BRS Leader KTR Tribute to PV Narasimha Rao : మాజీ ప్రధాని, దివంగత పీవీ నరసింహారావు జీవిత చరిత్రను కేంద్రం ఎన్సీఈఆర్టీ పాఠ్యపుస్తకాల్లో చేర్చాలని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ డిమాండ్ చేశారు. పీవీ జయంతి సందర్భంగా తెలంగాణ భవన్‌లో ఆయనకు నివాళులు అర్పించారు. కేటీఆర్ తో పాటు పీవీ కూతురు, ఎమ్మెల్సీ వాణీదేవి, మాజీ మంత్రులు జగదీశ్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, మహమూద్ అలీ, తదితరులు అంజలి ఘటించారు.
బహుభాషా కోవిదుడు - ఆర్థిక సంస్కరణల ఆద్యుడు పీవీ :అసమాన తెలివితేటలు, బహుభాషా ప్రజ్ఞాపాఠవంతో ప్రపంచం దృష్టిని ఆకర్షించిన గొప్ప మేధావి పీవీ అని కొనియాడిన కేటీఆర్, భారతదేశం ఉన్నన్ని రోజులు ఆయన పేరును దేశ ప్రజలు గుర్తుంచుకుంటారని పేర్కొన్నారు. ప్రధానిగా తొలిసారి దక్షిణాది నుంచి దేశానికి నాయకత్వం వహించిన గొప్ప వ్యక్తి అని, పీవీకి ముందు, ఆయన పాలన తర్వాత అన్నతీరుగా దేశ ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చారని తెలిపారు. 16 భాషల్లో అద్భుతమైన భాషా ప్రావీణ్యం ఉన్నా కొన్నిసార్లు, తన మౌనమే తన భాషగా గొప్ప పాలన నిర్వహించారని కేటీఆర్ అన్నారు.
"ముఖ్యమంత్రిగా భారతదేశమే అచ్చెరువు చెందేవిధంగా, తాను పెద్ద భూస్వామ్యకుటుంబం నుంచి వచ్చినా, తన సొంత భూమి 800 ఎకరాలు ఆనాడు భూసంస్కరణల్లో భాగంగా ప్రభుత్వానికి దారాధత్తం చేసి దేశానికే ఆదర్శంగా నిలబడ్డ నాయకుడు పీవీ నరసింహారావు. తరువాత విద్యారంగంలో మంత్రిగా ఒకసారి అవకాశం వస్తే నవోదయ పాఠశాలలు, గురుకులాలు పెట్టి ఇవాళ పిల్లల భవిష్యత్‌కు బంగారు బాట వేసిన సంస్కరణశీలి ఆయనే."-కేటీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్
80 ఏళ్ల వయసులో కంప్యూటర్ విద్య నేర్చుకున్న నిత్య విద్యార్థి : తన సొంత 800 ఎకరాల కుటుంబ భూమిని ప్రభుత్వానికి అప్పగించి దేశంలో కీలకమైన భూసంస్కరణలను ప్రారంభించారని, దేశంలో నవోదయ పాఠశాలలు, గురుకులాలు పెట్టి విద్యారంగానికి ఎనలేని సేవలు చేశారని గుర్తు చేశారు. 80 ఏళ్ల వయసులో కంప్యూటర్ విద్య నేర్చుకున్న నిత్య విద్యార్థి పీవీ అందరికీ ఆదర్శమని తెలిపారు. తెలంగాణ ప్రజల ఆకాంక్ష, బీఆర్ఎస్ పార్టీ విజ్ఞప్తి మేరకు పీవీకి భారతరత్న ప్రకటించినందుకు కేంద్రానికి ధన్యవాదాలు చెప్పారు.