Huge Rush in Railway Stations and Bus Stands :దసరా పండగ సెలవుల నేపథ్యంలో చాలా మంది సొంతూళ్లకు పయనమవుతున్నారు. ఈ క్రమంలోనే సికింద్రాబాద్, లింగంపల్లి, కాచిగూడ రైల్వే స్టేషన్లు, జూబ్లీ బస్స్టేషన్లలో ప్రయాణికులతో రద్దీ నెలకొంది. కళాశాలలకు సైతం సెలవులివ్వడంతో ఊళ్లకు వెళ్లేవారితో బస్టాండ్లు కిక్కిరిసిపోతున్నాయి. దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లు, ఆర్టీసీ బస్సులు నడుపుతున్నప్పటికీ రద్దీ మాత్రం తగ్గడం లేదు. ప్రయాణికుల రద్ధీతో పిల్లాపాపలతో గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. బస్సులు, రైళ్లు సంఖ్యను మరింత పెంచాలని ప్రయాణికులు కోరుతున్నారు. దసరా సెలవులు ప్రారంభమైన దగ్గర నుంచి ఇదే రద్దీ కొనసాగుతోంది.
దసరాకు ఆరువేల ప్రత్యేక బస్సులు :శనివారం మధ్యాహ్నం సికింద్రాబాద్‌లో దేవగిరి ఎక్స్‌ప్రెస్ రాగానే ప్రయాణికుల మధ్య స్వల్ప తోపులాట జరిగింది. జనరల్ బోగీల్లో కాలుపెట్టే అవకాశం కూడా లేకపోవడంతో చాలామంది రిజర్వేషన్ బోగీల్లోకి ఎక్కారు. జూబ్లీ బస్టాండ్ నుంచి నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్ తదితర ప్రాంతాలకు వెళ్లే వారు భారీగా వచ్చారు. దసరాకు ఆరు వేల ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు ఆర్టీసీ అధికారులు ప్రకటించినా ప్రయాణికులకు ఇబ్బందులు తప్పడం లేదు. అవసరమైతే 9,10,11 తేదీల్లో మరిన్ని బస్సులు నడుపుతామని అధికారులు వెల్లడించారు.