Radisson Drugs Party Case Updates : రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో బుధవారం డ్రగ్ పెడ్లర్ సయ్యద్ అబ్బాస్ అలీ జఫ్రీని పోలీసులు రిమాండ్‌కు తరలించారు. గురువారం ఏ4 నిందితుడిగా ఉన్న రఘు చరణ్‌కు నార్కోటిక్ పరీక్షలు నిర్వహించినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. ఈ పరీక్షలకు సంబంధించి నివేదికలు(Reports) గురువారం రానున్నట్లు సమాచారం. కాగా, ఈ కేసులో పరారీలో ఉన్న లిషి సోదరి కృషిత గచ్చిబౌలి పోలీసు స్టేషన్‌లో లిషితకు నోటీసులు వచ్చిన రోజు నుంచి కనిపించడం లేదని మిస్సింగ్ కేసు నమోదు చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేసింది.
సయ్యద్ అబ్బాస్ అలీ విచారణలో భాగంగా మీర్జా వహీద్ బేగ్ నుంచి డ్రగ్స్ కొనుగోలు చేస్తున్నట్లు చెప్పడంతో వహీద్‌ను గురువారం పోలీసులు విచారించి, కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు. వహీద్‌ను విచారించే క్రమంలో అతను ఇమ్రాన్ సహా మరో వ్యక్తి నుంచి డ్రగ్స్ కొనుగోలు చేస్తున్నట్లు పోలీసులకు వెల్లడించారు. ఇమ్రాన్ నుంచి వహాద్‌కు, అక్కడి నుంచి అబ్బాస్‌కు, అతడి నుంచి వివేకానంద డ్రైవర్ గద్దల ప్రవీణ్‌కు తర్వాత వివేకాకు చేరుతున్నట్లుగా పోలీసులు గుర్తించారు. కాగా, ఇమ్రాన్ సహా మరో వ్యక్తిని అరెస్టు చేస్తామని పోలీసులు తెలిపారు. వీరికి డ్రగ్స్ సంబంధించి ఇంకా ఎలాంటి సంబంధాలు ఉన్నాయనే కోణంలో పూర్తి దర్యాప్తు సాగుతోందని వెల్లడించారు.
మొదటిరోజు నుంచి ఈ కేసులో ఎక్కువగా వినిపిస్తున్న పేరు ప్రముఖ సినీ దర్శకుడు జాగర్లమూడి క్రిష్(Krish). ఈనెల 24వ తేదీన జరిగిన డ్రగ్ పార్టీలో క్రిష్ సైతం పాల్గొన్నట్లు డ్రగ్ పెడ్లర్ అబ్బాస్ వెల్లడించాడు. కాగా క్రిష్‌ను విచారణకు హాజరుకావాలని పోలీసులు కోరారు. ముందు శుక్రవారం రోజున హాజరవుతానని చెప్పిన క్రిష్, సోమవారం రోజు వస్తానని సమాచారం ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు. ఏదేమైనా ఈ కేసులో రోజుకో కొత్త విషయంతో కీలక మలుపులు తిరుగుతోంది.