Rains in Hyderabad Today :బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడుతోంది. నగరంలోని కూకట్‌పల్లి, హైదర్‌నగర్, ఆల్విన్ కాలనీ, నిజాంపేటలో వర్షం కురుస్తూ ఉండగా కేపీహెచ్‌బీ కాలనీ, బాలాజీ నగర్, మూసాపేట, బాచుపల్లిలో వాన కురుస్తోంది. బహదూర్‌పల్లి, గుండ్ల పోచంపల్లి, సుచిత్ర, కొంపల్లి ప్రాంతాలతో పాటు సూరారం, జీడిమెట్ల, జగద్గిరి గుట్ట, బాలానగర్, కుత్బుల్లాపూర్, పేట్‌బషీరాబాద్ ప్రాంతాల్లో వర్షం పడుతోంది. ఈ నేపథ్యంలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. స్కూళ్లు, కాలేజీలు, ఆఫీసుల నుంచి వచ్చే వాళ్లు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
మరోవైపు రాష్ట్రంలో రెండు రోజులపాటు ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఇవాళ ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, మహబూబ్‌నగర్, వరంగల్, రంగారెడ్డి, హైదారాబాద్‌తో పాటు కామారెడ్డి జిల్లాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలను జారీ చేసింది. సోమవారం తూర్పు- మధ్య బంగాళాఖాతం పరిసర ఉత్తర అండమాన్ సముద్ర ప్రాంతంలో కొనసాగిన అల్పపీడనం తూర్పు- మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో ప్రస్పుటమైన అల్పపీడనంగా ఏర్పడిందని వెల్లడించింది. ఇది పశ్చిమ- వాయువ్య దిశగా కదులుతూ ఇవాళ ఉదయం ఐదున్నర గంటలకు అదే ప్రాంతంలో వాయుగుండంగా ఏర్పడినట్లు పేర్కొంది.