IAS Amrapali Posting in AP : తెలంగాణ నుంచి రిలీవై, ఇటీవల ఏపీ కేడర్‌లో రిపోర్టు చేసిన ఐఏఎస్ అధికారిణి కాటా ఆమ్రపాలిని ఆంధ్రప్రదేశ్ పర్యాటకాభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ) ఎండీగా ఆ రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఏపీ టూరిజం అథారిటీ సీఈవోగా (చీఫ్ ఎక్సిక్యూటివ్ ఆఫీసర్)గా పూర్తి అదనపు బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది.
తెలంగాణ నుంచి రిలీవై ఏపీ కేడర్‌లో రిపోర్టు చేసిన వాణీ ప్రసాద్‌కు కార్మిక శాఖ ముఖ్య కార్యదర్శి, వాకాటి కరుణకు ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ బాధ్యతలను అప్పగించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) నీరబ్ కుమార్ ప్రసాద్ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు.
సాధారణ పరిపాలన శాఖకు వాణీ మోహన్ : పురావస్తు శాఖ, మ్యూజియంల విభాగానికి కమిషనర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న జి.వాణీ మోహన్‌ను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. ఆమెను సాధారణ పరిపాలన శాఖలోని జీపీఎం అండ్ ఏఆర్ విభాగం ముఖ్య కార్యదర్శిగా నియమించారు.
ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం కేటాయించిన రాష్ట్రాల్లో రిపోర్ట్ చేయాలని డీవోపీటీ తెలుగు రాష్ట్రాలకు చెందిన ఐఏఎస్ అధికారులను ఆదేశించింది. అయితే డీవోపీటీ ఉత్తర్వులను రద్దు చేయాలని ఐఏఎస్ అధికారులు క్యాట్‌తో పాటు హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఈ రెండు చోట్లా వారికి ఎదురు దెబ్బే తగిలింది. దీంతో తెలంగాణ, ఏపీ సీఎస్‌లు ఐఏఎస్ అధికారులను రిలీవ్ చేస్తూ ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు.