Farmer Rama Rao Cultivates 870 Acres in Tadikonda: వాతావరణ ప్రతికూల పరిస్థితులు, పెరిగిన పెట్టుబడులు, చీడపీడలు కష్టనష్టాలు భరించలేక వ్యవసాయమే వద్దు బాబోయ్ అనే రోజులివి. 10, 20 ఎకరాల్లో సాగు చేయడమే ప్రస్తుతం తలకుమించిన భారంగా మారింది. రేయింబవళ్లు కష్టపడి పండించినా లాభాల్లేక చాలా మంది కాడి వదిలేస్తున్నారు. అయితే ఆయన మాత్రం ఏకంగా 870 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. యాంత్రీకరణకు పెద్దపీట వేస్తూ ఆధునిక సాగు విధానాలు అవలంబిస్తూ పెద్దఎత్తున ఆదాయం ఆర్జిస్తున్నారు. వ్యవసాయం అంటే దండగ కాదు లాభాల పండుగ అని నిరూపిస్తున్నారు.
870 ఎకరాల్లో సాగు: గుంటూరు జిల్లా తాడికొండకు చెందిన గోగినేని రామారావుకు వ్యవసాయంపై చాలా మక్కువ. తనకు 50 ఎకరాల పొలం ఉంది. సాగుపై తనకున్న ఇష్టానికి పొలం సరిపోవట్లేదని భావించి కౌలుకు తీసుకోవడం ప్రారంభించారు. అలా క్రమంగా పెంచుకుంటూ పోతూ ఇప్పుడు ఏకంగా 870 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. పంట మార్పిడి చేస్తూ మినుము, శనగ, మిర్చి, పత్తి, మొక్కజొన్న పండిస్తున్నారు. ఏదో మొక్కుబడిగా సాగు చేస్తున్నారనుకుంటే పొరపాటే. ఎలాగైనా మంచి దిగుబడులు సాధించి వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలని సంకల్పించారు. అందుకోసం చాలా రిస్క్ తీసుకుని రేయింబవళ్లు శ్రమిస్తున్నారు.
పెట్టుబడుల కోసం పొలాన్ని తాకట్టు పెట్టి బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుంటారు. మంచి రకాల విత్తనాలనే ఎంపిక చేసుకుంటారు. మార్కెట్లో పంటలకు ఉన్న ధరల్ని బట్టి వాటి విస్తీర్ణం ఖరారు చేసుకుని సాగు చేస్తున్నారు. సాగు విధానంలో ఎప్పటికప్పుడు వస్తున్న విధానాలను పాటిస్తున్నారు. పంటలకు యంత్రాలను ఉపయోగిస్తూ అవలీలగా వందల ఎకరాల్లో పంటలు పండిస్తున్నారు. సొంతంగా 6 ట్రాక్టర్లు ఉండటంతో కోతలు, నూర్పిడులు, పంట రవాణా కోసం వీటిని వినియోగిస్తున్నారు.
కోనసీమ కొబ్బరికి మంచిరోజులొచ్చాయ్ - 9 వేల నుంచి 15 వేలకు పెరిగిన ధర
చేదోడువాదోడుగా ఉంటున్న కుమారులు: కుటుంబం మొత్తానికి ఏడాదంతా వ్యవసాయమే వ్యాపకం. రామారావుకు ఇద్దరు కుమారులు. అయితే వారు ఇంజినీరింగ్ చదివినా ఉద్యోగాలకు వెళ్లకుండా వ్యవసాయంలో తండ్రికి చేదోడువాదోడుగా ఉంటున్నారు. పొద్దున లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు పొలంలోనే పని. ఎరువులు, విత్తనాలు తీసుకురావటం, కూలీలను పురమాయించటం, పంట విక్రయించటం చేస్తుంటారు. ఎక్కడికో వెళ్లి జీతాలకు పని చేయటం కంటే వ్యవసాయం చేయడంలోనే అసలైన ఆనందం ఉందని చెబుతున్నారు.
ఏడాది పొడవునా పని: ఇంత భారీ మొత్తంలో పొలం సాగు చేయటం ఆషామాషీ వ్యవహారం కాదు. చాలామంది రైతులు సాగును వదిలేస్తున్న తరుణంలో రామారావు మాత్రం ఏటికేడు విస్తీర్ణాన్ని పెంచుకుంటూ పోతున్నారు. వీరు అనుసరిస్తున్న సాగు విధానాలను పరిశీలించేందుకు ఇతర ప్రాంతాల రైతులు వచ్చి వెళ్తుంటారు. వందల ఎకరాల్లో వ్యవసాయం చేయడం వల్ల ఎంతో మంది కూలీలకు ఉపాధి దొరుకుతుంది. నిత్యం 100 మంది ఇక్కడ పని చేస్తుంటారు. రామారావు పొలంలో ఏడాది పొడవునా పని ఉంటుందని తమకెంతో మేలు జరుగుతుందని కూలీలు అంటున్నారు. ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేస్తున్న కారణంగా వీరికి ప్రభుత్వ పథకాలేవీ వర్తించవు. ఇలాంటి పరిస్థితుల్లోనూ సొంత పెట్టుబడులు పెట్టుకుని సాగు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు రామారావు.
పంచదార చిలకలు - చూస్తేనే నోరుతుంది - తింటే టేస్ట్ అద్దిరిపోతుందంతే!