వానాకాలం నుంచి తెలంగాణలో ఫసల్ బీమా పథకం? రైతులకు కలిగే లాభాలేంటి? Pradhan Mantri Fasal Bima Yojana Scheme Join Telangana :ప్రకృతి విపత్తులు, అతి భారీ వర్షాలు. కళ్లముందు కాసుల రూపంలో కనిపించే పంటంతా నీటిపాలైన పరిస్థితులు. ఆరుగాలం ఇంటిల్లిపాదీ శ్రమించి పండించిన పంటంతా నేలపాలైన సందర్భాలు. పెట్టుబడి మొత్తం తుడిచిపెట్టుకుపోతే రైతన్న పడే మనోవేదన వర్ణనాతీతం. ఈ క్రమంలో అప్పుల పాలయ్యే వారు కొందరైతే, ఆత్మస్థైర్యం కోల్పోయి ఆత్మహత్యలూ చేసుకునే వారు ఇంకొందరు. కాగా పంటకు బీమా లేకపోవడమే ఈ దుస్థితికి కారణంగా చెప్పుకోవచ్చు. ఇలాంటి పరిస్థితులు రాకూడదని, రైతులకు అండగా ఉండాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పంట బీమా పథకాలు అమలు చేస్తున్నాయి.
ఈ క్రమంలో 1985లో సమగ్ర పంటల బీమా పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఆ తర్వాత కొన్ని మార్పులతో 1999-2000 సంవత్సరంలో జాతీయ వ్యవసాయ బీమా పథకాన్ని అమలు చేశారు. అలాగే ఈ పథకాన్ని 2010-2011లో మరోసారి సవరించి రైతులకు బీమా సౌకర్యాన్ని కేంద్ర ప్రభుత్వం కల్పించింది. ఐతే 2014 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం కాలానికి అనుగుణంగా బీమా పథకాన్ని సులభతరం చేసింది. అందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం 2016లో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకాన్ని అమలులోకి తీసుకువచ్చింది.
Fasal Bima Yojana Scheme Full Details :భారతదేశంలో 60% కంటే ఎక్కువగా కుటుంబాలు వ్యవసాయం, దాని అనుబంధ రంగాలపైనే ఆధారపడి జీవిస్తున్నాయి. అందులో చిన్న, సన్నకారు రైతులే ఎక్కువ. పైగా భారత వ్యవసాయాన్ని గ్యాబ్లిండ్ విత్ మాన్‌సూన్ అంటారు. ఇలాంటి పరిస్థితుల్లో సరైనా బీమా పథకం దేశమంతా తీసుకురావాలంటే సవాల్‌గా ఉంటుంది. పైగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో రైతులకు అందించే బీమా అంటే అది కత్తిమీద సాములాంటిదే. అలాంటి ఒక పథకమే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన(PMFBY).
ఈ పథకంతో ఏదైనా విపత్తు సంభవించినా లేదా ఆ రైతు మరణించినా అతడికి సంబంధించిన వారికి కొంత సొమ్ము బీమాగా లభిస్తుంది. అలాగే, జరిగిన ఆస్తి నష్టం తిరిగి పొందడానికి కూడా బీమా ఉపయోగపడుతుంది. కొన్నిసార్లు అతివృష్టి, అనావృష్టి, మరికొన్ని సార్లు మార్కెట్ సరిగ్గా లేక నష్టపోవడం లేదా, పంట చేతికి వచ్చే సమయానికి పురుగురావడం, ఇలా ఎన్నో ప్రమాదాల నుంచి ఫసల్ బీమా పంటల్ని కాపాడుతుంది.
ఫసల్ బీమాను బీమా కంపెనీలతో కలిసి 2016లోనే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. దేశమంతా తెలియజేసేందుకు రైతు సంఘాలు, వివిధ బీమా కంపెనీలతో కలిసి కార్యక్రమాలు చేసింది. అయినా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో తప్ప మిగిలిన రాష్ట్రాల్లో చాలా మంది రైతులకు దీనిపై అవగాహన లేదు. ఇక తెలంగాణ విషయానికి వస్తే కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించినప్పుడు అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఈ పథకంలో చేరింది.
పంటల బీమా పథకంలో కీలక మార్పులు!
తెలంగాణలో ఫసల్ బీమా యోజన పథకం : అయితే రైతు ప్రయోజనాలకు ఈ పథకం పూర్తి విరుద్ధంగా అమలవుతుందని విమర్శిస్తూ 2020లో దాని నుంచి బయటకు వచ్చింది. అందుకు కారణాలు చెబుతూ 2019-20 సంవత్సర కాలానికి తెలంగాణలో 10.34 లక్షల మంది ప్రీమియం చెల్లిస్తే, 3.24 లక్షల మందికి మాత్రమే పరిహారం అందింది. అదికూడా అరకొరగానే అంటూ నాటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం విమర్శించింది. ఐతే వచ్చే వానాకాలం సీజన్ నుంచే ఫసల్ బీమా యోజన పథకాన్ని తెలంగాణలో అమలయ్యేలా కాంగ్రెస్ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలతో ఇప్పటికే వ్యవసాయశాఖ విధివిధానాలను రూపొందిస్తోంది.
రైతులకు నష్టమే తప్ప లాభం లేదని గత ప్రభుత్వం వద్దనుకున్న ఫసల్ బీమా యోజన పథకాన్ని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు అమలు చేయాలనుకుంటుందనే అంశం ప్రస్తుతం చర్చకు తావిస్తుంది. తెలంగాణలో మళ్లీ ఫసల్‌బీమా యోజన పథకంలో చేరుతున్నట్లు ప్రకటించిన సీఎం రేవంత్‌రెడ్డి రైతులకు దన్నుగా నిలుస్తూ సాగు రంగాన్ని బలోపేతం చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. రైతన్నకు రక్షణగా నిలిచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కేంద్ర వ్యవసాయ శాఖ సంయుక్త కార్యదర్శి, పీఎంఎఫ్‌బీవై సీఈవో రితేశ్ చౌహాన్ కూడా ఈ అంశంపై ఇటీవల సమావేశమై చర్చించారు.
వచ్చే పంట కాలం నుంచే రైతులు ఈ పథకంతో లబ్ధి పొందుతారని కేంద్ర, రాష్ట్ర అధికారులు వెల్లడించారు. అయితే ఇందులో బీమా ప్రీమియం చెల్లింపునకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 50 శాతం చొప్పున నిధులను భరిస్తాయి. రాష్ట్ర ప్రభుత్వ వాటాగా ప్రతి సీజన్‌కు రూ.1500కోట్ల చొప్పున ఏటా రెండు సీజన్లకు కలిపి రూ.3 వేల కోట్లు అవసరమని వ్యవసాయశాఖ అంచనా వేసింది. ఇది అమలైతే ప్రకృతి వైపరీత్యాలతో పంటలు నష్టపోయిన రైతులకు ఎలాంటి భారం లేకుండా బీమా అందుతుందని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు.
ఎలా దరఖాస్తు చేసుకోవాలి : ఈ పథకానికి రైతులు ఎలా ధరఖాస్తు చేసుకోవాలంటే? ఆఫ్‌లైన్ ద్వారా అయితే ఎమ్మార్వో కార్యాలయానికి వెళ్లి అప్లై చేసుకోవచ్చు. ఇక బ్యాంక్, మీ సేవ సెంటర్స్ లేదా పీఎంఎఫ్‌బీవై వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రభుత్వ రంగ బ్యాంకులు, రీజినల్ రూరల్ బ్యాంకులు, కోఆపరేటివ్ బ్యాంకుల్లోనూ అప్లై చేసుకోవచ్చు. ఇలా కాకుండా మీరే ఇంట్లో ఉండి www.pmfby.gov.in వెబ్‌సైట్ ద్వారా కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అందులోనే మన దరఖాస్తు స్టేటస్ కూడా తెలుసుకోవచ్చు.
బీమా వివరాలు ఎలా తెలుసుకోవచ్చు : అయితే ఇలా దరఖాస్తు చేసుకున్న రైతుకు ఫసల్ బీమా యోజన ద్వారా పంటలకు పరిహారం ఎలా చెల్లిస్తారని చాలా మందికి సందేహాలు ఉన్నాయి. ఐతే ఈ పథకంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎలా భాగస్వామ్యం ఉందో బీమా కంపెనీలు కూడా ఉంటాయి. మీ సేవ కేంద్రాలు, ఎమ్మార్వో కార్యాలయం, బ్యాంకుల్లో ఇలా ఎక్కడ దరఖాస్తు చేసుకున్నా సరే రశీదుతో పాటు సంబంధిత బీమా కంపెనీ వివరాలు అందిస్తారు. లేదా www.pmfby.gov.in వెబ్‌సైట్‌లోనూ మీ రశీదు నంబర్ ద్వారా తెలుసుకోవచ్చు. ఆ సంబంధిత బీమా కంపెనీని మీరే స్వయంగా సంప్రదించి మీ పంట నష్టం గురించి తెలియజేయవచ్చు. లేదా మీ గ్రామ వీఆర్వో, వ్యవసాయశాఖ అధికారులను సంప్రదించిన ఫలితం ఉంటుంది. మీరు ఫిర్యాదు ఇచ్చిన వారం రోజుల్లోనే సంబంధిత బీమా కంపెనీ అధికారి వచ్చి అంచనా వేసి తగిన పరిహారాన్ని రైతులకు అందిస్తారు.
Crop Insurance Yojana Scheme : పంటల బీమాకు గతంతో పోలిస్తే ప్రీమియాలు పెరిగాయి. ప్రస్తుత వానాకాలం పంటలకు 2 శాతం. యాసంగి పంటలకు 1.5 శాతం, వాణిజ్య పంటలకు 5శాతం ప్రీమియాన్నిబీమా సంస్థలు వసూలు చేస్తున్నాయి. పంట విత్తు నుంచి కోత వరకు ప్రకృతి విపత్తు కారణంగా ఏమైనా నష్టం వాటిల్లితే రైతుకు బీమా సొమ్ము జమ అవుతుంది. కౌలుదారులతో సహా రైతులందరూ ఈ పథకం కింద లబ్ది పొందడానికి అర్హులే.
బీమా విధానం ఏడు జోన్లుగా విభజన: రాష్ట్రం అంతటా ఒకే బీమా విధానం కాకుండా నదీ పరీవాహక ప్రాంతాలు, వర్షాధార పంటలు, సాగునీటి ఆధారిత పంట ప్రాంతాలను పరిగణనలోకి తీసుకొని 7 జోన్లుగా అమలు చేయాలని వ్యవసాయశాఖ సూచించింది. గోదావరి పరీవాహకం కింద ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో అమలయ్యేలా ప్రణాళిక చేస్తున్నారు. అలాగే ఎస్ఆర్ఎస్పీ పరీవాహక ప్రాంతం. మరోవైపు కృష్ణా కింద మహబూబ్‌నగర్ ప్రాంతాన్ని పరిగణలోకి తీసుకున్నట్లు అంచనా. వరి, మొక్కజొన్న, పత్తి, పెసలు, వేరుసెనగ, శనగలు, కందులు, పసుపు, చెరకు,పొద్దుతిరుగుడు, సోయాబీన్ పంటలు పండే ప్రాంతాలకు వేర్వేరుగా ప్రీమియాలు ఉండాలని నివేదించినట్లు అధికారులు చెబుతున్నారు. అయితే ఇది ఎంత కాలానికి అమలవుతుందనేది వేచి చూడాలని నిపుణులు చెబుతున్నారు.
ఫసల్ బీమా పథకం కింద ఎక్కువ విస్తీర్ణం భూమి బీమా పరిధిలోకి రావాలంటే బ్యాంకుల నుంచి పంట రుణాల పంపిణీ కీలకం. అలాగే ప్రీమియం చెల్లించినా ఏడాది మొత్తం పంటలకు ఎలాంటి నష్టాలు జరగని పక్షంలో బీమా కంపెనీలు భారీగా లబ్ధి పొందుతాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రీమియం మొత్తంలో కొంత ప్రభుత్వానికి తిరిగిచ్చే ప్రతిపాదన చేయాలని వ్యవసాయశాఖ నివేదించింది. ఇది శుభపరిణామం. ఐతే దీనిపై ముందుగా కంపెనీలను ఒప్పించి తర్వాత పథకం అమలు చేయాల్సి ఉంటుంది. పరిహారం చెల్లింపుల్లో జాప్యం ఉండకూడదు. పంట నష్టాలను నిర్ణయించేందుకు అనుసరించే విధానాలూ మరింత హేతుబద్ధంగా ఉండాల్సిన అవసరం ఉంది. రకరకాల కారణాలతో రైతులను బీమా సంస్థలు విసిగిస్తున్నాయనే ఆరోపణలున్నాయి. వీటిని సరళీకరిస్తేనే అన్నదాతకు మేలు జరుగుతుందని వ్యవసాయ నిపుణుల అభిప్రాయం.
Central Minister Shobha Karandlaje Fires on BRS Govt : 'దేశవ్యాప్తంగా ఫసల్‌బీమా అమలవుతుంటే.. తెలంగాణలో ఎందుకు అమలు కావడం లేదు'
How to Get Pradhan Mantri Fasal Bima Yojana : ప్రధాన మంత్రి ఫసల్ బీమా.. ఇలా అప్లై చేసుకోండి