Karthika Masam Special : రాష్ట్రవ్యాప్తంగా ఉదయం నుంచి కార్తిక పౌర్ణమి పూజలు వైభవంగా జరుగుతున్నాయి. భక్తులు వేకువజాము నుంచే శివాలయాలకు పోటెత్తారు. ఆ శివయ్యను దర్శించుకుంటూ పరవశించి పోతున్నారు. ముఖ్యంగా యాదాద్రి జిల్లాలోని ఓ శివాలయానికి భక్తులు క్యూ కడుతున్నారు. ఈ శివాలయం ఈ ఒక్కరోజు మాత్రమే (కార్తిక పౌర్ణమి రోజు) తెరుచుకోవడమే ఇందుకు కారణం. ఏడాది అంతా మూసి, కేవలం కార్తిక పౌర్ణమి రోజున మాత్రమే ఈ ఆలయాన్ని తెరుస్తారు. ఆ ఆలయం యాదాద్రి భువనగిరి జిల్లాలో చిల్లాపురంలో ఉంది.
ఏ ఆలయంలోనైనా ఏడాది పొడవునా పూజలు జరుగుతాయి. కొన్నింటిలో మాత్రం కొన్ని నెలల పాటు తెరుస్తారు. ఇక్కడ మాత్రం కార్తిక పౌర్ణమి రోజు మాత్రమే తెరవడం ప్రత్యేకం. ఈ ఒక్క రోజే వేల సంఖ్యలో భక్తులు విచ్చేసి స్వయంభువుగా వెలసిన రామలింగేశ్వర స్వామిని కనులారా దర్శించుకుంటారు. ఇంతకీ ఈ ఆలయ చరిత్ర ఏంటి? భక్తులకు ఆ ఒక్కరోజు మాత్రమే దర్శనం ఎందుకు కల్పిస్తారో ఇప్పుడు తెలుసుకుందాం.
ఇదీ చరిత్ర :యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలంలోని చిల్లాపురం గ్రామంలోని ఓ ఎత్తైన గుట్టపై 900 ఏళ్ల క్రితం శ్రీ రామలింగేశ్వరస్వామి వెలిసినట్లు చరిత్ర చెబుతోంది. ఆ గుట్టపై రామలింగేశ్వరస్వామి స్వయంభూగా వెలసినట్లు చెబుతారు. ఆ గుట్టనే రామస్వామి గుట్టగా పిలుస్తారు. కేవలం కార్తిక పౌర్ణమి రోజున 24 గంటల పాటు మాత్రమే తెరవడం ఈ ఆలయం ప్రత్యేకత. ఇవాళ కార్తిక పౌర్ణమి కావడంతో ఆలయం తలుపులు తెరుచుకున్నాయి.