Srikakulam These Villages Celebrate Bhogi Differently : తెలుగింట అతిపెద్ద వేడుక సంక్రాంతి. పల్లెలన్నీ పండగ శోభతో వెలిగిపోతాయి. మూడు రోజుల పాటు జరిగే సంబరాలకు ఉపాధి, ఉద్యోగ రీత్యా దేశ, విదేశాల్లో స్థిరపడిన వారంతా పురిటిగడ్డపై వాలిపోతారు. తొలిరోజు నిర్వహించే భోగి పండగ ప్రత్యేకమైంది. పిల్లలు, పెద్దలు అంతా కలిసి మంటలు వేస్తుంటారు. కానీ శ్రీకాకుళం జిల్లాలోని ఈ పండగను కొన్ని గ్రామాల్లో విభిన్నంగా జరుపుకుంటారు. కొన్నిచోట్ల అసలు మంటే వెలగదు. మరికొన్నిచోట్ల రెండురోజులు చేస్తున్నారు. తరతరాలుగా వస్తున్న ఆనవాయితీని పాటిస్తున్న ఆ గ్రామాలేంటి ఎందుకలా చేస్తున్నారో ఈ కథనం ద్వారా తెలుసుకుందాం.
ఈ పల్లెల్లో మంటలే వెలగవు
- జలుమూరు మండలం లింగాలవలసలో భోగి పండగ నిర్వహించరు. పూర్వం ఆరోజున సమీపంలోని కొండ నుంచి పులి చొరబడి దొరికిన వారిని ఎత్తుకెళ్లి సంహరించేదని, దాంతో పూర్వీకులంతా ఐకమత్యంతో భోగి పండగ రద్దు చేసేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. 22 ఏళ్ల కిందట ఓ యువకుడు సంప్రదాయాన్ని పక్కన పెట్టి ఈ పండగ నిర్వహించాడు. అదే రోజు అతడు మృత్యువాత పడ్డారని గ్రామస్థులు చెబుతున్నారు.
- గార మండలం బూరవల్లిలో మంటలు వేయరు. ప్రజలు అనారోగ్య సమస్యలు ఎదుర్కొన్నారని, ఆ కారణంగానే నాటి నుంచి గ్రామంలో భోగీ చేసుకోవడం లేదని పెద్దల మాట.
- నరసన్నపేట మండలం బసివలస, చింతువానిపేట, గోకయ్యవలస, చోడవరం, సుందరాపురం గ్రామాల్లో వేడుక చేయరు. బసివలసలో వందల ఏళ్ల క్రితం జరిగిన చిన్నపాటి ఘర్షణ నేపథ్యంలో గ్రామంలో భోగి పండగపై అప్పటి పెద్దలు నిషేధం విధించారని, అప్పటి నుంచి అదే సంప్రదాయం పాటిస్తున్నామని గ్రామస్థులు తెలిపారు. గోకయ్యవలసలో మంటల్లో పిల్లి పడి మరణించిందని, ఆ ఘటన అపశకునంగా భావించి వేడుకలు జరపడం లేదని పెద్దలు తెలిపారు.
సంక్రాంతి అంటేనే స్వీట్లు హాట్లు- ఘుమఘమలాడే వంటకాలతో కిటకిటలాడుతున్న మిఠాయి షాపులు
బెల్లుపడలో రెండు రోజులు : ఇచ్ఛాపురం పట్టణం బెల్లుపడలో భోగి పండగ రెండు రోజుల పాటు జరుగుతుంది. ఒక రోజు ముందే వేడుకలను ప్రారంభిస్తారు. బెల్లుపడ ఉమామహేశ్వరాలయం సమీపంలో మండపం ఎదురుగా మంటలు వేస్తుంటారు. ఇది తరతరాలుగా వస్తున్న ఆచారమని గ్రామస్థులు పాపారావు, సంతు తెలిపారు.
బడ్డవానిపేటలో ఒకరోజు ముందే : ఉర్లాం పంచాయతీ పరిధిలోని బడ్డవానిపేటలో ఒకరోజు ముందుగా అంటే భోగి ముందు రోజు రాత్రి మంటలు వేసుకొని సందడి చేసుకుంటారు. కారణం తెలియదని, పూర్వకాలం నుంచి ఇదే సంప్రదాయం కొనసాగుతోందని సర్పంచి పోలాకి నరసింహమూర్తి తెలిపారు. కొత్తూరు మండలం కర్లెమ్మలోనూ ముందురోజే చేస్తారు.
అక్కడ సంక్రాంతి అస్సలు జరుపుకోరు : పోలాకి మండలం సొండిపేటలో సంక్రాంతి పండగ అసలు జరపరు. ఇది ఎన్నో ఏళ్లుగా వస్తోందని గ్రామస్థులు చెబుతున్నారు. గ్రామంలో సుమారు 45 కుటుంబాలు ఉంటున్నాయి. ‘మా ఊరిలో నాకు తెలిసి సుమారు 50 ఏళ్లకు పైగా సంక్రాంతి పండగ నిర్వహించిన దాఖలాలు లేవు. దీపావళి మాత్రం అందరం వేడుకగా జరుపుతామని గ్రామస్థుడు ఆదినారాయణ చెప్పారు.
ఇక్కడ నేడే సంక్రాంతి : సాధారణంగా భోగి ఒక రోజు, సంక్రాంతి ఒక రోజు నిర్వహించుకోవడం ఆనవాయితీ. సారవకోటకు చెందిన కూన, అల్లాడ వంశీయులు భోగీ రోజునే సంక్రాంతి కూడా జరుపుతారు. పండగ రోజున చేపట్టాల్సిన పూజా కార్యక్రమాలు భోగి రోజునే ముగిస్తారు. సంక్రాంతి రోజున కొత్త దుస్తులు ధరించడమే తప్ప ఎలాంటి పిండివంటలు, పూజలు చేయమని గ్రామస్థులు తెలిపారు.
అక్కడ కనుమ నాడే : మెళియాపుట్టి మండలం కొసమాల గ్రామంలోని దేవాంగుల వీధిలో కనుమ నాడు భోగి పండగ చేయడం తరాలుగా వస్తున్న ఆచారం. వీధిలో ఉన్న వారంతా చేనేత కార్మికులు కావడంతో పండగ పనుల పూర్తి చేసుకుని కనుమ నాడు వేడుకలు నిర్వహిస్తారు.