Ration Mafia Hulchal in Tiruvuru :అక్రమ వ్యాపారంలో ఆధిపత్యం కోసం రెండు వర్గాలు పోటీపడటం అందుకోసం ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడం మనం సినిమాల్లో చూస్తూనే ఉంటాం. తాజాగా ఇలాంటి ఘటనే ఎన్టీఆర్ జిల్లాలో జరిగింది. తిరువూరు నియోజకవర్గంలో రేషన్ మాఫియా రెచ్చిపోయింది. ఈ దందాను సాగిస్తున్న రెండు వర్గాలు ఆధిపత్య పోరులో భాగంగా వారు సినిమా ఛేజ్‌ను తలపించేలా పరస్పరం కార్లతో ఢీకొట్టుకోవడం కలకలం రేపింది.
తిరువూరు నియోజకవర్గంలోని నాలుగు మండలాల పరిధిలో కొన్ని సంవత్సరాలుగా రేషన్ బియ్యం అక్రమ రవాణా యదేఛ్చగా సాగుతోంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన ఓ వ్యక్తి రాజుపేటలోని రైస్‌మిల్లు కేంద్రంగా కాకినాడ పోర్టుకు ప్రతినెలా పదుల సంఖ్యలో చౌక బియ్యం లారీలను తరలించి రూ.కోట్లకు పడగలెత్తాడు. ప్రభుత్వం మారాక అతని వ్యాపారానికి అడ్డుకట్ట పడింది. ఆ దందాను మరో మాఫియా నిర్వాహకుడు చేజిక్కించుకున్నాడు. దీంతో వీరి మధ్య ఆధిపత్య పోరు తారస్థాయికి చేరింది.
భయాందోళనలకు గురైన స్థానికులు : ఈ నేపథ్యంలోనే ఆదివారం ఉదయం ఎ.కొండూరు మండలం గోపాలపురం నుంచి చౌక బియ్యాన్ని అక్రమంగా తరలించేందుకు ఓ ముఠా సిద్ధమైంది. ఈ విషయం తెలుసుకున్న మరోవర్గం వారు యూట్యూబ్ ఛానళ్ల విలేకరులతో కలిసి అడ్డుకునేందుకు ప్రయత్నించారు. అప్పటికే సిద్ధంగా ఉన్న లారీకి కారును అడ్డుపెట్టి పౌరసరఫరాల శాఖ, పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ క్రమంలోనే ప్రస్తుత మాఫియాలోని వ్యక్తులు ప్రత్యర్థులపై దాడికి పాల్పడ్డారు. లారీకి అడ్డుగా ఉన్న కారును మరో కారుతో ఢీకొట్టారు. దీంతో ఆ కారు రోడ్డు పక్కనున్న కాల్వలోకి పల్టీ కొట్టింది. ఇదంతా చూసి స్థానికులు భయాందోళనకు గురయ్యారు.