Police seize EX MLA Jeevan Reddy Mall: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేకు టీఎస్ఆర్టీసీ షాక్ ఇచ్చింది. రూ.2.51 కోట్ల అద్దె బకాయిలు చెల్లించనందుకు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్న ఆయన షాపింగ్ మాల్‌ను సీజ్ చేసి, నోటిసులు అంటించింది. అనంతరం మాల్లో ఉన్న వ్యాపార సముదాయాలను పోలీసులు మూసివేసి తాళాలు వేశారు. హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం భవనాన్ని సంస్థ స్వాధీనం చేసుకుంది. పెండింగ్ బకాయిలు చెల్లించనందున విష్ణుజిత్ ఇన్‌ఫ్రా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో చేసుకున్న అద్దె ఒప్పందాన్ని ఆర్టీసీ యాజమాన్యం రద్దు చేసిందని సంస్థ ఎండీ సజ్జనార్ తన ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారు.
MD Sajjanar Tweet on Jeevan Reddy Mall : ఆర్టీసీకి చెందిన 7059 చదరపు గజాల భూమిని 33 సంవత్సరాలకు విష్ణుజిత్ ఇన్‌ఫ్రా డెవలపర్స్ కంపెనీ బిల్ట్ ఆపరేట్ ట్రాన్స్‌ఫర్(బీవోటీ) కింద 2013 జూన్ 1న లీజ్‌కు తీసుకుందని సజ్జనార్ తెలిపారు. 2017లో ఆ కంపెనీని మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సతీమణి రజితా రెడ్డి ఆధీనంలోకి తీసుకున్నారు. షాపింగ్ మాల్‌కు 'జీవన్ రెడ్డి మాల్ అండ్ మల్టీపెక్స్'గా పేరుపెట్టారు. థర్డ్ పార్టీలకు అందులోని స్టాళ్లను లీజ్‌కు ఇచ్చారని పేర్కొన్నారు. ఒప్పందం ప్రకారం ఆ కంపెనీ సకాలంలో అద్దె చెల్లించలేదని వెల్లడించారు.
కార్గో లాజిస్టిక్స్‌పై దృష్టి సారించిన టీఎస్ఆర్టీసీ - అత్యాధునిక సేవలు విస్తరించేలా ప్రణాళికలు
గత సంవత్సరం అక్టోబర్ వరకు రూ.8.65 కోట్ల బకాయి సంస్థకు ఉందని సజ్జనార్ తెలిపారు. దీంతో మాల్ యాజమాన్యానికి నోటీసులు జారీ చేయడంతో అక్టోబర్‌లో రూ.1.50 కోట్లను ఆ కంపెనీ చెల్లించిందని అన్నారు. ఆ తర్వాత షోకాజ్ నోటీసులు పంపించడంతో గత ఏడాది డిసెంబర్లో విడతల వారీగా రూ.2.40 కోట్లను కట్టిందని తెలిపారు. షోకాజ్ నోటీసును సవాల్ చేస్తూ మాల్ యాజమాన్యం హైకోర్టునూ ఆశ్రయించిందని గుర్తు చేశారు.