Prajavani Responds To a Child Treatment :ప్రజా సమస్యలపై దరఖాస్తులు స్వీకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రజావాణి (Telangana Prajavani) కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో ప్రతి మంగళ, శుక్రవారాల్లో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహిస్తున్నారు.
ప్రజావాణి కార్యక్రమానికి ప్రజల నుంచి భారీ స్పందన వస్తోంది. తమ సమస్యలపై వినతులు ఇవ్వడానికి తెలంగాణ నలుమూలల నుంచి ప్రజలు తరలివస్తున్నారు. అర్జీదారులు తెల్లవారుజాము నుంచే బారులు తీరుతున్నారు. వాళ్ల సమస్యలను దరఖాస్తుల రూపంలో అధికారులకు అందిస్తున్నారు. అధికారులు ఆర్జీలు స్వీకరించి దరఖాస్తు దారులకు భరోసా ఇస్తున్నారు.
ప్రజావాణికి విశేష స్పందన - తెల్లవారుజాము నుంచే క్యూలైన్లు
Prajavani Program in Telangana : తాజాగా ప్రజాభవన్‌లో జరిగిన ఓ సంఘటన మానవత్వాన్ని పరిమళింపజేసింది. యంత్రాంగం అంటే ప్రజల వినతులు స్వీకరించడమే కాదని వారి సమస్యలను పరిష్కరించడమేనని చాటింది. తీవ్ర అనారోగ్యంతో ఉన్న ఓ పసికందుకు వెంటనే చికిత్స చేయించాలని నిర్ణయించిన అధికారులు మానవత్వం చాటుకున్నారు. అసలేం జరిగిందంటే?
హైదరాబాద్ జియాగూడకు చెందిన ఓ నిరుపేద కుటుంబంలో నాలుగు నెలల బాబు ఆనారోగ్యానికి గురయ్యాడు. వారు శిశువును పలు ఆసుపత్రుల్లో చూపించగా వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు చిన్నారి గుండెకు రంధ్రం ఉన్నట్లు తేల్చారు. ఆరోగ్యశ్రీ కింద చికిత్స చేయించుకోవాలన్నా రేషన్ కార్డులో బిడ్డ పేరు ఉండాలి. ప్రైవేట్‌లో రూ.లక్షల్లో ఖర్చవుతుందని చెప్పారు. రెక్కాడితే కానీ డొక్కాడని ఆ కుటుంబం మరింత కుంగిపోయింది.