Rachakonda CP On Cheating Gang Arrest : ప్రభుత్వ పెద్దల అండదండలు ఉన్నాయని.. రెండు పడక గదుల ఇళ్లను మంజూరు చేస్తామని, సర్కారు ఉద్యోగులకు పదోన్నతలు కల్పిస్తామని, ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామని చెబుతూ పలువురిని నిలువునా మోసం చేసిన ఆరుగురు సభ్యుల ఘరానా ముఠాను రాచకొండ ఎస్వోటీ, కీసర పోలీసులు అరెస్టు చేశారు. ముఠా సభ్యులు మాయ మాటలతో పలువురిని మభ్య పెట్టి ఏకంగా 1.29 కోట్ల రూపాయలు దండుకున్నారు. నిందితులు మూడు రకాల నేరాలకు పాల్పడి 108 మందిని మోసం చేసినట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది.
ఈ కేసులో కుషాయిగూడకు చెందిన సురేందర్‌రెడ్డి మోసాలకు తెర తీసినట్టు రాచకొండ పోలీసు కమిషనర్ సుధీర్‌బాబు తెలిపారు. ముఠాలోని అనుగు హర్షిని రెడ్డి తాను ఆర్డీఓ అంటూ రెండు పడక గదుల ఇళ్లు కేటాయిస్తానని పలువురిని నమ్మించిందని ఆయన చెప్పారు. ఈ విధంగా 98 మంది వద్ద డబ్బులు వసూలు చేశారు. ఇళ్లు ఇవ్వడంలో జాప్యం జరగడంతో బాధితులు వారిని ప్రశ్నించగా, ఎన్నికలు వచ్చినందున కోడ్ అమల్లో ఉందని అందుకే జాప్యం జరుగుతోందని ముఠా సభ్యులు వెల్లడించినట్టు పోలీసులు తెలిపారు.
"ఉద్యోగాలు, బదిలీల పేరిట పలువురిని మోసం చేసిన ఆరుగురు సభ్యుల ముఠాను అరెస్టు చేశాం. ఒకటి కాదు రెండు కాదు ముఠా 108 మంది బాధితులను మోసం చేసినట్టు గుర్తించాం. ఈ ఫ్రాడ్‌లో మొత్తం రూ. 1.29 కోట్లు దోచినట్లు మేము నిర్దారించాం. ముఠాలోని ప్రధాన నిందితుడు కొందరు అధికారులకు ఫోన్ చేసి వేంనరేందర్‌రెడ్డి లాగా మాట్లాడినట్టు పోలీసుల విచారణలో బయటపడింది."- సుధీర్‌బాబు, రాచకొండ సీపీ