Ramoji Rao Services to Telugu Media : రామోజీరావు పేరు వింటేనే తెలుగు వారందరికీ ఒక స్ఫూర్తి . తెలుగు వారికీ, తెలుగు నేలకీ ఆయన చేసిన సేవ చరిత్రలో శాశ్వతంగా నిలుస్తుంది. తెలుగు పత్రికారంగంలో గ్రాంథిక వాసనల్ని తుదకంటా తుడిచి పెట్టి ప్రజల భాషకి పట్టం కట్టింది ఈనాడే. అచ్చ తెలుగు పదాలు, నుడికారాలు, తీరైన వాక్యాలు ఈనాడు భాషాసిరులు. శీర్షిక ఆకర్షణీయంగా ఉండి పాఠకుణ్ని వార్తలోకి లాక్కెళ్లాలనేది రామోజీరావు ధోరణి. 'తెలుగుదేశం సూపర్‌హిట్' 'జనమా బంతిపూల వనమా!', 'హితులారా ఇక సెలవు', 'చేసింది చాలు గద్దెదిగు లాలు', 'మామూళ్లు ఇవ్వకుంటే నూరేళ్లు నిండినట్లే' వంటి ఈనాడు తరహా శీర్షికలు అలాంటివే.
తెలుగు భాషకు స్వర్ణయుగం :తెలుగు భాష పూర్తిగా ఆంగ్లమయం అవుతున్న తీరు రామోజీరావును కలిచివేసేది. తను ప్రాణ సమానంగా భావించే ఈనాడులో ఆంగ్లాన్ని పూర్తిగా పరిహరించాలని కంకణం కట్టుకున్నారు. పత్రికలోనూ, ఈటీవీ వార్తల్లోనూ ఆంగ్ల పదాలు దొర్లకుండా కట్టడిచేశారు. ఈ క్రమంలో వందల కొద్దీ తెలుగు పదాలు పురుడుపోసుకున్నాయి. సంపాదక బృందంలో పనిచేసే ప్రతి ఒక్కరూ పద
సృష్టికర్త అయ్యారు. దస్త్రం (ఫైల్), బిందు సేద్యం (డ్రిప్ ఇరిగేషన్), గుత్తేదారు (కాంట్రాక్టర్), మేఘమథనం (క్లౌడ్ సీడింగ్), శతకం (సెంచరీ) వంటి పదాలు, ఐకాస (జె.ఎ.సి.), అనిశా (ఎ.సి.బి.), తెదేపా (టి.డి.పి.), తెరాస (టి.ఆర్.ఎస్.), తితిదే (టి.టి.డి.) వంటి సంక్షిప్త రూపాలు చాలావరకు ఈనాడు, ఈటీవీల్లో పుట్టినవే. కాదంటే ఈనాడు, ఈటీవీల ద్వారా బహుళ ప్రచారంలోకి వచ్చినవే. బల్దియా (మున్సిపల్ కార్పొరేషన్), లష్కర్ (సికింద్రాబాద్), గల్లీ (వీధి), ముక్కాలు (ముప్పావు) వంటి మాండలిక పదాల్ని కూడా ఈనాడు, ఈటీవీలు ప్రాచుర్యంలోకి తెచ్చాయి.
సమాజాభివృద్ధే ధ్యేయంగా : ఈ కృషికి కొనసాగింపుగా ఆవిర్భవించిందే రామోజీ ఫౌండేషన్. భాషా సేవకులు, ప్రేమికులు, అభిమానుల ఆకాంక్షల్ని ఒక చోటకు చేర్చి తెలుగు భాషకి వైభవం తీసుకురావాలన్న లక్ష్యంతో 2012లో రామోజీరావు తెలుగు వెలుగు ప్రారంభించారు. తెలుగు భాష ఎంత ప్రాచీనమైనదో, అంత అధునాతన లక్షణాలు కలిగిందని ఆయన నమ్ముతారు. ఎలాంటి భావాల్ని అయినా వెలిబుచ్చడానికి, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని పంచడానికి, సంగీత సాహిత్యాల్ని సృజించడానికి తెలుగు ఎంతో అనుకూలమైనా, తెలుగు మాధ్యమంలో చదువులు సాగకపోవడం వల్లే తెలుగు జాతికి ఈ దురవస్థ అంటారు. ఆయన దృష్టిలో మాతృభాషని మరచిపోయిన జాతికి మనుగడ లేదు. తెలుగు భాష అంటే అభిమానంతోనే తన రెండో కుమారుడు సుమన్‌కి కొండవీటి వెంకటకవి గారితో ఏడేళ్లపాటు శిక్షణ ఇప్పించారు. మనవరాళ్లు, మనవడితో తెలుగులోనే మాట్లాడతారు. ఒక్క ఆంగ్లపదం దొర్లకుండా తెలుగులో మాట్లాడాలని వారితో పోటీ పెట్టుకోవడం ఆయనకు అలవాటు.
Ramoji Film City : హైదరాబాదులో రామోజీ ఫిల్మ్ సిటీ నిర్మాణం కావడం తెలుగు వారికి ఎంతో ప్రాచుర్యాన్నీ, గుర్తింపునీ తెచ్చింది. ఇది ప్రపంచంలోనే అతి పెద్ద సినిమా నిర్మాణ కేంద్రంగా గిన్నిస్ బుక్ నమోదైంది. దేశంలో అన్ని భాషల సినిమాలూ ఇందులో నిర్మాణమవుతున్నాయి. ఇక్కడికి రాని భారతీయ సినిమా ప్రముఖులు లేరు. ఉర్దూ నుంచి కన్నడం వరకు, గుజరాతీ నుంచి బంగ్లా వరకు ఎన్నో ప్రాంతీయ భాషల్లో టెలివిజన్ ఛానళ్లను తెలుగునేలపై ఆవిష్కరించడం భాగ్యనగరానికీ ఎనలేని కీర్తి తెచ్చిపెట్టింది. దేశవ్యాప్తంగా ప్రతిభావంతులు, సృజనశీలురు, రచయితలు వీటిలో పనిచేయడానికి హైదరాబాదు వచ్చారు. రామోజీ ఫిల్మ్ సిటీలో 13 భాషల్లో వార్తలు అందించే ఈటీవీ భారత్ భవనం ఒక మినీ పార్లమెంట్లాగా ఉంటుంది. వనస్థలిపురం, దిల్సుఖ్నగర్, ఉప్పల్ వీధుల్లో ఇంతమంది ఇతర భాషల వారు నివాసం ఉండటం ఆయన స్థాపించిన సంస్థల ఫలితమే.
పలు రంగాల్లో బహుముఖ ప్రజ్ఞాశాలి :రామోజీరావు బహుముఖ ప్రజ్ఞాశాలి. పారిశ్రామికవేత్తగా, పత్రికా సంపాదకుడిగా, స్టూడియో వ్యవస్థాపకునిగా, సినీ నిర్మాతగా, వ్యాపారవేత్తగా ఎన్నో రంగాల్లో రాణించారు. అన్నింటిలోకి జర్నలిజమే ఆయనకు అమితంగా ఇష్టమైనది. రోజులో ఎక్కువ సమయం దీనికే కేటాయిస్తారు. వర్తమాన వ్యవహారాల్ని ఆయన నిశితంగా పరిశీలిస్తారు. తెలుగు నుడి, పద ప్రయోగం, వాక్యనిర్మాణంపై ఆయనకు పట్టు ఎక్కువ. చెప్పాల్సిన విషయం అక్షరాల్లో నూరుశాతం ప్రతిబింబించేంత వరకు ఆయన పట్టు విడవరు. సంపాదకుడు అంటే ఆయనే. న్యూస్ ప్లానింగ్, న్యూస్ జడ్జిమెంట్ రామోజీరావు నుంచే నేర్చుకోవాలి. ఈనాడు ఇన్ని విజయ శిఖరాలు చేరడానికి తనలోని పాత్రికేయుడే ప్రధాన కారణం. ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా చైర్మన్ గా కూడా రామోజీరావు పనిచేశారు. ఆ పదవికి అందరికన్నా ఆయనే ఎక్కువ అర్హులు.
తెలుగు జర్నలిజం రంగంలో జిల్లా పత్రికలకు శ్రీకారం :1989లో ఈనాడు జిల్లా పత్రికల ఆవిష్కరణ రామోజీరావు తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయం. ఇవి స్థానిక వార్తలకు పట్టంగట్టి తెలుగునాట జర్నలిజం రూపురేఖల్ని మార్చివేశాయి. సామాన్యుల ఆకాంక్షలకు అద్దం పట్టాయి. పాలనలో పారదర్శకతకు తలుపులు తెరిచాయి. జిల్లా పత్రికల వల్ల కొత్త తరం నాయకులు ప్రాచుర్యంలోకి వచ్చారు. అనుకరణే అత్యుత్తమ ప్రశంస అన్నట్లుగా దేశంలోని దాదాపు అన్ని భాషల పత్రికలూ కాలక్రమంలో ఇదే పందాను అనుసరించడం ఆయన ముందుచూపునకు తార్కారణం.
రైతులపై అభిమానంతో 'అన్నదాత' మాసపత్రిక :రామోజీరావు సంపాదకత్వంలో నడిచిన 'అన్నదాత' దేశంలోనే అగ్రగామి వ్యవసాయ మాసపత్రిక ఖ్యాతి పొందింది. 1969లో దీనిని ప్రారంభించారు. ఆయన ప్రారంభించిన మొదటి పత్రిక ఇదే. వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన ఆయనకు రైతులంటే ఎంతో అభిమానం. అన్నదాతల మేలుకోసం ఈనాడు దినపత్రికలో సైతం 'రైతేరాజు' శీర్షికని ప్రవేశపెట్టారు. ఈ వ్యాసాల్ని రైతులు మాట్లాడుకునే భాషలో ఇవ్వడం వల్ల వారి ఆదరణకు పాత్రమైంది.