Police Solved Hyderabad Businessman Kidnap Case :ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా నందికొట్కూరుకు చెందిన శేషువర్థన్‌రెడ్డి హైదరాబాద్ హైదర్షాకోట్‌లో బంగారం, ఎలక్ట్రానిక్ వస్తువుల వ్యాపారం చేస్తూ ఇక్కడే స్థిరపడ్డారు. కర్నూలు జిల్లాకు చెందిన క్రాంతికుమార్ అనే వ్యక్తి వ్యాపార పరంగా శేషువర్థన్‌రెడ్డికి పరిచయమయ్యాడు. శేషువర్ధన్‌రెడ్డి వద్ద తక్కువ ధరకు బంగారం, ఎలక్ట్రానిక్ వస్తువులు కొని వాటిని విక్రయిస్తుంటాడు. పలు దఫాలుగా బంగారం, ఎలక్ట్రానిక్ వస్తువులను కొనుగోలు చేసిన క్రాంతికుమార్, దాదాపు 15 లక్షల రూపాయల వరకు లాభం పొందాడు.
నెల రోజుల క్రితం మూడు కిలోల బంగారం కావాలని 2 కోట్ల 50 లక్షల రూపాయలు శేషువర్థన్‌రెడ్డికి ఇచ్చినట్లు క్రాంతికుమార్ పేర్కొన్నాడు. కానీ శేషువర్థన్‌రెడ్డి బంగారం ఇవ్వకపోవడంతో తన డబ్బు తిరిగి ఇచ్చేయాలని క్రాంతికుమార్ కోరారు. అయినా అతడు స్పందించకపోవడంతో కిడ్నాప్ పథకం వేశాడు. కిడ్నాప్ ప్రయత్నంలో భాగంగా కర్నూలుకు చెందిన మరో వ్యక్తి సాయం తీసుకుని శనివారం శేషువర్థన్‌రెడ్డి కారును అనుసరించారు.
100 డయల్ చేసి సమాచారం ఇచ్చిన స్థానికుడు : అదే రోజు రాత్రి 9 గంటలకు నార్సింగి వద్ద కారులో వెళ్తున్న శేషువర్థన్‌రెడ్డిని అడ్డుకుని అతన్ని మరో కారులో ఎక్కించుకుని పరారయ్యారు. ఇదంతా గమనించిన ఓ స్థానికుడు 100 డయల్ చేసి సమాచారం ఇచ్చాడు. నార్సింగి పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని కారును పరిశీలించగా పోలీసులకు రక్తపు మరకలు, ఓ చరవాణి లభించాయి. అప్పటికే కిడ్నాపర్లు ఉపయోగించిన కారు నెంబరు గుర్తించిన పోలీసులు జాతీయ రహదారి మీదుగా కర్నూలు వెళ్తున్నట్లు గుర్తించి సిబ్బందిని అప్రమత్తం చేశారు.