Heavy Rains in Andhra Pradesh :శనివారం కురిసిన భారీ వర్షాలతో ఏపీలోని సత్యసాయి జిల్లాలోని పలుచోట్ల తీవ్ర ఇబ్బందులు తలెత్తాయి. కొత్తచెరువు - ధర్మవరం ప్రధాన రహదారిపై ఉన్న విద్యుత్ స్తంభం నేలకూలింది. ప్రధాన రహదారి పక్కనే విద్యుత్ స్తంభం నేలకూలిన సమయంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. లోచర్ల ప్రధాన రహదారి చెరువు కట్టపై ఉన్న భారీ వృక్షం నేలకూలడంతో రాత్రి నుంచి వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. భారీ వృక్షం నేలకూలడంతో కొత్తచెరువు నుంచి పెనుగొండకు వెళ్లే రహదారి పూర్తిగా స్తంభించిపోయింది. పెనుగొండ ప్రధాన రహదారి మార్గంలోని రైల్వే వంతెన మునిగిపోవడంతో వాహనాల రాకపోకలు స్తంభించిపోయాయి. ద్విచక్ర వాహనాలు, ఆటోలలో వెళ్లే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
తెలంగాణలో రాగల మూడు రోజుల్లో భారీ వర్షాలు - ఆయా జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ
ఏపీలోని సత్యసాయి జిల్లా కదిరి ప్రాంతంలో శనివారం రాత్రి ఉరుములతో కూడిన వర్షంతోపాటు గాలి ఉద్ధృతంగా వీచింది. దీంతో పలుచోట్ల వృక్షాలు, విద్యుత్తు స్తంబాలు కూలాయి. పట్టణంలోని వాసవీ నగర్లో వేప చెట్టు కూలి విద్యుత్ స్తంభంపై పడటంతో నేలకూలింది. ఉరుములు, మెరుపులతో పాటు విద్యుత్ మంటలకు స్థానిక ప్రజలు భయాందోళనకు గురయ్యారు. చెట్టు కొమ్ములు, విద్యుత్తు తీగలు వీధిలో అడ్డంగా పడటంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. డ్రైనేజీలు పొంగి రోడ్లపైకి వరద నీరు రావటంతో ప్రజలు ఇబ్బందిపడ్డారు.