Minister Ponguleti on Housing Scheeme : తెలంగాణ రాష్ట్రంలో డిసెంబర్ 5న ఇందిరమ్మ ఇళ్ల పథకానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా శ్రీకారం చుట్టబోతున్నట్లు రాష్ట్ర గృహ నిర్మాణ, రెవెన్యూ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలో మంగళవారం (డిసెంబర్ 03) వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్తో కలిసి ఆయన విస్తృత పర్యటన చేశారు. ఈ సందర్భంగా రూ.3 కోట్ల 62 లక్షల విలువైన పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.
నియోజకవర్గానికి 3500 ఇళ్లు : అనంతరం జరిగిన సభలో మంత్రి మాట్లాడారు. రాష్ట్రంలో 4 లక్షల 50 వేల ఇళ్లను మంజూరు చేస్తున్నామని చెప్పారు. ప్రతి నియోజకవర్గానికి 3500 చొప్పున ఇళ్లను కేటాయిస్తున్నట్లు వెల్లడించారు. ఈ నెల 6వ తేదీ నుంచి గ్రామాల్లో అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి, లబ్ధిదారులను గుర్తించనున్నట్లు పేర్కొన్నారు. గతంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను అప్పుల కుంపటిగా మార్చిందని మండిపడ్డారు. ప్రతి నెల రూ.6 వేల 500 వందల కోట్లు అసలు, వడ్డీ కలిపి చెల్లించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.