Hyderabad Police Arrested Dhar Gang :దోపిడీకి ముందు ఎంతో నిష్టగా గ్రామ దేవతకు పూజలు చేస్తారు. తాము అనుకున్న పని విజయవంతంగా పూర్తవ్వాలని, కనీసం అరకిలో బంగారమైన దొరకాలని ప్రార్థిస్తారు. కత్తులు, ఇతర మారణాయుధాలతో రంగంలోకి దిగుతారు. ఎన్నిరోజులైనా ఎన్ని ఇళ్ల తాళాలు పగలగొట్టైనా అనుకున్నది సాధించేవరకూ ఆ ప్రాంతాన్ని వదిలిపెట్టరు. అంతా అనుకున్నట్లు జరిగితే మళ్లీ సొంతూరు వెళ్లి దేవతకు మొక్కులు సమర్పిస్తారు. ఇదీ దొంగతనాలకు మారుపేరైన మధ్యప్రదేశ్ ధార్ గ్యాంగ్ దొంగతనాల శైలి. వరుస దోపిడీలకు చేసే ధార్ గ్యాంగ్ అలజడులు ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో కలకలం రేపుతున్నాయి.
గతంలో వరుస దోపిడీ దొంగతనాలకు పాల్పడే ధార్ గ్యాంగ్‌పై హైదరాబాద్ పోలీసులు ఉక్కుపాదం మోపారు. ఈ ముఠాలోని పలువురిని నగర పోలీసులు అరెస్టు చేశారు. కట్టుదిట్టమైన చర్యల నేపథ్యంలో 2022 జూన్ నుంచి నగరంవైపు కన్నెత్తిచూడని ముఠా కొన్ని నెలలుగా మళ్లీ చెలరేగిపోతోంది. నగర శివార్లు లక్ష్యంగా దోపిడీలకు తెగబడుతున్నారు. ముఠా సభ్యులు ఈ ఏడాది సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లలో 10 స్టేషన్ల పరిధిలో ఏకంగా 31 చోరీలకు పాల్పడ్డారు. ఇవన్నీ చేతికి చిక్కిన నిందితులు చేసిన దోపిడీలు మాత్రమే ఇంకా భారీ ఎత్తున చోరీలు చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.
ముఠాలోని మరికొందరిని అరెస్టు చేస్తే నగరంలో దొంగతనాల వివరాలు పూర్తిగా వెల్లడయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. మధ్యప్రదేశ్‌లోని ధార్ జిల్లాకు చెందిన దొంగలే ఈ ధార్ ముఠా సభ్యులు. స్థానిక తాండా, కుక్షి పోలీస్ స్టేషన్ల పరిధిలోని ఆదివాసీ గ్రామాలకు చెందిన వారే ఈ ముఠాలో ఎక్కువగా ఉంటారు. నీటి లభ్యత తక్కువగా ఉండడం, కరవు, ఇతర ఇబ్బందులతో దశాబ్దాల క్రితం స్థానికులు దోపిడీలను వృత్తిగా ఎంచుకున్నారు. సుమారు 10 వేల మంది వరకూ చోరీలు మాత్రమే చేసి జీవనం గడుపుతారని పోలీసుల అంచనా. దీంతో సొంత రాష్ట్రంతో పాటు పక్క రాష్ట్రంలోని పలు ప్రాంతాలు ఎంపిక చేసుకుని చోరీలు చేస్తుంటాయి.