Mega Industrial Hub in Kavali : కేంద్రం సహకారంతో కూటమి ప్రభుత్వం పారిశ్రామిక అభివృద్ధిపై దృష్టి సారించింది. గతంలో టీడీపీ హయాంలో రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు ముందుకొచ్చిన యాజమాన్యాలను సంప్రదించడంతో పాటు తాజాగా కల్పించే రాయితీలపైనా ప్రత్యేకంగా అధికారులను నియమించి ఆకర్షిస్తోంది. ఈ నేపథ్యంలో నెల్లూరు జిల్లాలో పరిశ్రమలకు అనుకూల వాతావరణం ఉండగా, ప్రభుత్వ భూములు కూడా అనేకం ఉన్నాయి. కావలి మండలంలో మెగా పారిశ్రామిక హబ్ ఏర్పాటుకు ఏపీఐఐసీ నుంచి కూటమి ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందాయి.
పారిశ్రామిక అభివృద్ధి దిశగా ఏపీ దూసుకుపోతోంది. అంతర్జాతీయ పరిశ్రమలను నెలకొల్పేందుకు కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇప్పటికే రామాయపట్నం పోర్టుకు అనుబంధంగా బీపీసీఎల్ రిఫైనరీ రానుండగా ఇండోసోల్ పరిశ్రమ ఏర్పాటుకు సర్వం సిద్ధమైంది. ఈ నేపథ్యంలో మరిన్ని పరిశ్రమలు తీసుకువచ్చే దిశగా ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి.
పరిశ్రమల కోసం నానా తంటాలు పడుతున్నాం - సీరియస్గా ఫాలో అప్ చేయండి : సీఎం చంద్రబాబు
నెల్లూరు జిల్లా కావలి మండలంలోని మూడు గ్రామాల్లో భూసేకరణకు ప్రతిపాదనలు రాగా అధికారులు సర్వే చేపట్టారు. కావలి మండల పరిధిలో మెగా ఇండస్ట్రీయల్ హబ్ ఏర్పాటుకు ఏపీఐఐసీ (APIIC) నుంచి ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందాయి. తాజాగా హబ్ ఏర్పాటుపై దృష్టిసారించడంతో స్థానికుల్లో హర్షం వ్యక్తమవుతోంది.
రెండు వేల ఎకరాల్లో
నెల్లూరు జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధికి అపార అవకాశాలున్నాయి. ఇండస్ట్రియల్ పార్కులతో పాటు ప్రభుత్వ భూములు కూడా ఉన్నాయి. రామాయపట్నం పోర్టు పనులు పురోగతిలో ఉన్న నేపథ్యంలో దానికి అనుబంధంగా మరిన్ని పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు పెట్టుబడిదారులు క్యూ కడుతున్నారు. దాంతో కావలి మండలంలోని తుమ్మలపెంట, చెన్నాయపాలెం, అనెమడుగు గ్రామాల పరిధిలో మెగా ఇండస్ట్రీయల్ హబ్ ఏర్పాటుకు ఏపీఐఐసీ నిర్ణయించింది. ఈ మేరకు సుమారు 2001.78 ఎకరాల భూ సేకరణ నివేదికను ఏపీఐఐసీ రెవెన్యూశాఖతో పాటు రాష్ట్ర ప్రభుత్వానికి పంపింది. అక్కడి నుంచి అనుమతి రాగానే మారిటైం బోర్డు ద్వారా భూసేకరణ చేపట్టే అవకాశాలున్నాయని తెలుస్తోంది. మెగా ఇండస్ట్రీయల్ హబ్ నిర్మాణం పూర్తయితే కావలి పట్టణంతో పాటు జిల్లా ముఖచిత్రం మారిపోతుందని పలు రంగాలకు చెందిన నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
మెగా ఇండస్ట్రీయల్ హబ్ ఏర్పాటులై కావలి ఆర్డీవో ఎం.సన్ని వంశీకృష్ణ మాట్లాడారు. మెగా ఇండస్ట్రీయల్ హబ్ ఏర్పాటు ప్రతిపాదనలు ప్రభుత్వం దృష్టిలో ఉన్నాయని తెలిపారు. అనుమతి రాగానే ఏపీ మారిటైం బోర్డు ఆధ్వర్యంలో భూసేకరణ కొనసాగుతుందని వెల్లడించారు.
రాయలసీమలో సెమీ కండక్టర్ పరిశ్రమ - ఏపీ దశ మార్చనున్న ఒప్పందం
ప్రపంచస్థాయి వసతులతో ఏపీ మారిటైమ్ పాలసీ - ప్రపంచంలోని 20 భారీ పోర్టుల్లో ఒకటి ఇక్కడే