Media Legend and ETV News Channels Founder Ramoji Rao :ఈనాడు గ్రూప్ సంస్థల ఛైర్మన్ చెరుకూరి రామోజీరావు (88) కన్నుమూశారు. జీవితాంతం ప్రజా శ్రేయస్సు కోసమే పరితపించిన ఆయన, ‘ఈనాడు’ దినపత్రిక ద్వారా వేలమంది పాత్రికేయులను తయారు చేశారు. టీవీ రంగం ద్వారా వేలాది నూతన నటీనటులను బుల్లితెరకు పరిచయం చేశారు. టీవీ ప్రపంచంలో రామోజీరావుది చెరగని ముద్ర. ఈటీవీ మీటీవీ అంటూ అద్భుతాలు సృష్టించిన వ్యక్తి ఆయన. 1995 ఆగస్టులో తెలుగు ప్రేక్షకుల కోసం ఈటీవీని ప్రారంభించారు. తక్కువ సమయంలోనే జాతీయ స్థాయి నెట్‌వర్క్‌గా ఈటీవీ విస్తరించింది. ప్రతిక్షణం ప్రపంచ వీక్షణం పేరిట 13 భాషల్లో వార్తలు అందించారు. తెలుగు రాష్ట్రాల కోసం ఈటీవీ ఆంధ్రప్రదేశ్, ఈటీవీ తెలంగాణ ఛానళ్లు ప్రారంభించారు. విశ్వసనీయ వార్తా ఛానళ్లుగా ఈటీవీ న్యూస్ ఛానళ్లను తీర్చిదిద్దారు.
బుల్లితెరపై ఒక ట్రెండ్ సెట్ చేసిన వ్యక్తి :వినోద రంగాల్లోనూ తెలుగువారిని ఈటీవీ ఛానళ్లు అలరించాయి. ఈటీవీ ప్లస్, ఈటీవీ సినిమా, ఈటీవీ అభిరుచి, ఈటీవీ లైఫ్, ఈటీవీ బాలభారత్ ఛానళ్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఆలోచనల సమాహారంగా పేరొందిన ఆయన, బుల్లితెరపై ఒక ట్రెండ్ సెట్ చేశారు. ఈటీవీ వినోదాత్మక, విజ్ఞానదాయక కార్యక్రమాలు ఆ బాలగోపాలాన్ని అలరించాయి. రామోజీ ఆలోచనల నుంచి పుట్టిందే ‘పాడుతా తీయగా’ కార్యక్రమం. ఈ కార్యక్రమం ద్వారా ప్రేక్షకులపై సుమధుర సంగీత జల్లు కురిపించారు. వందల మంది గాయనీ గాయకులను సంగీత ప్రపంచానికి పరిచయం చేశారు. ఎంతో మంది మట్టిలో మాణిక్యాలను వెలుగులోకి తీసుకొచ్చారు.
ఎందరో సామాన్యులు రామోజీ ప్రోత్సాహంతో వినోద ప్రపంచంలో రాణించారు. ఉషాకిరణ్ మూవీస్ ద్వారా వివిధ భాషల్లో 87 సినిమాలు నిర్మించారు. ఉషాకిరణ్ మూవీస్ బ్యానర్ ద్వారా ఎంతో మంది నటులు పరిచయం అయ్యారు. తారలుగా ఎదిగిన ఎంతో మంది ఇవాళ అగ్రశ్రేణి నటులుగా ఉన్నారు. భారతీయ చలనచిత్ర రంగాన్ని నూతన శిఖరాలకు చేర్చిన గొప్ప వ్యక్తి రామోజీ.