Experts Advice On Studying MA With B.Ed : మీరు ఓపెన్ వర్సిటీలో ఎంఏ చదువుతున్నారా? ఒకే సమయంలో పీజీతో పాటు బీఈడీ కూడా చేయాలనుకుంటున్నారా? అయితే ఈ ఆర్టికల్ మీకోసమే. అలా ఒకే సమయంలో రెండు కోర్సులు చదివేందుకు వెసులుబాటు ఉంటుందా? అలా చేస్తే యూజీసీ మార్గదర్శకాల ప్రకారం పీజీటీ(పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్, జేఎల్, డీఎస్సీ లాంగ్వేజ్ పండిట్ ఉద్యోగాలకు అర్హత ఉంటుందా అనే విషయాలపై నిపుణుల సలహాలు మీ కోసం.
యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ఒకే సమయంలో రెండు డిగ్రీలు చదవడానికి వెసులుబాటును కల్పిస్తూ ఏప్రిల్ 2022లో మార్గదర్శకాలను జారీ చేసింది. వీటి ప్రకారం 2 అకడమిక్ ప్రోగ్రాంల బోధనా సమయాలు వేర్వేరుగా ఉన్నట్లయితే, రెండు ఫుల్ టైమ్ ప్రోగ్రాంలను ఒకేసారి చదవొచ్చు. ఒక ప్రోగ్రాంను ఫుల్ టైమ్, మరొ ప్రోగ్రాంను ఓపెన్/ డిస్టెన్స్/ ఆన్‌లైన్ పద్ధతిలో కూడా చదువుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
రెండు డిగ్రీలు చేసే అవకాశం : రెండు డిగ్రీలు, డబుల్ పీజీలు, పీజీతో పాటు మరో డిగ్రీ, డిగ్రీ/ పీజీతోపాటు డిప్లొమా చదివే అవకాశం ఉంది. కానీ ఈ మార్గదర్శకాలనేవి పీహెచ్‌డీ ప్రోగ్రాంనకు వర్తించవు. ఒకే సమయంలో రెండు డిగ్రీలు చదివే వెసులుబాటు అకడమిక్ ప్రోగ్రాంలకు మాత్రమే అని చెబుతూ వీటి ప్రకారం పొందే డిగ్రీలు, డిప్లొమాలు అనేవి సంబంధిత చట్టబద్ధ నియంత్రణ సంస్థల నిబంధనలకు లోబడి ఉంటాయని పేర్కొన్నారు.
ఈ రూల్స్ ప్రకారం- బీఏ, బీఎస్సీ, బీకామ్, ఎంఏ, ఎమ్మెస్సీ, ఎంకామ్ లాంటి అకడమిక్ ప్రోగ్రాంల విషయంలో ఎలాంటి ఇబ్బందీ లేదు. కానీ బీఈడీ, ఎంబీబీఎస్, బీటెక్, ఎల్‌ఎల్‌బీ, ఆర్కిటెక్చర్, ఫార్మసీ, నర్సింగ్, ఎంబీఏ, ఎంసీఏ లాంటి ప్రొఫెషనల్ డిగ్రీలతో పాటు మరో డిగ్రీ కూడా చదివొచ్చా విషయంలో స్పష్టత లేదు. ప్రొఫెషనల్ ప్రోగ్రామ్స్‌కి సంబంధించిన నియంత్రణ సంస్థలైన ఎన్‌సీటీఈ(నేషనల్ కౌన్సిల్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్), ఏఐసీటీఈ, బార్ కౌన్సిల్, మెడికల్ కౌన్సిల్, ఫార్మసీ కౌన్సిల్ లాంటివి ఒకే సమయంలో రెండు డిగ్రీలు చేసే విషయంలో ఎలాంటి మార్గదర్శకాలను ఇవ్వలేదు. కానీ చాలామంది ఇంజినీరింగ్ విద్యార్థులు బీటెక్‌తో పాటు బీఎస్సీ, బీబీఏ లాంటి ప్రోగ్రాంలను ఆన్‌లైన్ మోడ్‌లో చదువుతున్నారు. వారిలో చాలామంది ప్రైవేటు జాబ్స్ కోసం ప్రయత్నిస్తారు కనుక భవిష్యత్తులో పెద్ద ఇబ్బంది ఉండకపోవచ్చు.
ఈ విషయాలు గుర్తుంచుకోండి : కానీ మీరు ఒకే సమయంలో చేయబోయే ఎంఏ(మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్), బీఈడీ డిగ్రీలు ప్రభుత్వ బోధనా ఉద్యోగాలకు (జేఎల్, డిగ్రీ కాలేజీ/ యూనివర్శిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ మినహా) తప్పనిసరిగా అవసరమైన విద్యార్హతలు. ఇప్పుడు మీరు తీసుకోబోయే నిర్ణయం మీ ప్రభుత్వ టీచింగ్ ఉద్యోగ అవకాశాలపై ప్రభావం చూపించే అవకాశం ఉంది కాబట్టి, మరో ఏడాది పాటు ఎంఏ (తెలుగు) చదివి, ఆ తరువాత బీఈడీ గురించి ఆలోచించండి.
బీఈడీ లాంటి ప్రొఫెషనల్ ప్రోగ్రాంను 2 ఏళ్ల పాటు మరే డిగ్రీ చదవకుండా పూర్తి సమయాన్ని కేటాయించి చేస్తే టీచింగ్ స్కిల్స్, విషయ పరిజ్ఞానం పెరిగే అవకాశాలున్నాయి. ఇక జూనియర్ లెక్చరర్‌కు(జేఎల్) పోస్ట్ గ్రాడ్యుయేషన్ అర్హత ఉంటే సరిపోతుంది. బీఈడీ క్వాలిఫికేషన్‌కు సంబంధం లేకుండా అర్హులవుతారు.
బీఏ తర్వాత ఏం చేయాలని ఆలోచిస్తున్నారా? - మీ కోసం బోలెడన్ని జాబ్ ఆఫర్స్! చెక్ చేసుకోండి
జాబ్ చేస్తూ బీఈడీ చదవాలనుకుంటున్నారా?- నిపుణులు ఏమంటున్నారంటే?