Wife Killed Husband With Boyfriend : నేటి సమాజంలో వివాహేతర సంబంధాలు దాంపత్య బంధాన్ని కడతేర్చుతున్నాయి. ఓ వైపు ఆ మోజులో పడి కట్టుకున్న వాడిని కడుపున పుట్టిన వాళ్లను సైతం వదిలేసేందుకు సైతం సిద్ధమవుతున్నారు. మరోవైపు అడ్డొస్తే చంపడానికి సైతం వెనకాడటం లేదు. ఆ తర్వాత జరిగే పరిణామాలు తెలిసినా క్షణిక సుఖాల కోసం కుటుంబాలను వీధిపాలు చేస్తున్నారు. తాజాగా ప్రియుడితో ఊహల్లో తేలుతున్న భార్య తమ బంధానికి కట్టుకున్నవాడు అడ్డొస్తున్నాడని ప్లాన్ చేసి మరీ చంపించింది. ఈ ఘటన శ్రీకాకుళంలో చోటుచేసుకుంది. ఈ కేసు వివరాలను డీఎస్పీ సీహెచ్ వివేకానంద శనివారం వెల్లడించారు.
ఆమదాలవలస మండలం జగ్గువాని చెరువు వద్ద బొబ్బిలిపేట గ్రామానికి చెందిన జి.చంద్రయ్య(42) గత నెల 25న హత్యకు గురయ్యాడు. మృతుడిని భార్య ఈశ్వరమ్మే పథకం ప్రకారం హత్య చేసినట్లు తెలిపారు. ఈశ్వరమ్మకు, బొబ్బిలిపేటకు చెందిన చింతాడ బాలమురళీకృష్ణ మధ్య గత కొంతకాలంగా వివాహేతర సంబంధం నడుస్తోంది. వీరి విషయం చంద్రయ్యకు తెలియడంతో ఇరువురూ అతడిని చంపాలనుకున్నారు. అందుకు బాలమురళీకృష్ణ తమ్ముడు వరసైన అరవింద్‌తో కలిసి ప్లాన్ రచించారు.
ఈ క్రమంలో చంద్రయ్యను హతమార్చేందుకు ఉప్పినవలస గ్రామానికి చెందిన ఏడుగురు యువకులకు సుపారీ ఇచ్చారు. వారు మూడు సార్లు అతణ్ని చంపేందుకు ప్రయత్నాలు చేసి విఫలమయ్యారు. జనవరి 25న రాత్రి 7 గంటల సమయంలో చంద్రయ్య ఇంటి నుంచి బయల్దేరిన విషయాన్ని ఈశ్వరమ్మ మురళీకృష్ణకు ఫోన్‌లో చేరవేసింది. అప్పటికే జగ్గువాని చెరువు వద్ద ఉన్న వారంతా ద్విచక్ర వాహనంపై వస్తున్న చంద్రయ్య తలపై బీరు సీసాతో కొట్టారు. చెరువులో దూకి పారిపోయేందుకు ప్రయత్నించినా వదల్లేదు. కర్రలతో చనిపోయే వరకు కొట్టారు.
Bobbilipeta Murder Case : అనంతరం చంద్రయ్య మెడకు గోనె సంచిని బిగించి చంపేసి అక్కడి నుంచి పరారయ్యారు. ఆ తర్వాత మురళీకృష్ణ ఈశ్వరమ్మకు ఫోన్ చేసి నీ భర్త బాధ వదిలిపోయింది అని చెప్పాడు. అనంతరం ఏమీ తెలియనట్లు నిందితురాలు స్థానిక పోలీస్ స్టేషన్‌లో భర్త కనిపించట్లేదని ఫిర్యాదు చేసింది. చంద్రయ్య మృతదేహన్ని గుర్తించిన స్థానికులు పోలీసులు సమాచారం ఇవ్వడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి నిగ్గు తేల్చారు.
కేసులో చంద్రయ్య భార్యతో పాటు మొత్తం 10 మంది నిందితులను అరెస్ట్ చేశామని డీఎస్పీ సీహెచ్ వివేకానంద తెలిపారు. శనివారం కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కి తరలించామని పేర్కొన్నారు. ఎంతో చాకచక్యంగా కేసును ఛేదించిన సీఐ సత్యనారాయణ, ఎస్సైలు బాలరాజు, సత్యనారాయణ, ప్రవల్లిక, హైమావతి, సిబ్బందిని డీఎస్పీ అభినందించారు.
ఇంట్లో ఎవరూ లేరంటూ పిలిచి - భర్తతో కలిసి ప్రియుడిని కడతేర్చిన వివాహిత
నలుగురి పిల్లల తల్లితో యువకుడి ప్రేమాయణం- ఇంటికి పిలిచి ప్రైవేట్ భాగాలు కట్ చేసిన లవర్!