Ramoji Group Lunches Sabhala Millets :తెలుగువారికి సుపరిచితమైన ప్రియాఫుడ్స్ మరో ముందడుగు వేసింది. పచ్చళ్లు, వంట నూనెలు సహా ఎన్నో నాణ్యమైన ఆహార ఉత్పత్తులను అందిస్తున్న రామోజీ గ్రూప్ సంస్థ ఇప్పుడు చిరుధాన్యాలతో రూపొందించిన 'భారత్ కా సూపర్‌ఫుడ్'తో ముందుకొచ్చింది. స్వర్గీయ రామోజీరావు దార్శనికతకు అనుగుణంగా 'సబల మిల్లెట్స్‌ను' ఆవిష్కరించింది. ఎలాంటి ప్రిజర్వేటివ్‌లు, కృత్రిమ రసాయనాలు లేకుండా ఆనాటి ఆరోగ్యాన్ని నేటిరుచులతో మేళవించి 45రకాల చిరుధాన్యాల ఆహార ఉత్పత్తులను అందుబాటులోకి తెచ్చింది.
ప్రజల ఆహారపు అలవాట్లు, అభిరుచులకు తగ్గట్లుగా :ఆధునిక కాలంలో మధుమేహం, కొలెస్ట్రాల్, బీపీ సహా అనేక వ్యాధులు చుట్టుముడుతున్నాయి. ఈ రుగ్మతల నుంచి రక్షణ పొందేందుకు చిరుధాన్యాలు ఎంతో ఉపయోగపడతాయి. మారుతున్న ప్రజల ఆహారపు అలవాట్లు, అభిరుచులకు తగ్గట్లుగా రామోజీ గ్రూప్‌నకు చెందిన ప్రియా ఫుడ్స్ విప్లవాత్మకంగా అడుగు వేసింది. ఈనాడు గ్రూప్ సంస్థ వ్యవస్థాపక ఛైర్మన్ రామోజీరావు 88వ జయంతిని పురస్కరించుకుని 'సబల మిల్లెట్స్' పేరిట ఆహార ఉత్పత్తులను మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. హైదరాబాద్‌లోని తాజ్‌కృష్ణ హోటల్ వేదికగా చిరుధాన్యాల కొత్త బ్రాండ్స్ ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో ఈనాడు సీఎండీ చెరుకూరి కిరణ్, మార్గదర్శి చిట్ ఫండ్స్ ప్రైవేటు లిమిటెడ్ ఎండీ సీహెచ్ శైలజా కిరణ్, ఉషోదయ గ్రూప్ డైరెక్టర్ సహరి చెరుకూరి, సుజయ్ చెరుకూరి, సోహన, బృహతి పాల్గొన్నారు. సబల మిల్లెట్స్ ఉత్పత్తుల లోగోను ఈనాడు సీఎండీ చెరుకూరి కిరణ్ ఆవిష్కరించారు. చిరుధాన్యాల భోజనం, స్నాక్స్‌కు సంబంధించి ప్రచార వీడియో శైలజాకిరణ్ విడుదల చేశారు. సబల మిల్లెట్స్ వెబ్‌సైట్‌ను బృహతి, సహరి, సుజయ్ ప్రారంభించారు.
భారత్‌కా సూపర్ ఫుడ్స్ పేరుతో 45 రకాల ఉత్పత్తులు :సబల మిల్లెట్స్ ఆహార ఉత్పత్తుల ఆవిష్కరణ తర్వాత ప్యానెల్ డిస్కషన్ జరిగింది. ప్రముఖ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ రాకేష్ కలపాల, పోషకాహార నిపుణులు డాక్టర్ లతాశశి, ఐఐఎంఆర్ డైరెక్టర్ డాక్టర్ తారా సత్యవతి, న్యూట్రీహబ్ సీఈవో డాక్టర్ దయాకర్ పాల్గొన్నారు. జీవనశైలి వ్యాధుల చుట్టుముడుతున్న వేళ చిరుధాన్యాలు ఎంతో రక్షణనిస్తాయని అభిప్రాయపడ్డారు. బియ్యం, గోధుమలకు ప్రత్యామ్నాయంగా ప్రతి ఒక్కరూ చిరుధాన్యాలు ఆహారంలో భాగం చేసుకోవాలని నిపుణులు సూచించారు. 'భారత్ కా సూపర్ ఫుడ్స్' పేరిట 45 రకాల ఉత్పత్తులను విడుదల చేశామని భవిష్యత్తులో మరింత విస్తరిస్తామని ఉషోదయ గ్రూపు డైరెక్టర్ సహరి చెరుకూరి వెల్లడించారు.
అంతకుముందు రామోజీఫిల్మ్‌సిటీలో సబల మిల్లెట్ రెస్టారెంట్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భారత్ బయోటెక్ ఎండీ కృష్ణ ఎల్ల, సీఎండీ సుచిత్రా ఎల్ల, రేచస్ ఎల్ల, వెంకట్ అక్షయ్, కీర్తి సోహన కుటుంబ సభ్యులు రఘు రాయల-సుభాషిణి దంపతులు పాల్గొన్నారు. ఈనాడు ఆంధ్రప్రదేశ్ ఎడిటర్ నాగేశ్వరరావు, తెలంగాణ ఎడిటర్ డి.ఎన్.ప్రసాద్, హెచ్ఆర్ విభాగాధిపతి గోపాల్‌రావు సహా రామోజీ గ్రూప్ సంస్థల విభాగాధిపతులు, ఉద్యోగులు హాజరయ్యారు. కార్యక్రమంలో పాల్గొన్నవారు సబల చిరుధాన్యాల ఉత్పత్తులను కొనుగోలు చేశారు.