Precautions To Be Taken Before Buying Pastries : పెద్ద పండుగలు వస్తున్నాయంటే కచ్చితంగా ప్రతి ఇంట్లోనూ పిండి వంటలు ఉండాల్సిందే. వీటిని కొందరు ఇంట్లో చేసుకుంటే, కొంతమంది బయట కొనుగోలు చేస్తారు. ముఖ్యంగా పిండి వంటల్ని ఆస్వాదించే విషయంలో అస్సలు రాజీపడరు కొంతమంది. ఈ క్రమంలో తమకు నచ్చిన స్వీట్స్, పిండి వంటకాలను మనసారా ఆస్వాదిస్తుంటారు. శుభకార్యాల సమయంలో అతిథుల కోసం రకరకాల స్వీట్లు, పిండి వంటలు కొనుగోలు చేస్తాం. అయితే పిండి వంటలు కొనుగోలు చేసే ముందు తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఆరోగ్యాన్ని కాపాడుకున్న వాళ్లం అవుతామని నిపుణులు అంటున్నారు.
అయితే స్వీట్లు, బేకరీ వస్తువుల తయారీలో ప్రమాదకర రంగులు వాడుతున్నారు. పర్వదినాల్లో మిఠాయిలు, తదితర పిండి వంటలు కొనుగోలు చేసేవారు అన్ని విషయాలు గమనిస్తే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఆరోగ్య రక్షణకు ఆహార భద్రతా అధికారులు సూచించిన నిబంధనలు పాటించాలని తెలుపుతున్నారు.
వంట నూనెల్లోనే ఎక్కువ కల్తీ : పిండి వంటల్లో వాడే వస్తువుల్లో నాసిరకం వాటిని ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. బ్రాండ్ల పేరుతో కల్తీ నూనెలను విక్రయించే అవకాశం ఉంది. నూనె ప్యాకెట్‌పైన తయారీ తేదీ, ఫుడ్ లైసెన్స్ ఉందా? ఎక్కడ తయారు చేశారో వంటి వివరాలను పరిశీలించాలి. అన్ని సరిగా ఉంటేనే కొనుగోలు చేయాలి. వీటితో పాటు రంగులను తక్కువగా వాడటం మంచిది.