Police Involved in Civil Disputes in Prakasam District :
- టంగుటూరు మండలం జమ్ములపాలేనికి చెందిన ఒకరు విదేశాల్లో ఉంటున్నారు. తనకున్న భూములపై సమీప బంధువుకు జీపీఏ ఇచ్చారు. ఆ భూమిని తనదిగా చూపుతూ డెయిరీ యూనిట్ ఏర్పాటుకు ఓ మహిళ ప్రయత్నించారు. విషయం తెలుసుకున్న జీపీఏ పొందిన వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుడు స్టేషన్ చుట్టూ రోజులుగా తిరుగుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు.
- కొత్తపట్నం మండలానికి చెందిన ఓ మహిళ తన కుమారుడి వైద్యచికిత్స నిమిత్తం ఒంగోలులోని ఒక ఆసుపత్రికి వచ్చారు. ఆ సమయంలో ఆమె మెడలోని గొలుసు మాయమైంది. ఈ విషయాన్ని ఆ మహిళ తండ్రి పోలీసులకు తెలిపి కేసు నమోదు చేయాలని కోరారు. ఎక్కడెక్కడో పోగొట్టుకుంటే మేం కేసు నమోదు చేయాలా అంటూ పోలీసులు ఎదురు ప్రశ్నించారు.
- ఒంగోలులో ఇటీవల చోరీ చోటు చేసుకుంది. సుమారు 15 సవర్ల బంగారం అపహరణకు గురైంది. పోలీసులు నేరస్థలాన్ని పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. రేకుల ఇంట్లో నివసించే మీకు ఇంత బంగారం ఎక్కడిదంటూ బాధితులను అవమానించేలా మాట్లాడారు.
- మద్యం తాగి వచ్చి ఓ వ్యక్తి తరచూ చిత్రహింసలకు గురిచేస్తున్నాడు. సదరు వివాహిత పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రెండు పక్షాలను స్టేషన్‌కు పిలిపించారు. ఈ వ్యవహారంలో భర్త తరఫున దర్శి నియోజకవర్గంలోని ఓ ఎస్ఐ వకాల్తా పుచ్చుకున్నారు. చర్చించే క్రమంలో బాధిత మహిళ తండ్రిపై చేయి చేసుకున్నారు. సదరు మహిళను దుర్భాషలాడుతూ తోలు తీస్తానంటూ బెదిరించి పంపారు.
నమ్మకంగా ఉంటూ నట్టేట ముంచిన బ్యాంకు మేనేజర్ - కోట్లలో స్వాహా
క్షేత్రస్థాయి పోలీసింగ్ గాడి తప్పుతోంది. కొందరు అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. జిల్లా పోలీసు బాస్ దూకుడుగా వ్యవహరిస్తూ అసాంఘిక శక్తుల ఆట కట్టించేందుకు కృషిచేస్తున్నారు. అదే సమయంలో క్షేత్రస్థాయిలో కొందరు అధికారులు మాత్రం ఆయనకు మస్కా కొడుతూ అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. ఫిర్యాదుదారులను బెంబేలెత్తిస్తున్నారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదులపై కేసులు నమోదు చేసేందుకు నిరాకరిస్తున్నారు. సరికదా తిరిగి వారి పైనే ఎదురుదాడికి దిగుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో రాజకీయ నాయకుల సిఫారసులు ఉంటేనే కేసులు నమోదు చేస్తున్నారు. ఈ తరహా వ్యవహార తీరు మొత్తం పోలీసు శాఖ ప్రతిష్ఠనే మసకబారుస్తోంది.