Ratan Tata Association With Visakhapatnam In AP :విలువలతో కూడిన టాటా గ్రూప్ సంస్థలను దిగ్గజ స్థాయికి తీసుకెళ్లిన క్రెడిట్ రతన్ టాటాకే దక్కుతుంది. టాటా సన్స్ గౌరవ ఛైర్మన్‌గా ఉన్న రతన్ టాటా బుధవారం తుదిశ్వాస విడిచారు. దీంతో తెలుగు రాష్ట్రాల్లో ఆయన అభిమానులు, ఆయనతో అనుబంధం ఉన్న ప్రతి ఒక్కరూ కన్నీటి పర్యంతమయ్యారు. ఆయిన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు.
కేవలం వ్యాపారం చేయడమే కాదు దేశ ప్రజలకు మేలు చేసేలా సేవా కార్యక్రమాలనూ టాటా సంస్థ భారీ స్థాయిలో నిర్వహిస్తోంది. టాటా సంస్థను ఆదరిస్తున్న భారతీయులకు అపద సమయాల్లో వివిధ రూపాల్లో సాయం చేస్తోంది. వాటిలో కొన్ని ఉమ్మడి విశాఖ జిల్లాలోనూ అమలు చేశారు. పేదల బతుకులు బాగు చేసే కార్యక్రమాలు, ఆరోగ్యాన్ని కాపాడే వైద్య సంస్థలూ ఆ జాబితాలో ఉన్నాయి.
'విశాఖపట్నం స్వచ్ఛ నగరం. ఈ ప్రాంతానిపై ఇప్పటివరకు దృష్టి సారించలేదు. ముంబయి వెళ్లాక వైజాగ్లో పెట్టుబడులు, ఆంధ్ర విశ్వవిద్యాలయానికి(ఏయూ)కు ఏవిధంగా సాయపడగలమో ఆలోచిస్తాం' అని2018 డిసెంబరు 10న ఏయూలో జరిగిన సమావేశంలో రతన్ టాటా తెలిపారు.
ఉప్పు నుంచి ఉక్కు వరకు : ప్రతి ఒక్కరి దైనందిన జీవితంలో ‘టాటా’ సంస్థ ఉత్పాదనలు తప్పకుండా ఉంటాయి. ఉప్పు నుంచి ఉక్కు వరకు టీ, ఆహారం, రవాణా, ఉద్యోగం, వినోదం, వస్త్రాలు, ఆభరణాలు, ఉక్కు, గృహాలంకరణ సామగ్రి ఇలా ఏది చూసినా ప్రతి రంగంలోనూ టాటా అడుగు స్పష్టంగా కనిపిస్తుంది.
‘రతన్ టాటా’ చొరవతోనే క్యాన్సర్ సేవలు :అగనంపూడిలో రతన్ టాటా కృషితో ఏర్పాటు చేసిన హోమీ బాబా క్యాన్సర్ ఆసుపత్రి నేడు ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు, ఇతర ప్రాంత ప్రజలకు ఆరోగ్యవరప్రదాయినిగా ఉంది. రతన్ టాటా ఛైర్మన్‌గా ఉన్న ముంబయి టాటా స్మారక కేంద్రం నోడల్ ఏజెన్సీగా వ్యవహరించడానికి ముందుకు రావడంతోనే విశాఖపట్నంలో ఆసుపత్రి నిర్మాణానికి అంకురార్పణ జరిగింది. కేంద్ర అణుశక్తి మంత్రిత్వ శాఖ తొలుత కోల్‌కతా, త్రివేండ్రం, ఇతర నగరాల్లో ఆసుపత్రి ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదించినప్పటికీ టాటా సంస్థ ప్రతినిధులు విశాఖ వైపే మొగ్గు చూపారు. 2009లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఎకరా రూ.1.50 లక్షల చొప్పున మొత్తం 76 ఎకరాలను కేటాయించింది.
2014లో క్యాన్సర్ ఆసుపత్రి భవనాల నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. ఓవైపు పనులు జరుగుతుండగానే మరోవైపు తాత్కాలికంగా కంటైనర్లలో వైద్య సేవలు ప్రారంభించారు. కట్టడాల నిర్మాణ పని పూర్తికావడంతో వైద్య విభాగాలను తరలించారు. ప్రస్తుతం పక్కా భవనాల్లో ఎంతో మంది పేదలకు అత్యాధునిక వైద్య సౌకర్యాలతో చికిత్స అందిస్తున్నారు.
గిరిపుత్రుల జీవితాల్లో వెలుగులు నింపిన టాటా ట్రస్ట్ :అల్లూరి జిల్లాలో గిరిజన రైతుల జీవనోపాధి మెరుగుదలకు టాటా ట్రస్టు ‘విజయవాహిని’ సంస్థ ద్వారా ఎంతో కృషి చేస్తోంది. గిరిజనుల సగటు ఆదాయం రూ.1.50 లక్షలకు చేర్చాలన్న దృఢ సంకల్పంతో 43 గ్రామాల్లో టాటా ట్రస్టు ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలను అమలు చేస్తున్నారు.