అయితే ఇది మీకోసమే.
తెలివిగా తూకంలో మోసం: రేషన్ కేంద్రాల్లో ఈ-పాస్ యంత్రాలకు ఎలక్ట్రానిక్ కాంటాలను కనెక్ట్ చేసినా సరే తూకం ఇలానే వస్తుంది. అసలు రేషన్ దుకాణాల్లో జరిగే మోసాలను అరికట్టడానికే ఈ-పాస్ యంత్రాలను ఏర్పాటు చేశారు. అయినా సరే కొందరు అక్రమ డీలర్లు మోసాలకు పైఎత్తులను వేస్తున్నారు. డబ్బులు సంపాదించాలనే కోరికతో కొన్ని రేషన్ షాపుల్లో ఎలక్ట్రానిక్ కాంటాను కాలికి దగ్గరగా పెట్టుకొని బొటన వేలితో నొక్కి ఉంచుతున్నారు.
దీంతో తూగాల్సిన దానికన్నా తక్కువగా వస్తువులు తూగుతున్నాయి. దీని వల్ల లబ్ధిదారుడు 500 గ్రాములు నుంచి 1200 గ్రాములు వరకు నష్టపోతున్నారు. ఇలా బియ్యాన్ని స్వాహా చేసి పక్కదారి పట్టించి లబ్ధిదారుడికి భారీ నష్టాన్నే మిగుల్చుతున్నారు రేషన్ డీలర్లు. మరోపక్క ఎలక్ట్రానిక్ కాంటాపై కొందరు డీలర్లు గోనె సంచిని నీటిలో తడిపి వేసి మోసానికి పాల్పడుతున్నారు. ఇలాంటి మోసాలు పలు రేషన్ దుకాణాల్లో జరుగుతున్నాయి.