New Liquor Shops Open in AP From Today : నూతన మద్యం దుకాణాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. నిన్నటితో పాత దుకాణాల గడువు ముగిసింది. ప్రభుత్వ దుకాణాల్లో మిగిలిన మద్యాన్ని డిపోలకు తరలించారు. లాటరీలో లైసెన్స్ దక్కించుకున్న యజమానులు కొత్త దుకాణాల్లో మద్యం అమ్మేందుకు అంతా సిద్ధం చేశారు. కొన్నిచోట్ల లైసెన్స్‌దారులు షాపుల కోసం ప్రాంగణాలను వెతుకులాడే పనిలో ఉన్నారు.
ఇక కోరుకున్న బ్రాండ్
జగన్ హయాంలో ప్రవేశపెట్టిన ప్రభుత్వ మద్యం దుకాణాల్లో ‘జే బ్రాండ్ల’ మద్యం మాత్రమే విక్రయించేవారు. వినియోగదారులు కోరుకున్న మందు దొరికేది కాదు. జాతీయ, అంతర్జాతీయ బ్రాండ్లన్నీ కనుమరుగు చేశారు. తాజాగా మద్యం వ్యాపారం ప్రైవేటు చేతుల్లోకి వెళ్లినందున వినియోగదారులు కోరుకునే బ్రాండ్లన్నీ అందుబాటులోకి తీసుకురానున్నారు. లైసెన్సుదారులు ఆర్డర్లు పెట్టిన రకాలనే సరఫరా చేసేందుకు ఏపీఎస్‌బీసీఎల్ సిద్ధమవుతోంది. దేశవ్యాప్తంగా లభించే అన్ని బ్రాండ్లను వారం రోజుల్లో అందుబాటులో ఉంచనుంది. రూ.99కే క్వార్టర్ మద్యం విక్రయిస్తామని ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో, నాలుగు నేషనల్ కంపెనీలు ఆ ధరలో అందించేందుకు సిద్ధమయ్యాయి. అవి రెండు మూడు రోజుల్లో అందుబాటులోకి రానున్నాయి.
చాలా షాపులు చేతులు మారే అవకాశాలు :లాటరీలో మద్యం దుకాణాలు చేజిక్కించుకున్న యజమానులు అమ్మకాలకు సిద్ధమయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా 3,396 మద్యం దుకాణాలకు నోటిఫై చేసి లాటరీ తీసి లైసెన్స్ కేటాయించారు. లైసెన్స్ పొందిన వారంతా నేటి నుంచి షాపులు ఏర్పాటు చేయాల్సిఉంది. రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల లైసెన్స్‌దారులు ప్రాంగణాలను చూసుకునే పనిలో పడ్డారు. ఎన్టీఆర్ జిల్లాలో అద్దెకు షాపుల కోసం తీవ్రంగా వెతుకుతున్నారు. విజయవాడ నగరంలో చాలా మందికి ఇప్పటికిప్పుడు అద్దెకు షాపులు దొరకలేదు.