Python Stuck in Himayatsagar Gates :సాధారణంగా ఎక్కడైనా పాములు ఉండడం సహజం. అడవి, దట్టమైన చెట్లు ఉన్న చోటే వాటి నివాసం. కానీ అవి మనం ఉన్న చోటే ఉంటే ఎలా ఉంటుంది. ఊహించుకుంటానే గుబులు పుడుతోంది కదా. అది కూడా మనం తిరిగే ప్రదేశాల్లో కాకుండా ఏకంగా ఇంట్లో, బాత్రూంలో, బైక్‌లో, వాషింగ్ మెషిన్‌లోనూ ఉంటే ఎవరికైనా వామ్మో అని భయం వేస్తుంది. అవును మీరు భయపడినా ఇంట్లోనూ, బాత్రూంలో ఆఖరికి బైక్‌లో కొండచిలువ ఉన్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇలాంటి ఘటనలు జరిగిన చోట అక్కడున్న వ్యక్తులు భయాందోళనకు గురికావడం పక్కా. ఇలాంటి ఘటనలతోనే కొందరు పచ్చదనం ఉన్న చోట మరి జాగ్రత్తగా ఉంటున్నారు.
సాగర్ గేట్ల మధ్యలో కొండ చిలువ :ఈరోజుల్లో ఇంట్లోనే కొండ చిలువ వంటి పాములు వస్తే ఆహ్లాదంగా, పచ్చదనం, ప్రకృతి వికసించేలా ఉన్న ప్రాంతాల్లో రాదా మరి. తాజాగా హిమాయత్ సాగర్ రిజర్వాయర్ గేట్ల మధ్యలో ఓ కొండ చిలువ చిక్కుకుంది. ఆదివారం సాయంత్రం హిమాయత్ సాగర్ గేట్ల మధ్యలో చిక్కుకుని విలవిలలాడుతూ అక్కడున్న సిబ్బందికి కనిపించింది. దీంతో వెంటనే అక్కడున్న సిబ్బంది స్నేక్ సొసైటీ సభ్యులకు సమాచారం ఇచ్చారు. వారు సైతం వెంటనే వచ్చి సాహసోపేతంగా తాడు సాయంతో గేట్ల మధ్యలో చిక్కుకున్న కొండ చిలువను రక్షించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియోలో తెగ వైరలవుతోంది. నెటిజన్లు సైతం కొండ చిలువకు హిమాయత్ సాగర్ గేట్ల వద్ద ఏం పని ఉందో అంటూ కామెంట్లు చేస్తున్నారు. కొండ చిలువను స్నేక్ సొసైటీ సభ్యులు కాపాడిన తీరునూ అభినందిస్తున్నారు.