Danger Manja : తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండగ వచ్చిందంటే చాలు హరి కథలు చెప్పేవారు, డూడూ బసవన్నలు, ముంగిట్లో రంగురంగుల ముగ్గులతో పాటు గాలి పటాలు ఖచ్చితంగా ఎగరాల్సిందే. చిన్నా పెద్ద తేడా లేకుండా, ఈలలతో గోల చేస్తూ పోటాపోటీగా పతంగులు ఎగరేస్తూ కేరింతలు కొడుతుంటారు. ఒకరి పతంగి కన్నా మరొకరు ఎక్కువ ఎత్తుకు ఎగుర వేయాలని పోటీ పడుతుంటారు. ఈ క్రమంలో గాలిలోనే గాలి పటాలను తెంపేయాలని చైనా దారం వినియోగిస్తున్నారు. గాజు పిండి, హానికర రసాయనాలు, రంగులతో తయారు చేసిన చైనా మాంజా వల్ల అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని చాలా మంది అంటున్నారు. ప్రమాదాలను గమనించి జాతీయ హరిత ట్రైబ్యునల్ నిషేధించినప్పటికీ మార్కెట్‌లో విచ్చల విడిగా లభ్యం అవుతోంది. ఇవేమీ తెలియని బాలలు వాటిని ఉపయోగిస్తూ ప్రమాదాలకు కారణం అమవుతున్నారు.
చైనా మాంజా అమ్మినా కొన్నా జైలు శిక్షే : చైనా మాంజాలతో పొంచి ఉన్న ప్రమాదాన్ని గ్రహించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జనవరి 2016లోనే వీటి అమ్మకాలను నిషేధించింది. పర్యావరణ పరిరక్షణ చట్టం 1986 ప్రకారం చైనా మాంజాను కొనుగోలు చేసినా అమ్మినా నేరంగా పరిగణిస్తారు. దీనిని ఉల్లంఘించిన వారికి ఐదు సంవత్సరాలు, అంతకన్నా ఎక్కువ జైలు శిక్ష, లక్ష రూపాయల జరిమానా విధిస్తారు. పక్షులు, జంతువులకు హాని కలిగిస్తే వన్య ప్రాణి సంరక్షణ చట్టం ప్రకారం 3 నుంచి ఏడు సంవత్సరాలు జైలుశిక్ష, రూ.10,000 జరిమానా విధిస్తారు.
మాంజా కొనుగోలు చేయకపోవడమే ఉత్తమం : చైనా మాంజా వల్ల కలిగే నష్టాలపై తల్లిదండ్రులు పిల్లలకు అర్థం అయ్యేలా వివరించాలి. చాలా సందర్భాల్లో పెద్ద వారే గాలి పటాలతో పాటు దారం కొనుగోలు చేస్తుంటారు. చాకులా కోసుకుపోయే లక్షణం ఉన్న చైనా మాంజా కొనుగోలు చేయకపోవడమే మంచిది. ఎవరైనా తెలియక వాడినా, వారికి మాంజా నష్టాలను వివరించాలి. ప్రమాదాలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది.
నలుగురికి గాయాలు :బైక్‌పై వెళ్తున్న వారికి మాంజా దారం తగలడంతో నలుగురికి గాయాలు అయిన ఘటన వారం రోజుల క్రితం జనగామలో చోటు చేసుకుంది. బచ్చన్నపేటకు చెందిన సాయిరాం, సనత్ కుమార్, సాయి కుమార్‌లు జనగామలోని సిద్దిపేట రహదారి వైపు వంతెన మీదుగా బైక్‌పై వెళ్తుండగా గాలి పటానికి ఉన్న మాంజా దారం తగిలింది. దీంతో సనత్ కుమార్ గొంతుకు తీవ్ర గాయం అయింది. సాయి కుమార్, సాయిరాంలకు స్వల్ప గాయాలు అయ్యాయి. మరో ఘటనలో స్కూటర్‌పై తల్లిదండ్రులతో కలిసి ప్రయాణం చేస్తున్న పది సంవత్సరాల బాలుడు వీక్షిత్‌కు గొంతు భాగంలో దారం తగలడంతో తీవ్ర గాయం అయింది.