150 Crore Rupees Fraud by Pre Launch in Hyderabad : బై బ్యాక్ ఇన్వెస్ట్‌మెంట్ పేరిట దాదాపు కోటి రూపాయల మేర మోసానికి పాల్పడిన సువర్ణ భూమి ఇన్‌ఫ్రా డెవలపర్స్ ఘటన మరవకముందే నగరంలోని ప్రీ లాంచింగ్ పేరుతో మరో స్థిరాస్తి సంస్థ భారీ మోసానికి పాల్పడింది. సుమారు 600 మంది నుంచి దాదాపు 150 కోట్ల రూపాయలు వసూలు చేసి మోసం చేశారని, తమకు న్యాయం చేయాలని బాధితులు బషీర్‌బాగ్ సీసీఎస్ ముందు ఆందోళనకు దిగారు. నారాయణ్ ఖేడ్, ఘట్కేసర్, పటాన్ చెరు, కర్తనూర్ ప్రాంతాలలో ఇళ్ల నిర్మాణంతో పాటు వ్యవసాయం పేరిట ఆర్జే వెంచర్స్ ప్రముఖులతో ప్రకటనలు చేసి డబ్బులు వసూలు చేశారని బాధితులు వాపోయారు.
ఒక్కొక్కరి నుంచి 20 లక్షల నుంచి 50 లక్షల వరకు వసూలు చేశారని తెలిపారు. నాలుగేళ్లు గడుస్తున్నా ఇప్పటి వరకు ఎలాంటి నిర్మాణాలు చేపట్టలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్జే వెంచర్స్ ఎండీ భాస్కర్ గుప్తాతో పాటు, డైరెక్టర్ సుధారాణిని అరెస్ట్ చేసి తాము ఇచ్చిన నగదును ఇప్పించాలని కోరారు. తాము ఎన్నిసార్లు అడిగినా వెంచర్ నిర్వాహకులు నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నారని బాధితులు వాపోయారు. కొంతమందికి చెక్కులు ఇచ్చారని, కానీ అవి కూడా బౌన్స్ అయ్యాయని తెలిపారు.
''2022లోనే ఇల్లు నిర్మాణం చేసి ఇస్తామని అన్నారు. ఒకవేళ ఇవ్వకపోతే నిర్మాణం ఉన్న ఏరియా ఆధారంగా ప్రతినెల ఆరు నుంచి 8 వేల రెంట్ ఇస్తామని చెప్పారు. అగ్రిమెంట్లు సైతం చేశారు. నాలుగేళ్లు గడుస్తున్నా ఇప్పటి వరకు ఎలాంటి నిర్మాణాలు చేపట్టలేదని నిర్వాహకులను ప్రశ్నించాం. ఎక్కడా నిర్మాణం చేపట్టలేదు. మేం కట్టిన డబ్బులు వడ్డీతో ఇవ్వాలని గత సంవత్సరం నుంచి నిర్వాహకులను అడుగుతున్నా జవాబు దాటుతూ కాలం గడిపేస్తున్నారు. కనీసం మా డబ్బులైనా మాకు ఇప్పించాలి'- బాధితులు
బై బ్యాక్ ఇన్వెస్ట్‌మెంట్ పేరిట సువర్ణ భూమి మోసం : ఇటీవల కూడా బై బ్యాక్ ఇన్వెస్ట్‌మెంట్ అంటూ సువర్ణ భూమి ఇన్‌ఫ్రా డెవలపర్స్ నిర్వాహకులు మోసం చేశారని, కొంతమంది బాధితులు ఈ నెల 18న హైదరాబాద్ సీసీఎస్‌లో ఫిర్యాదు చేశారు. బై బ్యాక్ ఇన్వెస్ట్‌మెంట్ పేరిట దాదాపు కోటి రూపాయల మేర వసూలు చేసి మోసం చేశారని వాపోయారు. ఏడాదిన్నర తర్వాత 24 శాతం అధికంగా చెల్లిస్తామని సువర్ణ భూమి ఇన్‌ఫ్రా డెవలపర్స్ నిర్వాహకులు చెప్పారని తెలిపారు. బై బ్యాక్ ఇన్వెస్ట్‌మెంట్ పేరిట ఒక్కొక్కరి వద్ద 30 లక్షల నుంచి కోటి రూపాయల వరక వసూలు చేశారని వాపోయారు. ఈ పూర్తి కథనం కోసం కింద ఉన్న లింక్‌ను క్లిక్ చేయండి.
బై బ్యాక్ ఇన్వెస్ట్‌మెంట్ అంటూ మోసం చేశారు - సువర్ణ భూమి ఎండీపై బాధితుల ఫిర్యాదు