Rare Frogs Found in AP :పర్యావరణ వ్యవస్థ మానవ మనుగడకు సూచిక. అది బాగుంటేనే ప్రకృతి కాని జీవవైవిధ్యం కాని విరాజిల్లుతుంది. దానికి జీవుల తోడ్పాటు ఎంతో అవసరం. అందులోనూ సకశేరుకాలు, ఉభయచర జీవులకు ప్రత్యేక గుర్తింపు ఉంది. జీవ మనుగడలో వీటి పాత్ర చాలా ముఖ‌్యమైంది. అలాంటివి ఈ భూమిపై ఎన్నో ఉన్నాయి. కొన్ని పర్యావరణ మార్పుల వల్ల అంతరించిపోతుంటే మరికొన్ని చాలా అరుదుగా కన్పిస్తుంటాయి.
Golden Backed Frog in AP : అలాంటి అరుదైన ఒక ఉభయచర జీవిని శాస్త్రవేత్తలు కనిపెట్టారు. ఇటీవలి కాలంలో తూర్పు కనుమల్లో ఉభయచర జీవులపై అధ్యయనాలు, పరిశోధనలు విస్తృతంగా సాగుతోన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేకించి భారత్‌లో వాతావరణ మార్పుల నేపథ్యంలో పర్యావరణ పరిరక్షణపై ప్రత్యేక దృష్టి సారించారు. ప్లీస్టోసీన్ కాలంలో శ్రీలంక నుంచి తూర్పు కనుమలకు ఉభయచరాలు వలస వచ్చినట్టు పరిశోధనలు చెబుతున్నాయి.
రెండు కప్పలను గుర్తించిన శాస్త్రవేత్తలు :వీటిని నిజం చేస్తూ ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా శేషాచలం కొండల్లో గోధుమ చెవుల పొద కప్ప సూడోఫిలౌటస్ రేజియస్ అనే అరుదైన కప్ప జాతిని పరిశోధకులు కనుగొన్నారు. అలాగే, పలమనేరు కౌండిన్య అటవీ ప్రాంతం సమీపంలో గౌనితిమ్మేపల్లి వద్ద ఓ కుంటలో శ్రీలంక గోల్డెన్ బ్యాక్ట్ ఫ్రాగ్ రానా గ్రాసిలీస్ అనే మరో కప్పలను గుర్తించారు. హైదరాబాద్ జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా శాస్త్రవేత్తలు, ఏపీ బయోడైవర్సిటీ బోర్డ్ సభ్యులతో కలిసి వీటిని కనుగొన్నారు.
Sri Lankan Brown Eared Shrub Frog in AP : వాతావరణ మార్పులు ప్రపంచాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. అయినా చక్కటి పర్యావరణం, జీవవైవిధ్యానికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తోంది తూర్పు కనుమలు. అలాంటి ప్రాంతంలో పాలిమార్ఫిక్ శ్రీలంక బ్రౌన్ ఇయర్డ్ ష్రబ్ ఫ్రాగ్, శ్రీలంక గోల్డెన్ బ్యాక్ట్ ఫ్రాగ్‌ను కనుగొన్నారు. వీటిని హైదరాబాద్ జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా -జెడ్ఎస్ఐ కార్యాలయానికి తీసుకొచ్చి డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహించారు. తూర్పు కనుమలలో శ్రీలంక సూడోఫిలౌటస్ రేజియస్ గుర్తించడంపై అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన న్యూజిలాండ్ జర్నల్ జూటాక్సాలో కూడా ఆర్టికల్ ప్రచురితమైంది.
దేశంలో అంతగా తెలియని సకశేరుకాలు వెంట వెంటనే బయటపడుతుండటం అది కూడా తూర్పు కనుమల్లో బయటపడటం శాస్త్రవేత్తలను ఆనందానికి గురి చేస్తుంది. ముఖ్యంగా హియాలయాలు, పశ్చిమ కనుమల్లోనే ఎక్కువగా జీవజాలానికి సంబంధించి అధ్యయనాలు పరిశోధనలు ఎక్కువగా జరుగుతుంటాయి. అలాంటిది తూర్పుకనుమల్లో ఇలాంటి కప్పలు బయటపడటం అంటే, పర్యావరణం ఇక్కడ కూడా బాగుండటమేనని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. సాధారణంగా ఇవి కాలుష్యం లేని ప్రాంతాల్లో మాత్రమే మనుగడ సాగిస్తాయని అంటున్నారు.
తిరిగి 220 ఏళ్ల తర్వాత : ప్లీస్టోసీన్ కాలంలో భారత్, శ్రీలంక కలిసే ఉండేదని పరిశోధకులు చెబుతున్నారు. వీటి మధ్యలో భూమార్గం, అటవీ మార్గాలు ఉండేవని అంటున్నారు. ప్రస్తుతం కనుగొన్న శ్రీలంక పొద కప్ప 2005లో శ్రీలంకలో గుర్తించారు. ఇది ఆ దేశ అడవుల్లో ఒక సాధారణ కప్ప. అలాంటిది రెండు దశాబ్దాల వ్యవధి తర్వాత తూర్పు కనుమలలో అది కూడా 700 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాంతంలో బయటపడటం ప్లీస్టోసీన్ కాలాన్ని గుర్తు చేస్తుందని అంటున్నారు. ఇదే శ్రీలంక పొద కప్పకు సంబంధించి మూడు జాతులు పశ్చిమ కనుమలలో గుర్తించారు. తిరిగి 220 ఏళ్లకు పైగా సమయం తర్వాత బ్రౌన్ ఇయర్డ్ ష్రబ్ ఫ్రాగ్ జాతి బయటపడింది.