Adilabad Railway Works Stopped :ఇన్నాళ్లూ నిరాధరణకు గురైన ఆదిలాబాద్ పట్టణంలోని రైల్వే ఓవర్, అండర్ బ్రిడ్జిల నిర్మాణం ఇప్పటికీ అవరోధాలను ఎదుర్కొంటూనే ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యం కింద రూ.97 కోట్ల 20 లక్షలు మంజూరుకు వచ్చింది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం రూ.57 కోట్ల 71 లక్షలు, కేంద్ర ప్రభుత్వం రూ.39 కోట్ల 49 లక్షలు పనుల కోసం వెచ్చించాల్సి ఉంది. నోడల్ ఏజెన్సీగా ఆర్ అండ్ బీ యంత్రాంగం హైదరాబాద్‌కు చెందిన తనిష్క్ కన్స్ట్రక్షన్స్ కంపెనీ పనులను దక్కించుకుంది.
ఆదిలాబాద్‌లోని సంజయ్‌నగర్ పరిధిలోకి వచ్చే ఎల్ఐసీ భవనం నుంచి మొదలుకొని మార్కెట్ యార్డు వరకు ఓవర్ బ్రిడ్జి, తాంసి బస్టాండ్ ప్రాంతంలో అండర్ బ్రిడ్జి పనులను 2024 నవంబర్ 23లోగా పూర్తి చేయాల్సి ఉంది. శాసనసభ ఎన్నికల ముందు 2023 మే నాలుగో తారీఖున ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు, ఇప్పటి ఎమ్మెల్యే పాయల్ శంకర్, అప్పటి ఎమ్మెల్యే జోగు రామన్న పనులను ప్రారంభించడం రాజకీయాలకతీతంగా అందరిలోనూ ఆశలను రేకెత్తించింది.
"తమ ప్రభుత్వం రాగానే వచ్చి చేస్తాం అని చెప్పడమే కానీ వచ్చి చేసేది ఏమీ లేదు. వాళ్ల పనులు వారు చేసుకోవడం తప్ప ప్రజలను పట్టించుకునే నేతే లేరు. రాష్ట్ర ప్రభుత్వమేమో ఆ పని కేంద్ర ప్రభుత్వానిది అని చెబుతుంది. కానీ పనులు మాత్రం ముందుకు సాగడం లేదు. మాకు బ్రిడ్జి అనుమతులు రాగానే పనులు మొదలు పెట్టారు. కానీ నిధులు లేక ఆపేశారు. ప్రభుత్వం ఏదైనా సరే వీలైనంత త్వరగా బ్రిడ్జి పనులు పూర్తి చేయాలని మేము కోరుకుంటున్నాం." - స్థానికులు