Process Begins Of issuing Tirumala Srivari Darshan Tokens To Locals : స్థానికులకు తిరుమల శ్రీవారి దర్శన టోకెన్లను జారీ చేసే ప్రక్రియ ప్రారంభమైంది. తిరుపతిలో టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. నగరంలో ఉన్న మహతి ఆడిటోరియంలో ఈవో శ్యామలరావు, తిరుపతి, చంద్రగిరి ఎమ్మెల్యేలతో కలిసి ఆయన స్థానికులకు టోకెన్లను అందజేశారు. ఈ సందర్భంగా బీఆర్ నాయుడు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సూచనలతోనే స్థానికులకు శ్రీవారి దర్శనం ప్రారభించామని వెల్లడించారు.
నవంబర్ 18న జరిగిన టీటీడీ బోర్డు తొలి సమావేశంలోనే ప్రతి నెల మొదటి మంగళవారం రోజు స్థానికులకు శ్రీవారి దర్శనం కల్పించాలని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. తిరుపతిలోని మహతి ఆడిటోరియం, తిరుమలలోని కమ్యూనిటీ హాల్ లో ఈ టోకెన్లు జారీ చేస్తామన్నారు. డిమాండ్ ను బట్టి టోకెన్లను పెంచే విషయం పరిశీలిస్తామన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి, టీటీడీకి నగరవాసులు ధన్యవాదాలు తెలిపారు.
కొండపై రాజకీయాలకు చెక్ - టీటీడీ కీలక నిర్ణయం
ప్రతి నెల 3వేల టోకెన్లు : అనంతరం టీటీడీ ఈవో శ్యామలరావు మాట్లాడుతూ, తిరుపతి స్థానికుల కోసం నగరంలోని మహతి ఆడిటోరియంలో 7 కౌంటర్లు, అదేవిధంగా తిరుమల బాలాజీ నగర్‌లోని కమ్యూనిటీ హాల్‌లో మరో 3 కౌంటర్లు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ప్రస్తుతం డిసెంబరు నెలకు సంబంధించిన టోకెన్లను తిరుమలలో 500, తిరుపతిలో 2,500 జారీ చేస్తామన్నారు. శ్రీవారి దర్శనం కోసం వేచివున్న స్థానికులైనా తిరుపతి అర్బన్, తిరుపతి రూరల్, రేణిగుంట, చంద్రగిరి, తిరుమల నివాసితులకు ఒరిజినల్ ఆధార్ కార్డు ధృవీకరణతో టోకెన్లు జారీ చేయనున్నట్లు చెప్పారు.