Child Marriages in Parvatipuram Manyam District : బాల్య వివాహాలను అడ్డుకోవడంతో పాటు ముందుగానే గ్రామాల్లో తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ శ్యామ్‌ప్రసాద్ ఆదేశించారు. ప్రస్తుతం మారుమూల గ్రామాల్లోనూ ప్రభుత్వ యంత్రాంగం ఉంది. అయినా అడ్డుకట్ట పడటం లేదు. ఈ నేపథ్యంలో గ్రామాల్లో ఉండే మహిళా పోలీసులు, అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆశాలు, ఉపాధ్యాయులు, కార్యదర్శులు, వీఆర్వోలు ఇలా ప్రజలతో మమేకమయ్యే అధికారులంతా తల్లిదండ్రులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది.
ఎన్నో కార్యక్రమాలున్నా : బాలికల కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు, ప్రోత్సాహకాలు అందజేస్తోంది. ఇంజినీరింగ్ చదువుకు ఫీజు రీయంబర్స్‌మెంట్ కల్పిస్తోంది. గ్రామీణ ప్రాంతాలకు ఇంటర్మీడియట్ చదువును చేరువ చేసింది. స్వయం ఉపాధి కోర్సులను అమలు చేస్తోంది. ఇన్ని అవకాశాలు ఉన్నప్పటికీ బాలికల చదువుపై కొందరు తల్లిదండ్రులు ఆసక్తి చూపడం లేదు. పైగా బాల్య వివాహాలు చేస్తున్నారు. ప్రతి బాలికా డిగ్రీ వరకైనా చదివేలా అధికారులు చొరవ చూపితే తల్లిదండ్రుల ఆలోచనల్లో మార్పు వస్తుందని పలువురు నిపుణులు చెబుతున్నారు.
గతేడాది జిల్లా ఆసుపత్రిలో ప్రసవాలు | 83 (18 ఏళ్ల లోపువారు) |
గర్భం దాల్చుతున్న చిన్నారులు | 130 నుంచి 140 మంది |
జిల్లాలో ఏటా అడ్డుకుంటున్న బాల్య వివాహాలు | 15 నుంచి 20 |
ఈ లెక్కలు చాలు పార్వతీపురం మన్యం జిల్లాలో బాలికల పరిస్థితి ఎలా ఉందో అర్థం కావడానికి. బాల్య వివాహాల నియంత్రణపై అధికార యంత్రాంగం దృష్టి పెట్టినా ఎక్కువగా గిరిజన ప్రాంతం కావడంతో తలనొప్పిగా మారింది. కొందరు తల్లిదండ్రులు 18 ఏళ్లు నిండక ముందే వివాహాలు చేస్తుండటంతో గర్భం దాల్చుతున్నారు. ఇలాంటి ఘటనలు గతేడాది 139 నమోదైనట్లు ఐసీడీఎస్ అధికారులు గుర్తించారు. జిల్లా కేంద్రంలో ఏకంగా 83 మంది ప్రసవించినట్లు వైద్యులు చెబుతున్నారు. వారు అనేక అనారోగ్య సమస్యలకు గురవుతున్నట్లు తెలిపారు.
గుట్టుచప్పుడు కాకుండా చిన్నారుల పెళ్లి - అధికారులు ఏం చేస్తున్నారో?
సమాచారం ఇవ్వండి:
'ప్రస్తుతం ఆడపిల్లలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. వారికి చిన్నప్పుడే పెళ్లి చేయాలనే ఆలోచన నుంచి తల్లిదండ్రులు బయటకు రావాలి. అన్ని గ్రామాల్లో అవగాహన కల్పిస్తున్నాం. ఎక్కడైనా బాల్య వివాహాలు చేస్తే టోల్‌ఫ్రీ నంబరు 1098కు సమాచారం తెలియజేయండి' -జిల్లా బాలల సంరక్షణాధికారి సత్యనారాయణ
ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం : గిరిజన ప్రాంతాల్లో చాలా చోట్ల బాల్య వివాహాలు జరుగుతున్నాయి. వీటితో కలిగే నష్టాలను ప్రజలకు వివరిస్తున్నాం. జిల్లా ఆసుపత్రిలో గతేడాది తక్కువ వయసున్న 83 మంది ప్రసవించారు. ఇది ఏమాత్రం శ్రేయస్కరం కాదు. వారి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. జీవితాంతం సమస్యలను ఎదుర్కోవాల్సి రావొచ్చు.