Public Facing Problems With Damage Roads in Krishna District : జగన్ అధికారంలో ఉన్న ఐదేళ్లలో రాష్ట్రంలో ఒక్క ప్రాంతానికి కూడా నూతన రోడ్లు వేసిన పాపాన పోలేదు. కొత్త రోడ్ల సంగతి దేవుడెరుగు. కనీసం పాడైపోయిన రోడ్లను మరమ్మత్తులు చేయాల్సిన ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహారిస్తుంటే ఇక ప్రజల ప్రాణాలకు దిక్కెవరు. తాము పన్నుల రూపంలో చెల్లించిన డబ్బులతోనైనా కనీసం రెండేళ్ల కొసారైనా మరమ్మతులు, కొత్త రోడ్లు వేస్తే బాగుండని ప్రజలు అంటున్నారు.
రహదారుల ప్రాజెక్టును గాలికొదిలేసిన సర్కారు - రుణాలు ఆపేస్తామని కేంద్రం, ఎన్డీబీ హెచ్చరిక
రాష్ట్ర ప్రధాన రహదారులు మెరిసిపోతే చాలా? మండల, గ్రామీణ ప్రాంత రోడ్ల పరిస్థితి గురించి పట్టించుకోరా? అంటే మాకెందుకు అదంతా అన్నట్టు ఉంది వైసీపీ నాయకులు పని చూస్తే. ఉమ్మడి కృష్ణ జిల్లాలోని ప్రధాన రహదారులతో పాటు గ్రామీణ ప్రాంతాల రహదారులు పరిస్థితి దారుణంగా తయారైంది. అడుగడుగునా రాళ్లు తేలిన రోడ్లతో కనీసం తిరగలేని పరిస్థితి నెలకొంది. మరోవైపు ఆర్భాటంగా ప్రారంభించిన ప్రధాన రాష్ట్ర రహదారుల నిర్మాణం ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. వైసీపీ 5ఏళ్ల పాలనలో ధ్వంసమైన రోడ్లపై గుప్పెడు మట్టి వేసిన దాఖలాలు లేవు. గుంతలు పడినా రోడ్డుపై ప్రయాణాలు చేసి చాలామంది వాహనదారులు ప్రాణాలు కొల్పోతున్నా చూసి పట్టించుకున్న నాథుడే లేడు.
తీవ్ర ఇబ్బందులు పడుతున్న వాహనాదారులు, ప్రజలు : ఉమ్మడి కృష్ణా జిల్లా అంతా న్యూడెవలప్‌మెంట్ బ్యాంకు నిధులతో రహదారులు చేపట్టారు. ఒకే ప్యాకేజీ కింద టెండర్లను పిలిచి పనులు అప్పగించారు. కానీ, అవి ఎక్కడిక్కడే నిలిచి పోయాయి. అధికారులు, గుత్తేదారులు ఎంత గగ్గోలుపెట్టినా పాలకులు నిద్రమత్తులో కాలయాపన చేయడంతో రహదారులు ఆధ్వానంగా మారి అభివృద్ధికి అవరోధం ఏర్పడింది. బ్యాంకు అడ్వాన్స్‌గా ఇచ్చిన రుణ మొత్తాన్నీ గుత్తేదారులకు పూర్తిగా చెల్లించకపోగా రాష్ట్ర ప్రభుత్వ వాటా నిధులు కూడా విడుదల చేయలేదు. రాష్ట్రమంతా కలిపి సగటున 31% పనులే జరిగాయంటే ఈ ప్రాజెక్టు పురోగతి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. కొన్ని జిల్లాల్లో అయితే 10 నుంచి 15 శాతంలోపే పనులు జరగడం గమనార్హం. NDB రుణంతో మండల కేంద్రాలతోపాటు వాటి నుంచి జిల్లా కేంద్రాలకు అనుసంధానంగా ఉండే సింగిల్ రహదారులను రెండు వరుసలుగా విస్తరించే ప్రాజెక్టు 2019లో రాష్ట్రానికి మంజూరైంది. ఇందులో భాగంగా 6400 కోట్లతో 2514 కిలో మీటర్ల మేర రోడ్లను 2 దశల్లో విస్తరించి, వంతెనలు నిర్మించాల్సి ఉంది. తొలి విడతలో 1887 కోట్లతో 1244 కిలో మీటర్ల మేర 119 రోడ్లను విస్తరించేలా 2021లో గుత్తేదారులకు పనులు అప్పగించారు. కానీ, పనులు చేపట్టిన కొన్ని రోజులకే ఆగిపోయాయి. దీంతో అటువైపుగా వెళ్తున్న వాహనాదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడాల్సిన దుస్థితి నెలకొంది.
ప్రయాణికులు పడుతున్న అవస్థలపై వార్త పత్రికల్లో కథనాలు : కృష్ణాజిల్లాలో ఉన్న 7 నియోజకవర్గాల్లో ప్రధాన రహదారులు మినహా మిగిలిన ఏ రోడ్డు చూసిన గుంతలమయమే. గ్రామాలకు వెళ్లే రహదారులు అయితే మరింత దారుణం. గుంతలు పడిన ఈ రోడ్డుపై ద్విచక్ర వాహనదారులు ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా ప్రమాదానికి గురి కావాల్సిందే. ఇటీవల కూచిపూడి రహదారిపై ప్రయాణికులు పడుతున్న అవస్థలపై వార్త పత్రికల్లో రావడంతో అధికారులు అప్రమత్తమై భారీగా ఏర్పడిన గుంతలు ఏదో తాత్కాలికంగా పూడ్చారు. ఆ పనులు తాత్కాలికం కావడం తిరిగి వాహనాల రాకపోకలు సాధారణంగా మారడంతో పరిస్థితి మళ్లీ మెదటికి వచ్చింది. కూచిపూడి నుంచి మొవ్వ, కొడాలి, మోపిదేవి, చల్లపల్లి ఇతర గ్రామాల వరకు రోడ్డు దారుణంగా తయారైంది. వివిధ పనుల నిమిత్తం ఎక్కువగా కూచిపూడి, మొవ్వ, అవనిగడ్డకు ప్రజలు రాకపోకలు సాగిస్తుంటారు. ఈ రహదారికి మరమ్మత్తులు చేయించాలని ప్రజలు కోరుతున్న ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదు.
"NDB నిధులతో చేపట్టిన రహదారుల పనుల్లో 8 ప్రారంభించగా ఐదు అసలు నిర్మాణమే చేపట్టలేదు. మచిలీపట్నం కమ్మవారి చెరువు మధ్య 12.96 కిలోమీటర్ల రోడ్డు పనులు ప్రారంభం కాగా ఇందులో 7.80కోట్ల రూపాయల విలువైన పనులు పూర్తయ్యాయి. ఇంకా 7.680 కిలోమీటర్ల మేర బీటీ వేయాల్సి ఉంది. కౌతవరం-నిడుమోలు-ఐతవరం మధ్య 16.49 కిలో మీటర్ల రోడ్డు నిర్మాణం చేయాల్సి ఉండగా 11.5 కిలో మీటర్ల WBMM పనులు మాత్రమే పూర్తి చేశారు. దీనికి 13.50కోట్ల రూపాయలు ఖర్చు అయినట్టు అధికారులు చెబుతున్నారు. ఈ రహదారి మొత్తం నిర్మాణ వ్యయం రూ. 57.25 కోట్లు కాగా అందులో సగం కూడా పూర్తి కాలేదు. ఇవి కొన్ని మాత్రమే ఇలా జిల్లా వ్యాప్తంగా చాలా చోట్ల ఆసంపూర్తిగా పనులు రోడ్ల పనులు నిలిచి పోయాయి."- స్థానికుడు