Prominent Political Leaders Condoled the Death of Ratan Tata :ప్రముఖ పారిశ్రామిక వేత్త, మానవతావాది రతన్ టాటా మరణం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దేశం ఒక గొప్ప వ్యక్తిని కోల్పోయిందన్నారు. వారి నిష్క్రమణ పారిశ్రామిక రంగానికే కాకుండా యావత్ దేశానికి తీరని లోటన్నారు. రతన్ టాటా వ్యాపార రంగంలో నిబద్ధతకు, విలువలకు కట్టుబడిన గొప్ప వ్యక్తిగానే కాకుండా దాతృత్వానికి ప్రతీక అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. పద్మవిభూషణ్ సహా అనేక గౌరవ పురస్కారాలు అందుకున్న రతన్ టాటా ఇక మన మధ్య లేకపోవడం బాధాకరమన్నారు. టాటా ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఆయన ఎనలేని సేవలు అందించారని, విద్య, వైద్యం, గ్రామీణాభివృద్ధి రంగాల్లో విశిష్ట సేవలు అందించారని గుర్తు చేశారు.
అరుదైన పారిశ్రామికవేత్త :రతన్ టాటా మృతి పట్ల మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం తెలిపారు. ఆర్థిక ప్రగతికి మానవత్వాన్ని అద్దిన అరుదైన పారిశ్రామికవేత్త రతన్ టాటా అని పేర్కొన్నారు. రతన్ టాటా అద్భుతమైన ఆవిష్కర్త, దార్శనీకుడు, మహనీయుడని కేటీఆర్ అన్నారు. రతన్ టాటా మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని చెప్పారు. భారత వ్యాపార ముఖచిత్రాన్ని మార్చేసిన ఆయన, ఎంతోమందికి ప్రేరణ అని అన్నారు. టీహబ్‌ను చూసిన ప్రతిసారీ, తాము మిమ్మల్ని గుర్తుంచుకుంటూనే ఉంటామని రతన్ టాటా టీ హబ్‌ను సందర్శించిన సందర్భాన్ని గుర్తు చేసుకున్నారు.