Conflict Between Sports Associations in AP : విస్తరిలో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని ఉన్నట్లు తయారైంది మన క్రీడాకారుల పరిస్థితి. ఆడాలనే ఆశ, గెలిచి పతకాలు కొట్టగలిగే ప్రతిభ ఉన్నప్పటికీ మన ఆటగాళ్లకి జాతీయ క్రీడల్లో పాల్గొనడమే పెద్ద పరీక్షలా మారింది. రాష్ట్రంలోని క్రీడా సంఘాల మధ్య గొడవలతో నలిగిపోతున్నారు. జాతీయ క్రీడల్లో వేర్వేరు సంఘాల తరఫు నుంచి పాల్గొంటున్నారు. ఉత్తరాఖండ్‌లో జరగబోయే పోటీలకు వేర్వేరుగా వెళ్లనున్నారు.
రెండేళ్ల క్రితం గోవాలో నిర్వహించిన జాతీయక్రీడల్లో కర్ణాటక 101 పతకాలు సాధించి ఆరోస్థానంలో నిలిచింది. తమిళనాడు 77 పతకాలతో పదోస్థానాన్ని సాధించింది. మన రాష్ట్రం 27 పతకాలతో 19వ స్థానానికి పరిమితమైంది. ప్రతిభగల క్రీడాకారులకు, పతకాలు సాధించాలనే తపన కలిగిన యువతకు రాష్ట్రంలో కొదవలేదు. అయినా ఎందుకిలా వెనుకబడుతున్నాం? క్రీడా సంఘాల మధ్య వివాదాలు, రాజకీయాలు క్రీడాకారుల భవితవ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. సంఘాల్లో గొడవల కారణంగా జాతీయ క్రీడల్లో పాల్గొనడమే క్రీడాకారులకు పెద్ద సవాలుగా మారుతోంది.
70 ఏళ్ల వయసు - సైకిల్‌పై రాష్ట్రాన్ని చుట్టేస్తున్నాడు!
జాతీయ క్రీడల్లో ఏ రాష్ట్రం నుంచి అయినా ఒకే ఒలింపిక్ సంఘం తరఫున ఆటగాళ్లు పాల్గొనడం సహజం. మన దగ్గర ఇందుకు విరుద్ధమైన పరిస్థితి ఉంది. ఈ నెల 28న ఉత్తరాఖండ్‌లో ప్రారంభమయ్యే 38వ జాతీయ క్రీడల్లో రాష్ట్రం నుంచి ఏపీ ఒలింపిక్ అసోసియేషన్, క్రీడాసమాఖ్యల తరఫున క్రీడాకారులు రెండు వేర్వేరు బృందాలుగా వెళ్లనున్నారు. జాతీయ క్రీడల్లో పాల్గొనే ప్రతిసారీ ఇదే తీరు. రాష్ట్ర క్రీడాసంఘాల మధ్య వివాదాలను పరిష్కరించి, ఆటగాళ్లలో భరోసాను నింపాల్సిన బాధ్యతను గత ప్రభుత్వాలు పట్టించుకోలేదు. కూటమి ప్రభుత్వం ఇటీవల అద్భుతమైన క్రీడా పాలసీని తెచ్చింది. పతకాలు సాధించేవారికి భారీ నజరానాలను ప్రకటించింది. ఈ నేపథ్యంలో సంఘాల మధ్య వివాదాల్ని పరిష్కరించి, ఒకే జట్టుగా జాతీయ క్రీడలకు పంపే విషయమై ప్రభుత్వం ప్రత్యేకశ్రద్ధ వహించాలని క్రీడాకారులు కోరుతున్నారు.
క్రీడా సంఘాల మధ్య గొడవ : క్రీడాసంఘాల మధ్య గుర్తింపు విషయమై నెలకొన్న వివాద పరిష్కార బాధ్యత ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్‌పై ఉంది. ఆ పని చేయాల్సిన అసోసియేషన్ ఎటూ తేల్చడం లేదు. ఉత్తరాఖండ్‌లో జాతీయ క్రీడల నేపథ్యంలో రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ 2024 డిసెంబరు 6న ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడికి లేఖ రాసింది. రాష్ట్రంలో ఐవోసీ గుర్తింపు పొందిన ఒలింపిక్ అసోసియేషన్‌పై స్పష్టత ఇవ్వాలని అందులో కోరింది. దీనిపై ఎలాంటి స్పందనా లేదు. రాష్ట్రంలో ప్రస్తుతం రెండు ఒలింపిక్ సంఘాలు ఐవోఏ గుర్తింపు తమకు ఉందంటే తమకే ఉందంటున్నాయి.
క్రీడాకారులకు ఇకపై పండగే - కొత్త క్రీడా విధానంతో ఎన్నో ప్రయోజనాలు
క్రీడాసంఘాల మధ్య వివాదాల నేపథ్యంలో శాప్ క్రీడా సమాఖ్యల తరఫున 87 మందిని జాతీయ క్రీడలకు పంపుతోంది. శిక్షణ ఖర్చులు, టీఏ, డీఏ, ప్లేయింగ్ కిట్ కలిపి ఒక్కో ఆటగాడిపై దాదాపు రూ.15,000 వరకు వెచ్చిస్తోంది. శాప్ సాయంతో 9 అంశాల్లో క్రీడాకారులు పాల్గొననున్నారు. రాష్ట్ర ఒలింపిక్ అసోసియేషన్లలోని ఒక సంఘం ఆధ్వర్యంలో మరో 68 మంది పోటీలకు హాజరవుతున్నారు. శాప్ సాయం తీసుకోకుండానే వీరు వెళుతున్నారు. జాతీయ పోటీలకు మొత్తంగా రాష్ట్రం తరఫున 21 క్రీడాంశాలకు 155 మంది అర్హత సాధించినట్లు తెలుస్తోంది.
ఒలింపిక్స్‌లో బంగారు విజేతలకు రూ.7 కోట్లు - ఉద్యోగాల్లో స్పోర్ట్స్ కోటా రిజర్వేషన్ పెంపు