Police Searching for Vallabhaneni Vamsi :కృష్ణాజిల్లా గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని అరెస్టు చేసేందుకు పోలీసుల వేట కొనసాగుతోంది. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వంశీని ఇప్పటికే ముద్దాయిగా చేర్చిన గన్నవరం పోలీసులు, ఆయన ఆచూకీ కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. ఇప్పటికే ఈ కేసులో 19 మందిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. తాజాగా రమేష్, యూసుఫ్ అనే ఇద్దరిని అరెస్టు చేశారు. వీరిలో రమేశ్‌ను కోర్టులో హాజరుపరుచగా, న్యాయమూర్తి 14 రోజులు రిమాండ్ విధించారు. ఇవాళ యూసఫ్‌ను కోర్టులో హాజరుపర్చనున్నారు.
యూసుఫ్ పఠాన్ అరెస్ట్ - వల్లభనేని వంశీ కోసం గాలింపు - Ex MLA Vallabhaneni Vamsi Arrest
ముమ్మర గాలింపు : వంశీ కోసం హైదరాబాద్‌లో మూడు బృందాలతో పోలీసులు గాలిస్తున్నారు. ఈ కేసులో ఏ71గా ఉన్న వంశీని అదుపులోకి తీసుకుని విచారణ జరిపితే దాడికి చెందిన మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని పోలీసులు భావిస్తున్నారు. వంశీ సహా, కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న పలువురిని అదుపులోకి తీసుకునేందుకు హైదరాబాద్ వెళ్లిన ప్రత్యేక పోలీసు బృందాలు తమ ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు సమాచారం. కొన్ని రోజులుగా అక్కడే మకాం వేసిన అధికారులు వంశీ సహా పలువురి కదలికలపై నిఘా ఉంచారు.
వదంతులు ప్రచారం : శుక్రవారం మధ్యాహ్నం వంశీని అరెస్టు చేసినట్లుగా సామాజిక మాధ్యమాల్లో జోరుగా ప్రచారం జరిగింది. కానీ అవన్నీ వదంతులేనని పోలీసులు కొట్టిపారేశారు. మరోవైపు వంశీని ఎలాగైనా అరెస్టు చేయాలనే ఉద్దేశంతో వివిధ కోణాల్లో గట్టి నిఘా ఏర్పాటు చేసినట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఆయన హైదరాబాద్‌లో ఉన్నారా, లేక ఇతర ప్రాంతాలకు వెళ్లారా అనే దానిపై లోతుగా పరిశీలన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆయన కాల్ డేటా, సహాయకుల కదలికలను నిశితంగా పరిశీలించినట్లు సమాచారం. మరోవైపు వంశీ సతీమణి విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లారని సమాచారం.
వంశీ ప్రోద్బలంతోనే దాడి : దాడిలో వంశీ నేరుగా పాల్గొనకపోయినా ఎమ్మెల్యే హోదాలో ఆయన ప్రోద్బలంతోనే వైఎస్సార్సీపీ మూకలు విధ్వంసం సృష్టించాయనే ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో వంశీ కోసం పోలీసులు హైదరాబాద్, గన్నవరం తదితర ప్రాంతాల్లో గాలిస్తున్నారు. మొన్నటి వరకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉండడంతో అక్కడి పోలీసులు వంశీ సొంత మనుషులుగా చెలామణి అయ్యారు. వంశీ అనుయాయులుగా ఉన్న పోలీసులు కీలక స్థానాల్లో ఉండడంతో ఈ కేసుపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
వంశీ అరాచకాలపై ప్రత్యేక దృష్టి:కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వంశీ అరాచకాలపై ప్రత్యేక దృష్టి సారించింది. టీడీపీ కార్యాలయంపై దాడి కారకులపై చర్యలు చేపట్టాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. పోలీసులు గత నెల 9న బాపులపాడు ఎంపీపీ నగేష్ సహా 15 మందిని, తర్వాత మరో ముగ్గురిని అరెస్టు చేశారు. అయితే దాడి కేసులో పోలీసులు వంశీ సహా పలువురు కీలక నిందితుల్ని వదిలేశారంటూ ఆ పార్టీ శ్రేణుల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. పైగా టీడీపీ పెద్దలు కూడా వంశీ గతంలో చేసిన వ్యాఖ్యలు, పార్టీ శ్రేణుల్ని వేధించడం, యువగళం పాదయాత్ర సందర్భంగా అక్రమ కేసులు పెట్టించడాన్ని తీవ్రంగా తీసుకున్నారు.
ఈ నేపథ్యంలో వంశీని అరెస్టు చేయాలనే ఒత్తిడి పెరిగింది. కృష్ణా జిల్లా ఎస్పీగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన గంగాధరరావు ఈ వ్యవహారంపై ప్రత్యేక దృష్టి సారించారు. వంశీ కుటుంబం హైదరాబాద్‌లోనే నివసిస్తుండడం, ఎన్నికల ఫలితాల అనంతరం ఆయన కూడా అక్కడే ఉంటున్నట్లు తెలియడంతో పోలీసులు అరెస్టుకు కార్యాచరణ చేపట్టారు. గురువారం 3 ప్రత్యేక బృందాలు హైదరాబాద్ వెళ్లాయి. అయితే వంశీ ఇప్పటికే అమెరికా వెళ్లిపోయి ఉంటారనే ప్రచారం జోరుగా సాగుతోంది.
శ్రీలక్ష్మి రూటే సపరేటు - రూ.2.18 కోట్ల ప్రజాధనంతో తండ్రి పేరిట పార్కు - SENIOR IAS OFFICER SRILAKSHMI
ఏపీలో వెలుగుచూస్తున్న వాసుదేవరెడ్డి లిక్కర్ లీలలు - నకిలీ హోలోగ్రామ్ స్టిక్కర్లతో మద్యం సరఫరా! - FAKE HOLOGRAM STICKERS IN LIQUOR