డ్రగ్స్ కేసులో గోవా మూలాలు - స్నాప్‌చాట్‌లో చాటింగ్ - కొకైన్ డోర్ డెలివరీ Radisson Hotel Drugs Case Latest Updates :హైదరాబాద్ గచ్చిబౌలి రాడిసన్ హోటల్‌లో (Radisson Hotel Drug Bust) డ్రగ్స్ పార్టీ కేసులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అసలు డ్రగ్స్ ఎక్కడినుంచి వస్తున్నాయన్న అంశంపై పోలీసులు దృష్టి సారించారు. గోవా జైల్లో ఉన్న ఖైదీ అబ్దుల్ ఆదేశాల మేరకు హైదరాబాద్‌లోని రాణిగంజ్‌కు చెందిన డ్రగ్స్ సరఫరాదారు అబ్దుల్ రెహ్మన్‌కు భారీగా కొకైన్ అందుతున్నట్లు గుర్తించారు. అతడి నుంచి అత్తాపూర్‌లోని కేఫ్ రెస్టారెంట్‌లో క్యాషియర్‌గా పనిచేస్తున్న మీర్జావహీద్ బేగ్ ఆ తర్వాత సయ్యద్ అబ్బాస్ అలీ జాఫ్రీకి చేరుతున్నాయి.
డ్రగ్స్ కేసులో ప్రధాన నిందితుడు మంజీరా గ్రూపు సంస్థల డైరెక్టర్ గజ్జల వివేకానంద్, అబ్బాస్ అలీ జాఫ్రీ నుంచి కొని డ్రగ్స్ పార్టీలు నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. గోవాలో ఉండే అబ్దుల్ రాణిగంజ్‌కు చెందిన అబ్దుల్‌రెహ్మాన్ ఇద్దరూ డ్రగ్స్ నెట్‌వర్క్‌లో కీలకంగా వ్యవహరిస్తూ భారీగా విక్రయాలు చేస్తున్నట్లు దర్యాప్తులో తేల్చారు. అబ్దుల్ రెహ్మాన్‌పై హైదరాబాద్‌లో పలు పోలీస్ స్టేషన్లలో డ్రగ్స్ కేసులున్నట్లు అధికారులు గుర్తించారు.
Drug Bust in Gachibowli Radisson Hotel :రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో ప్రధాన సరఫరాదారునిగా ఉన్న మీర్జా వహీద్ బేగ్‌ను విచారించిన పోలీసులు రిమాండ్ రిపోర్ట్‌లో కీలక విషయాలు పొందుపరిచారు. నిందితుడు స్నాప్‌చాట్‌లో చాటింగ్ చేస్తూ డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్టుగా గుర్తించారు. గత నెల 29న మీర్జా వహీబ్ బేగ్‌ను అరెస్ట్ చేసి, అతని వద్ద 3.58 గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. మరో సరఫరాదారు అబ్బాస్ అలీ ద్వారా వివేకానంద డ్రైవర్ ప్రవీణ్‌కు సరఫరా చేసినట్లు గుర్తించారు.
'రాడిసన్ డ్రగ్స్ కేసులో నన్ను ఇరికించాలని చూస్తున్నారు' - హైకోర్టులో దర్శకుడు క్రిష్ పిటిషన్
వహీబ్ బేగ్ ఫిబ్రవరిలో 10 సార్లు డ్రగ్స్ సరఫరా చేసినట్లు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. ఆ ఈ రిపోర్టులో సినీదర్శకుడు క్రిష్ పేరు మరోమారు ప్రస్తావించారు. ఐతే మీర్జా వహీద్ బేగ్ నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసేందుకు 2 దఫాల్లో నిందితులు అతనికి ముప్ఫై వేల గూగుల్ పే ద్వారా చెల్లించారు. ఫిబ్రవరి 24న హోటల్‌లోని జరిగిన పార్టీలో 10 మంది పాల్గొన్నట్లుగా ఇప్పటికే పోలీసులు గుర్తించారు.
కేసులో నిందితుడు వివేకనంద, అతని స్నేహితులు నిర్భయ్, కేదార్, డ్రగ్స్ సరఫరాదారుడు అబ్బాస్, మీర్జా వాహిద్ బేగ్, వివేకానంద డ్రైవర్ ప్రవీణ్‌ని అరెస్ట్ చేశారు. ఐతే ప్రధాన నిందితుడిగా ఉన్న వివేకానంద అరెస్టై వ్యక్తిగత పూచీకత్తుతో బయటకువచ్చాడు. కేదార్, నిర్భయ్‌లు స్టేషన్ బెయిల్‌తో బయటకొచ్చారు. రఘుచరణ్ నార్కోటిక్ పరీక్షలకు హాజరయ్యాడు. దర్శకుడు క్రిష్ (Director krish) సైతం పరీక్షలకు హాజరవ్వగా అతని నుంచి సేకరించిన మూత్ర నమూనాలో ఎలాంటి డ్రగ్స్ ఆనవాళ్లు లేనట్లు ప్రాథమికంగా తెలిసింది. కాగా మీర్జా వహీద్ బేగ్ గచ్చిబౌలి, జూబ్లీహిల్స్, ఫిలింనగర్‌లో డ్రగ్స్ సరఫరా చేసినట్లుగా పోలీసులు గుర్తించారు.
లిషి, నీల్, సందీప్, శ్వేత ఇంకా పరారీలోనే ఉన్నారు. వారందరికీ నోటీసులు పంపించినా ఇప్పటికీ ఎలాంటి స్పందన లేదు. నీల్ విదేశాలకు పారిపోయినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. రాడిసన్ హోటల్ నిర్వాహకులకు పోలీసులు నోటీసులు జారీచేశారు. హోటల్ ఎవరు నిర్వహిస్తున్నారో స్పష్టత రావాల్సి ఉన్నందున ప్రస్తుతానికి నోటీసులిచ్చారు. ఆ తర్వాతే కేసు నమోదు చేయాలని భావిస్తున్నారు. కాగా సోమవారం దర్శకుడు క్రిష్ మరోసారి విచారణకు హాజరయ్యే అవకాశం ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
మీర్జా వాహిద్ రిమాండ్ రిపోర్టులో మరోసారి డైరెక్టర్ క్రిష్ పేరు ప్రస్తావన
డ్రగ్స్ కేసులో అత్యంత రహస్యంగా పోలీసుల ముందుకు దర్శకుడు క్రిష్ - రక్త, మూత్ర నమూనాల సేకరణ