Private Travels Doubling Fares on Festival Season in AP :దసరా పండుగకు సొంత ఊర్లకు వెళ్లేందుకు సిద్ధమైన వారిని కొన్ని ప్రైవేటు ట్రావెల్స్ నిలువు దోపిడీ చేస్తున్నాయి. సాధారణ ఛార్జీలను ఒక్కసారిగా పెంచేశాయి. రద్దీ ఎక్కువగా ఉందని, అన్ని బస్సుల్లో సీట్లు నిండిపోయాయని, కొన్ని సీట్లే మిగిలాయంటూ ప్రయాణికుల నుంచి అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నారు. రైలులో బెర్తులు ఖాళీ లేకపోవడం, ఆర్టీసీ బస్సుల్లో సీట్లు పరిమితంగా ఉండటంతో ప్రయాణికులు ప్రైవేటు ట్రావెల్స్‌ను ఆశ్రయించవలసిన పరిస్థితి నెలకొంది.
దసరా పండుగ శనివారం రావడం, ఆదివారం సెలవు కావడంతో ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు గురు, శుక్రవారాల్లోనే సొంత గూటికి పయనం అవుతున్నారు. ఈ 2 రోజులను టార్గెట్ చేసుకొని ప్రైవేట్ ట్రావెల్స్ సంస్థలు సొమ్ము చేసుకుంటున్నాయి. రాష్ట్రంలో 1,200 వరకు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు ఉండగా, పేరున్న ప్రముఖ సంస్థలే బాదుడులో పోటీ పడుతున్నాయి. సాధారణ రోజుల కంటే ఈ 2 రోజుల్లో ఏసీ బస్సుల్లో సగటున ఒక్కో సీటుకు రూ.1000, నాన్ ఏసీ బస్సుల్లో రూ.700 వరకు అదనపు ఛార్జీలు వసూలు చేస్తున్నారు.
దసరా పండుగకు ఇంటికి వెళ్తున్నారా? - అయితే మీకో శుభవార్త - dasara Special Buses
విజయవాడ నుంచి విశాఖపట్నానికి పలు ప్రైవేటు ట్రావెల్స్ ఏసీ బస్సుల్లో ఒక్కో బెర్త్‌కు రూ.2000 నుంచి రూ.2,500 వరకు వసూలు చేస్తున్నారు. విజయవాడ నుంచి కాకినాడకు రూ.1500 నుంచి రూ.2 వేలు వరకు సొమ్ము చేసుకుంటున్నాయి. విజయవాడ నుంచి విశాఖకు ఆర్టీసీ ఏసీ ఇంద్ర సర్వీసులో సీటుకు రూ.905, అమరావతిలో రూ.1,120 కాగా, నాన్ ఏసీ సూపర్ లగ్జరీలో రూ.704 మాత్రమే ఛార్జీ ధరలు ఉన్నాయి. ప్రైవేటు ట్రావెల్స్‌తో పోలిస్తే ఈ రేట్లు తక్కువే. కానీ అనేక బస్సుల్లో ఒకటి, రెండు సీట్లే ఖాళీ కనిపిస్తున్నాయి. దీంతో కుటుంబ సమేతంగా ఊళ్లకు వెళ్లేవారు ప్రైవేటు ట్రావెల్స్‌ను ఆశ్రయించక తప్పడం లేదు. విజయవాడ నుంచి ఉత్తరాంధ్ర, నెల్లూరు, తిరుపతి, రాయలసీమ జిల్లాల్లోని ముఖ్య నగరాలకు వెళ్లే ట్రావెల్స్ ఛార్జీలు అధికంగా ఉన్నాయి.