Raghu Rama krishna Raju Complaint Leads to Case : ముఖ్యమంత్రి హోదాలో జగన్ సాగించిన అరాచకాలపై నమోదైన తొలి కేసు ఇదే కావడం గమనార్హం. తనపై హత్యాయత్నం చేసినవారితోపాటు అందుకు ప్రోత్సహించినవారిని, ఘటనను కప్పిపుచ్చేందుకు సహకరించినవారిని కూడా బాధ్యులుగా చేయాలని రఘురామ పోలీసులను కోరారు.
రఘురామకృష్ణరాజును సీఐడీ వేధించిన కేసులో విచారణ కొనసాగుతోంది. రాజద్రోహం కేసులో అరెస్టు చేసి కొట్టారని గుంటూరు నగరంపాలెం పోలీసులకు రఘురామ ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేశారు. నిందితులుగా ఉన్న మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, సీఐడీ పూర్వపు డీజీ సునీల్‌కుమార్, అప్పటి నిఘా బాస్ పీఎస్‌ఆర్ ఆంజనేయులు తదితరులకు నోటీసులు పంపి విచారణకు పిలిచేందుకు రంగం సిద్ధమవుతోంది. ఇప్పటికే మరో నిందితుడు, అప్పటి గుంటూరు సీఐడీ ఏఎస్పీ విజయ్‌పాల్‌కు నోటీసు పంపించి నాటి ఘటనకు సంబంధించిన సాక్ష్యాలు అందించాలని దర్యాప్తు అధికారులు కోరారు. ఈ క్రమంలో పోలీసులు విజయ్‌పాల్ కోసం గాలిస్తున్నారు. విజయ్‌పాల్ సెల్‌ఫోన్, సిమ్‌కార్డులు మార్చి తప్పించుకుని తిరుగుతున్నారు. వారం క్రితం పోలీసు బృందం దిల్లీ వెళ్లగా విజయ్‌పాల్ అక్కడ నుంచి పరారయ్యారు.
విజయవాడలోని విజయ్‌పాల్ ఇంటికి నోటీసులు పంపిన పోలీసులు, విచారణకు రావాలని ఆదేశించారు. రఘురామకృష్ణరాజు విచారణ సమయంలో ఏం జరిగిందో వివరాలు అందించాలని దర్యాప్తు అధికారులు నోటీసులలో కోరారు. ఆయన ఫోన్ స్విచ్ఛాఫ్ ఉండడంతో నోటీసును రిజిస్టర్ పోస్టు ద్వారా విజయవాడలోని ఇంటికి పంపించారు.