తెలంగాణ

telangana

ETV Bharat / state

పాత వాహనాలతో ప్రాణాలకు ముప్పు - నగరంలో కాలుష్యం ఉత్పత్తి చేస్తున్న ఔట్​ ​డేటెడ్​ వెహికల్స్​ - Pollution Increases by Old Vehicles - POLLUTION INCREASES BY OLD VEHICLES

Pollution Increasing by Old Vehicles in Hyderabad : వేసవిలో ఎండలు మండిపోతాయి. వానాకాలంలో వర్షాలు కురవవు. కాలం కాలంలో మాత్రం దంచికొడతాయి. వాతావరణం హఠాత్తుగా మారిపోయి కుండపోత, వడగండ్ల వాన కురుస్తుంది. ఇంతటి ప్రకృతి సమతౌల్య లోపానికి కారణం పెరిగిపోయిన కాలుష్యం కారణంగా సంభవిస్తున్న వాతావరణ మార్పులు. అయితే ఎంతటి విపత్తులు సంభవిస్తున్నా కాలుష్యం పెరగడమే తప్ప తగ్గని పరిస్థితి. అరికట్టే చర్యలు అంతంతమాత్రంగానే ఉండడంతో ఇది ప్రపంచానికి పెను సమస్యగా మారింది. ఈ సమస్యకు హైదరాబాద్ మహా నగరం ఇప్పుడు ప్రత్యక్ష ఉదాహరణగా మారింది. కారణం కాలుష్యానికి కారణం అవుతున్న కాలం తీరిన వాహనాల సంఖ్య పెరగడమే. ప్రతి నాలుగు వాహనాల్లో ఒకటి ఇలాంటిదే కావడం గ్రేటర్ హైదరాబాద్​లో పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. మరి ఎందుకు ఈ దుస్థితి. నిబంధనలు ఏం చెబుతున్నాయి. నగర వాసులు కాలుష్యంతో ఎన్నాళ్లిలా సావాసం చేయాలి.

Pollution increases in Hyderabad
Pollution Increasing by Old Vehicles in Hyderabad

By ETV Bharat Telangana Team

Published : Apr 11, 2024, 9:52 PM IST

పాత వాహనాలతో ప్రాణాలకు ముప్పు - నగరంలో కాలుష్యం ఉత్పత్తి చేస్తున్న ఔట్​ ​డేటెడ్​ వెహికల్స్​

Pollution Increasing by Old Vehicles in Hyderabad :నగర జీవితం అంటేనే కాలుష్యంతో కలిసి నడవడమే. దేశంలోని ఏ నగరమూ ఇందుకు అతీతం కాదు. అయితే అన్ని నగరాల మాట ఎలా ఉన్నా హైదరాబాద్​ నగరంలో మాత్రం పరిస్థితి మరింత భయంకరంగా మారుతోంది. పారిశ్రామిక కాలుష్యానికి తోడు ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోయిన వాహనాల పొగ ఇప్పటికే నగర వాసులను ఉక్కిరిబిక్కిరి చేస్తూ ఉండగా, మరో ఆందోళనకర వాస్తవం వెలుగులోకి వచ్చింది. సాధారణ వాహనాలతో పోలిస్తే అధిక కాలుష్యం వెదజల్లే కాలం తీరిన వాహనాలు నగరంలో ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోయినట్లు తాజాగా తేలింది.

సాధారణంగా 15 ఏళ్లు పూర్తైన వాహనాలను పక్కన పెట్టాల్సి ఉండగా, హైదరాబాద్​లో అలాంటి వాహనాలు నాలుగోవంతు తిరుగుతున్నాయి. ప్రతి నాలుగు వాహనాల్లో ఒకటి హరిత కాలపరిమితి ముగిసిన వాహనమే. ఇవి 15 ఏళ్లు, ఇంకా ఎక్కువ కాలం నుంచి తిరుగుతున్నవే. అయితే వీటి కట్టడికి నిబంధనలు అధికారికంగా లేకపోవడంతో ఇవి పట్టపగ్గాలు లేకుండా నగరమంతా తిరుగుతూ కాలుష్యాన్ని మరింత పెంచుతున్నాయి. ఆర్టీఏ(RTA)లెక్కల ప్రకారం హైదరాబాద్​లో ఉన్న వాహనాల సంఖ్య 80 లక్షలు.

ఫిట్​నెస్​ పరీక్షలు లేకుండా : ఇందులో 21 లక్షల వాహనాలు 15 ఏళ్లు లేదా అంతకంటే పైబడినవి. ఇందులో 17 లక్షలు ద్విచక్ర వాహనాలు కాగా, కార్లు మూడున్నర లక్షలు. గూడ్స్ వాహనాలు ఒక లక్ష ఉండగా, 20 వేల ఆటోలు, 4 వేల క్యాబ్​లు ఉన్నాయి. విద్యా సంస్థలకు చెందిన సుమారు 2 వేల బస్సులు కూడా కాలం తీరినవి ఉన్నాయి. వీటిలో చాలా వాహనాలకు యజమానులు తప్పనిసరిగా చెల్లించాల్సిన హరిత పన్ను కూడా చెల్లించడం లేదు. ఫిట్​నెస్(Fitness)​ పరీక్షలను కూడా ఎగ్గొడుతున్నారు. దీంతో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండిపడుతోంది.

ఇలాంటి కాలంతీరిన వాహనాల నుంచి అధికంగా ప్రమాదకరమైన పొగ వెలువడుతూ కాలుష్యం భారీగా పెరుగుతోంది. ఇలాంటి వాహనాలు అధికమోతాదులో కార్బన్​డై ఆక్సైడ్, హైడ్రో కార్బన్(Hydro Carbon), నైట్రోజన్​డై ఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్​ను విడుదల చేస్తున్నాయి. కాలం తీరిన వాహనాలు అధిక కాలుష్యాన్ని విడుదల చేయడమే కాదు, ఇంధనాన్ని కూడా ఎక్కువ తీసుకుంటాయని తెలంగాణ కాలుష్య నియంత్రణ బోర్డు అధికారులు తెలిపారు. వాహనాల నుంచి వెలువడే కాలుష్యం వల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

గాలిలో కలుస్తున్న కాలుష్యం : ఈ పొగ పెద్దల్లో మూడో వంతు జీవనశైలి వ్యాధులకు కారణం అవుతోందని తెలిపారు. ఇంకా శ్వాసకోశ, ఊపిరితిత్తులు, చర్మ సమస్యలకు కూడా కారణం అవుతోంది. హైదరాబాద్​లో ఇప్పటికే అధిక కాలుష్యం వెలువడుతుండగా, కాలం తీరిన వాహనాలు దీన్ని మరింత పెంచుతున్నాయి. ముఖ్యంగా సిగ్నళ్ల వద్ద ఈ సమస్య ఎక్కువగా ఉంటోంది. సిగ్నల్​ పడినపుడు వాహనాల నుంచి వెలువడే బొగ్గుపులుసు వాయువు, మీథేన్ వాయువుల కారణంగా గాల్లో కలుస్తున్న కాలుష్యం ప్రభావం కూడలికి అటు, ఇటు 3 వందల మీటర్ల వరకు ఉంటోంది.

ద్విచక్ర వాహనదారులు, బస్సుల్లో వెళుతున్న వారు ఆ కలుషిత గాలిని పీల్చి త్వరగా అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు. జేఎన్​టీయూ (JNTU) అకడమిక్ సైన్స్​ సంచాలకులు ప్రొఫెసర్ కేఎం లక్ష్మణరావు ఆధ్వర్యంలో కొనసాగుతున్న శ్రేష్ఠ విపత్తు నిర్వహణ కేంద్రం పరిశీలనలో ఈ విషయాలు వెలుగుచూశాయి. వాహన కాలుష్యం కారణంగా దుమ్ము, ధూళి కణాలు గాల్లో మందంగా పరుచుకుంటున్నాయి. కాలం తీరిన వాహనాలు ఈ తీవ్రతను ఇంకా పెంచుతున్నాయి. 15 ఏళ్లు పైబడిన వాహనాలు అనేక లోపాలతో ఉండడం వల్ల వీటికి ప్రమాదాలు కూడా ఎక్కువ జరుగుతున్నాయి.

పాత వాహనాల వల్ల రోడ్డు ప్రమాదాలు :కేంద్ర రహదారులు, జాతీయ రహదారుల శాఖ నివేదికల ప్రకారం తెలంగాణలో వెయ్యి రోడ్డు ప్రమాదాలు పాత వాహనాల వల్లే జరిగాయి. 15 ఏళ్లు పైబడిన వాహనాల వల్ల 2022లో తెలంగాణలో ఒక వెయ్యి 306 రోడ్డు ప్రమాదాలు జరగగా, 418 మంది మృతి చెందారు. మరో 11 వందల మంది గాయపడ్డారు. కాలం తీరిన వాహనాలకు తరచూ ఆయిల్​ లీకేజీలు, బ్రేక్లు ఫెయిల్ అవడం, క్లచ్లు బిగుసుకుపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి. బోల్టులు, బుష్లకు పగుళ్లు ఏర్పడతాయి. అందువల్ల వాహనాలు నడిపేవారు దానిపై అదుపుకోల్పోయి ప్రమాదాల్లో ఇతరులు ప్రాణాలు కోల్పోవడానికి కారణం అవుతున్నారు.

కాలం తీరిన వాహనాల ఇంజిన్లకు ఎప్పటికప్పుడు ఓవర్‌హాలింగ్(overhauling) చేయించాలి. కాని అనేక మంది వాహన యజమానులు ఆ నిబంధనను పాటించడం లేదు. కాని అధికారులు కాలుష్యం స్థాయి తప్ప మరేదీ పరిశీలించకుండానే ఫిట్​నెస్​ సర్టిఫికెట్లను జారీ చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. 15ఏళ్లు పైబడిన వాహనాలను పక్కన పెట్టే విషయంలో ప్రభుత్వ పరంగా ఎలాంటి నియమ నిబంధనలు లేవు. గతంలో కేంద్ర ప్రభుత్వం ఇలాంటి వాహనాలను స్వచ్ఛందంగా పక్కన పెట్టే పథకాన్ని ప్రారంభించింది.

Pollution increasing due to Old Vehicles : అయితే అది సరైన సత్ఫలితాలు ఇవ్వలేదు. ఆ తర్వాత కర్ణాటక, కేరళ(Kerala) రాష్ట్రాలు మార్గదర్శకాలు రూపొందించాయి. ప్రతిపాదనలను తెలంగాణా ప్రభుత్వం ఇంకా అంగీకరించలేదు. ఆదాయం కోసం ఇక్కడ ఇప్పటికీ హరిత పన్నును వసూలు చేస్తున్నారు. అయితే పాత వాహనాలను పక్కన పెట్టే విషయంలో ప్రభుత్వాల నుంచి చిత్తశుద్ధితో ప్రయత్నాలు జరగాల్సిన అవసరం ఉందని పర్యావరణవేత్తలు అంటున్నారు. దీనికి సంబంధించి పటిష్ఠమైన నిబంధనలను రూపొందించి అమలు చేయాలని సూచిస్తున్నారు.

15 సంవత్సరాలు ముగిస్తే పాత వాహనాలను కచ్చితంగా పక్కన పెట్టేలా చర్యలు తీసుకోవాలని, అలాంటి వాహన యజమానులపై భారీగా జరిమానాలను విధించాలని హితవు పలుకుతున్నారు. ప్రజలు కూడా అలాంటి వాహనాలను పక్కన పెట్టే విషయంలో స్వచ్ఛందంగా ముందుకు రావాలని హితవు పలుకుతున్నారు. కాలుష్యం యావత్​ ప్రపంచానికి ఇప్పుడు అతిపెద్ద సవాల్. ప్రజల ఆరోగ్యానికి చేటుగా మారిన అతిపెద్ద కారణాల్లో ఇది కూడా ఒకటి. కాలుష్యం వల్ల భూతాపం పెరిగి వాతావరణ మార్పులు సంభవిస్తున్నాయి.

కాలుష్యాన్ని అరికట్టాలి : ఫలితంగా ప్రకృతి పరంగా అనేక దుష్పరిణామాలు సంభవిస్తున్నాయి. విపత్తుల వల్ల తీవ్ర ప్రాణ, ఆస్తి నష్టం సంభవిస్తోంది. వ్యవసాయంపై ప్రభావం పడి మనుషుల కనీస అవసరమైన ఆహార భద్రత ప్రమాదంలో పడుతోంది. అందువల్ల కాలుష్యాన్ని అరికట్టడం అందరి బాధ్యత. ఆ దిశగా హైదరాబాద్​లో ఇబ్బడిముబ్బడిగా పెరిగిన కాలం తీరిన వాహనాలను పక్కన పెట్టడంతోనే అడుగులు పడితే అంతకు మించిన మంచి పరిణామం మరొకటి ఉండదు.

ఆ బాటిళ్లలో నీళ్లు తాగుతున్నారా? - కిడ్నీ, గుండెకు ప్రమాదమేనంటున్న నిపుణులు

భాగ్యనగరంలో మూసీ మురికి వదిలించేదెలా? - కలుషిత నీటి నుంచి మంచినీటిగా మారేదెప్పుడు?

ABOUT THE AUTHOR

...view details