తెలంగాణ

telangana

ETV Bharat / state

పెళ్లైన 5 నెలలకే 2 కిడ్నీల్లో సమస్య - ఆపన్నహస్తం కోసం యువతి ఎదురుచూపులు - A poor family waiting for help - A POOR FAMILY WAITING FOR HELP

A poor family waiting for help : రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి వారిది. రోజూ వ్యవసాయ కూలీ చేయగా వచ్చే డబ్బులతో జీవనం సాగిస్తుంటారు. ఉన్నంతలో ఆనందంగా సాగిపోతున్న వారి జీవితంలో కుమార్తెకు అనారోగ్యం రూపంలో ఒక్కసారిగా విషాదం నెలకొంది. రెండు కిడ్నీలు పాడై ప్రాణాలతో పోరాడుతున్న కుమార్తెను కాపాడుకునేందుకు అక్కడా ఇక్కడా అప్పులు చేసి ఆసుపత్రిలో చేర్పించారు. అయినప్పటికీ ఆమెకు చికిత్స చేయడానికి మరో రూ.10 లక్షలు అవసరపడింది. దీంతో ఆశగా ఆపన్నహస్తం కోసం ఎదురు చూస్తున్నారు.

A poor family waiting for help
A poor family waiting for help (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Oct 3, 2024, 2:28 PM IST

Updated : Oct 3, 2024, 2:52 PM IST

A Poor Family waiting For Help :అల్లారు ముద్దుగా పెంచుకుని పెద్దచేసిన కుమార్తె స్తోమతకు తగినట్లు పెళ్లి జరిపించారు. బాధ్యత తీరిందనుకున్నారు ఆ తల్లిదండ్రులు. ఎన్నో ఆశలతో కొత్త కాపురానికి వెళ్లింది ఆ అమ్మాయి. మెట్టి నింట్లో భర్తతో ఆనందంగా సాగిపోతున్న జీవితం ఇంతలోనే పిడుగు లాంటి వార్త నవ వధువుకు రెండు కిడ్నీలు ఫెయిల్‌ అయ్యాయని వైద్యులు చెప్పడంతో ఇరు కుటుంబాలు తీరని విషాదంలో మునిగిపోయాయి. ఆసుపత్రిలో ఆ యువతి జీవన్మరణ పోరాటం చేస్తోంది.

వివరాల్లోకి వెళితే :జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం ఒడితల గ్రామానికి చెందిన కోడూరి అనూషకు సంవత్సరం కిందట బంధువుల అబ్బాయితో పెళ్లి జరిగింది. ఆమె భర్త హైదరాబాద్‌లో ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. పెళ్లయిన ఐదు మాసాలకు ఓరోజు అనూషకు తీవ్రమైన జ్వరం వచ్చింది. డాక్టర్లు పరీక్షించి రెండు మూత్రపిండాలు పనిచేయడం లేదని నిర్ధారించారు. కొద్దిరోజుల్లోనే ఆమె మరింత అనారోగ్యానికి గురయ్యింది.

హైదరాబాద్​ ఓ ప్రైవేటు ఆసుపత్రిలో యువతిని చేర్పించి వైద్య చికిత్సలను అందిస్తున్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు రోజు విడిచి రోజు డయాలసిస్​ను చేయిస్తున్నారు. మందులకు, డయాలసిస్‌కే రెండు రోజులకు రూ.5 వేల చొప్పున డబ్బులు ఖర్చు అవుతున్నాయని, దాదాపు ఇప్పటి వరకు రూ. 11 లక్షల వరకు ఖర్చు చేశామని కుటుంబ సభ్యులు వివరించారు. అయినప్పటికీ కిడ్నీ మార్పిడికి, శస్త్ర చికిత్సలకు దాదాపు మరో రూ. 10 లక్షలకు పైగానే ఖర్చవుతుందని తెలిపారు. రోజూ వ్యవసాయ కూలీ పనులు చేసుకుని బతికే తమకు అంత ఖర్చు భరించే ఆర్థికస్తోమత లేదని, ఇప్పటికే తెలిసిన వారందరి వద్దా అప్పులు చేసి వైద్యం అందిస్తున్నామని తండ్రి పైడయ్య పేర్కొన్నారు. దాతలు ఆదుకుంటేనే బిడ్డ తమకు దక్కుతుందని కన్నీటి పర్యంతమయ్యారు. ప్రభుత్వం, దాతలు ముందుకు వచ్చి ఆదుకోవాలని కోరుతున్నారు. దాతలు సహాయం చేయదల్చుకుంటే సెల్​ఫోన్​ నంబర్లు 85209 63145, 99129 42026 కి సంప్రదించాలి.

Last Updated : Oct 3, 2024, 2:52 PM IST

ABOUT THE AUTHOR

...view details