Jani Master Police Custody :ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌ను రంగారెడ్డి జిల్లా ప్రత్యేక పోక్సో కోర్టు 4 రోజుల పోలీసు కస్టడీకి అనుమతించింది. విచారణలో జానీ మాస్టర్‌పై థర్డ్ డిగ్రీ ప్రయోగించవద్దని ఆదేశించింది. అవసరమైతే న్యాయవాది సమక్షంలో ప్రశ్నించాలని సూచించింది. కస్టడీకి అనుమతి లభించడంతో జానీ మాస్టర్‌ను ఈ నెల 28 వరకు నార్సింగి పోలీసులు ప్రశ్నించనున్నారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్ చంచల్‌గూడ జైలులో ఉన్నారు. అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌పై లైంగిక వేధింపుల కేసులో జానీ మాస్టర్ అరెస్టయిన విషయం తెలిసిందే. మరోవైపు ఆయన బెయిల్ పిటిషన్‌పై విచారణ సోమవారానికి వాయిదా పడింది.
14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ : లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. జానీ మాస్టర్ తనపై పలుమార్లు అత్యాచారం చేశాడని ఓ మహిళా కొరియోగ్రాఫర్ రాయదుర్గం ఠాణాలో ఫిర్యాదు చేయడంతో జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి నార్సింగి పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు. మొదటిసారి లైంగికదాడి జరిగినప్పుడు తాను మైనర్‌ను అని చెప్పడంతో పోలీసులు పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. మతం మారాలని, పెళ్లి చేసుకోవాలని జానీ మాస్టర్ ఇబ్బందులకు గురిచేయడం, ఈ విషయం బయట చెబితే సినీ అవకాశాలు రాకుండా చేస్తానని బెదిరింపులకు పాల్పడ్డాడని బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది.
జానీమాస్టర్ రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు :సహాయక నృత్య దర్శకురాలిపై లైంగిక దాడికి పాల్పడినట్లు జానీ మాస్టర్ అంగీకరించారని పోలీసులు తెలిపారు. ఈ మేరకు రిమాండ్ రిపోర్టును కోర్టుకు సమర్పించిన పోలీసులు, 2019లోనే బాధితురాలు జానీ మాస్టర్‌కు పరిచయమైనట్లు తెలిపారు. దురుద్దేశంతోనే జానీ మాస్టర్ బాధితురాలిని అసిస్టెంట్‌గా చేర్చుకున్నట్లు పేర్కొన్నారు.