Ration Card E KYC in Telangana :రాష్ట్రంలోని రేషన్ కార్డుదారులకు(Ration Card E KYC) అలర్ట్. మీరూ ఇప్పటి వరకూ ఈ-కేవైసీ నమోదు చేయించుకోకుంటే ఇకనైనా త్వరపడండి. ఎందుకంటే ఆహారభద్రత కార్డుల ఈ-కేవైసీ నమోదుకు తెలంగాణ సర్కార్ మరో అవకాశం కల్పించింది. ఇప్పటికే ఫిబ్రవరి 29తో గడువు ముగిసింది. కానీ రేషన్ దుకాణాల్లో ప్రభుత్వ సూచన మేరకు ప్రస్తుతం ఈ-కేవైసీ ప్రక్రియ కొనసాగుతోంది. మొత్తం లబ్ధిదారుల్లో ఇప్పటి వరకు 74 శాతం మంది మాత్రమే నమోదు చేసుకున్నారు. మిగిలిన వారి కోసం మరో అవకాశం ఉండకపోవచ్చని, త్వరగా ఈ కేవైసీ పూర్తి చేసుకోవాలని సంబంధిత పౌరసరఫరాల శాఖ అధికారులు సూచనలు చేస్తున్నారు.
సంక్షేమ పథకాలు అర్హుల లబ్ధికే : సంక్షేమ పథకాలు అర్హులకే అందించడానికి తెలంగాణ సర్కార్ పకడ్బందీగా చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే రేషన్ కార్డులకు ఈ- కేవైసీ తప్పనిసరి చేసింది. దీని కోసం శాఖాపరంగా అవగాహన కార్యక్రమాలు సైతం చేపట్టారు. ఈ విషయమై తమకు అందుబాటులో ఉన్న రేషన్ దుకాణాలకు వెళ్లి ఈ కేవైసీ చేసుకోవాలని పౌరసరఫరాల అధికారులు సూచించారు. పలు దఫాలుగా అవకాశం ఇచ్చినా ఇంకా మిగిలిపోయిన కారణంగా ఎక్కువ మందికి నష్టం కలిగే అవకాశం ఉందని భావించిన ప్రభుత్వం రేషన్ దుకాణాల్లో నమోదు చేసుకోవడానికి మరోమారు అవకాశం కల్పించింది. అవకాశాన్ని సద్వినియోగ పరచుకోవాలని అధికారులు కోరుతున్నారు.