తెలంగాణ

telangana

ETV Bharat / state

ఇందిరమ్మ ఇళ్ల సర్వేలో అనేక చిక్కుముళ్లు! - ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పేదెవరు?!! - PROBLEMS IN INDIRAMMA SCHEME APP

ఇందిరమ్మ ఇళ్ల సర్వే వేళ వెల్లువెత్తుతున్న ప్రశ్నలు - సమాధానం చెప్పలేక సతమతమవుతున్న సర్వేయర్లు

Etv Bharat
Etv Bharat (Etv Bharat)

By ETV Bharat Telangana Team

Published : Dec 29, 2024, 7:04 PM IST

Updated : Dec 30, 2024, 6:44 AM IST

Problems in Indiramma Housing Scheme App :రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల పథకం దరఖాస్తుల సర్వే కొనసాగుతోంది. ప్రజా పాలన గ్రామ సభల సందర్భంలో సంక్షేమ పథకాల లబ్ధి కోసం అర్జీలను స్వీకరించిన విషయం తెలిసిందే. ఇందులోనే సొంత స్థలం ఉండి, ఇల్లు నిర్మించుకుంటే రూ.5 లక్షల ఆర్థిక సాయం, స్థలం లేని వారికి ఇంటి స్థలంతో పాటు నిర్మించి ఇచ్చే పథకం ఉన్నాయి. దీన్ని ఎంచుకున్న వారి వివరాలను ఇటీవల అందుబాటులోకి తెచ్చిన ఇందిరమ్మ ఇళ్ల పథకం యాప్‌లో నమోదు చేస్తున్నారు. ఆ డేటా ఆధారంగా ప్రభుత్వ సిబ్బంది క్షేత్రస్థాయిలో సర్వే చేస్తూ వివరాలను పరిశీలించి, అర్జీదారు, స్థలం, దస్తావేజులు, ఫొటోలు తీసి యాప్‌లో నమోదు చేస్తున్నారు.

ఈ క్రమంలోనే సర్వే చేసే సిబ్బందికి ప్రజల నుంచి పలు సందేహాలు, ప్రశ్నలు ఎదురవుతున్నాయి. వాటిని నివృత్తి చేయటంలో సిబ్బంది విఫలమవుతున్నారు. అడిగిన ప్రశ్నలకు ఏం సమాధానం చెప్పాలో తెలియక సతమతమవుతున్నారు. ప్రజా పాలన సభల్లో దరఖాస్తులు స్వీకరించి దాదాపు సంవత్సరం కావొస్తుంది. అప్పట్లో తెల్లరేషన్‌ కార్డు ఉన్నవారికి పథకాలు అనడంతో కొందరు సొంతంగా ఖాళీ స్థలం ఉన్నా, ఇంటి పథకానికి అప్లై చేయలేదు.

ఇప్పుడేమో రేషన్‌ కార్డు లేకున్నా ప్రభుత్వ పథకాలకు అర్హులే అంటున్నారు. కానీ ఇప్పుడు దరఖాస్తు చేద్దామంటే వీలు కాదంటున్నారు. గతంలో పెట్టుకున్న అర్జీల వివరాలు యాప్‌లో పొందుపర్చామని, ప్రస్తుతం వాటిని మాత్రమే సర్వే చేస్తున్నామని సిబ్బంది సమాధానం ఇస్తున్నారు.

ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పేదెవరు? :

దంపతులిద్దరూ జిల్లా కేంద్రంలో అద్దింట్లో ఉంటూ చిన్న పనులు చేసుకొని జీవనం సాగిస్తున్నారు. వీరు ప్రజా పాలనలో ఇంటి కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీరికి సొంతంగా ఖాళీ స్థలం ఉందని వివరాల్లో రాశారు. కానీ సర్వే సందర్భంలో స్థలం దస్తావేజులు అడుగుతున్నారు. పుట్టింటి వారు ఉన్న దాంట్లో ఒక్కపక్కగా ఉన్న వంద, నూట యాభై చదరపు గజాలు పసుపు కుంకుమల కింద ఇస్తారు. వీటికి పత్రాలు రాసుకోరు అని సర్వేయర్లకు చెప్పగా, వారు పెద్ద మనుషుల సమక్షంలో రాసుకున్న పత్రాలైనా తీసుకు రావాలని అంటున్నారు. ఇప్పటికిప్పుడు రాయించుకుని రావడం అంటే ఇబ్బందేనని అర్జీదారులు వాపోతున్నారు. సర్వే ప్రక్రియకు ఆటంకంగా మారటంతో సిబ్బంది స్థలం లేదని వివరాలు నమోదు చేస్తున్నట్లుగా ఫిర్యాదులందుతున్నాయి.

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక - సొంత స్థలం ఉన్నవారిలో ఎక్కువ మంది వాళ్లే

సర్వేయర్లు చెప్పకపోతే ప్రజలకు ఎలా తెలిసేది? :నిజామాబాద్‌లో ఉంటూ ప్రైవేట్ ఉద్యోగం చేసుకుంటున్న కుటుంబానికి కామారెడ్డి జిల్లాలో స్థలం ఉంది. వీరు ప్రజాపాలన దరఖాస్తు నిజామాబాద్‌లోని అద్దె ఇంటి చిరునామాతో పెట్టారు. సర్వే సిబ్బంది ఇక్కడ ఇంటి వద్ద మహిళను ఫొటో, పక్క జిల్లాలో ఉన్న స్థలం దస్తావేజుల ఫొటో తీసి యాప్‌లో పొందుపర్చారు. కానీ, స్థలం వద్ద మహిళను నిల్చోబెట్టి ఫొటో తీసి పొందుపర్చాలనేది నిబంధన. జీపీఆర్‌ఎస్‌ ప్రకారం ఆ స్థలంలో ఇల్లు నిర్మిస్తేనే బిల్లు ఇస్తారని తెలిపారు. కానీ సర్వే సిబ్బంది పక్క జిల్లాలో ఖాళీ స్థలం వద్ద ఫొటో దిగాలి అన్న విషయం చెప్పటం లేదు. ఇలాంటి దరఖాస్తులను స్థలం ఉన్న జిల్లాకు బదిలీ చేయాలని సూచించినా, సర్వేయర్లు చేయటం లేదు. ఈ అర్జీదారుల భవితవ్యం ఏంటనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది.

కనీసం పరిశీలించరా! : మహిళల పేరిట లబ్ధి చేకూర్చేలా ప్రకటన చేశారు. ఈ సందర్భంలో వృద్ధురాలైన తల్లి పేరిట రేషన్‌ కార్డు ఉన్నవారు ఆమెతోనే దరఖాస్తు పెట్టించారు. ఇలా అర్జీ పెట్టుకున్న వారు మరణించిన ఘటనల్లో ఆ దరఖాస్తును యాప్‌లో కుటుంబ సభ్యుల పేరు మీదకు మార్చటం లేదు. కనీసం పరిశీలించడం లేదు కూడా.

తెల్లరేషన్‌కార్డు ఉన్నవారు సొంత స్థలంలో ఇల్లు నిర్మించుకుంటే రూ.5 లక్షల ఆర్థిక సాయం ఇస్తామన్నారు. కొందరు వారికి ఉన్న స్థలంలో కొంత డబ్బు పెట్టి పిల్లర్లు, గోడల వరకు నిర్మించుకున్నారు. ప్రభుత్వ సహాయం మంజూరైతే మిగతా నిర్మాణం పూర్తి చేసుకుంటామని తిరుగుతున్నారు. వీరికి అవకాశం ఇవ్వటంపై అధికారుల నుంచి ఎలాంటి సమాధానం రావటం లేదు.

సమస్యలపై నేడు సమీక్ష : ఇందిరమ్మ పథకం యాప్‌లోని వివరాల ద్వారా సర్వే చేపడుతున్న సందర్భంలో తలెత్తుతున్న సమస్యలపై సమీక్షించేందుకు 30వ తేదీన రాష్ట్ర స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. దృశ్యమాధ్యమం ద్వారా జరిగే సమావేశంలో ఏ జిల్లా సిబ్బంది ఆ జిల్లా నుంచే ఈ సమావేశంలో పాల్గొంటారు. ఈ సందర్భంగా క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యలు చర్చకు వచ్చే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు. ఇలాంటి విషయాలను పర్యవేక్షించేందుకే ప్రభుత్వం గృహ నిర్మాణ శాఖను పునరిద్ధిరించింది.

'ఊత కర్ర' ఉంటేనే ఇందిరమ్మ ఇళ్ల సర్వే - ఆ ఊళ్లో అధికారులకు వింత అనుభవం

ఇందిరమ్మ ఇళ్ల 'సర్వే'త్రా.. సాంకే'తికమక' - సిగ్నల్‌, సర్వర్‌ సమస్యలతో సర్వేయర్లకు ఇక్కట్లు

Last Updated : Dec 30, 2024, 6:44 AM IST

ABOUT THE AUTHOR

...view details