Home Minister Anitha Inspects Central Jail: విశాఖ సెంట్రల్ జైలులో సెల్‌ఫోన్లు దొరకడంపై విచారణ జరుగుతోందని హోంశాఖ మంత్రి అనిత స్పష్టం చేశారు. కారాగారంలో పరిసరాలను అధికారులతో కలిసి హోంమంత్రి పరిశీలించారు. జైల్లో ప్రస్తుత పరిస్థితి గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం హోంమంత్రి మాట్లాడుతూ విశాఖ సెంట్రల్ జైల్లో గంజాయి సరఫరా ఆరోపణలు వచ్చాయని, పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నామన్నారు. గత ప్రభుత్వం తప్పిదాల వలనే విశాఖ సెంట్రల్ జైల్లో ఇలాంటి పరిస్థితి వచ్చిందని, ఖైదీల రక్షణే ముఖ్యమని అన్నారు.
జైలులో గంజాయి మొక్క: ఇటీవలే జైల్లో సెల్ ఫోన్లు బయటపడ్డాయని, సెల్ ఫోన్లు బయటపడిన చోట సైతం పరిశీలించామని, విచారణ అనంతరం కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఫోన్‌లో ఎవరు ఎవరితో మాట్లాడారో తెలుసుకుని వారిపై కూడా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జైలులో గంజాయి మొక్క కనిపించిందని, విధులు సమర్థవంతంగా నిర్వహించకపోతే, సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని, ఎవ్వరినీ ఉపేక్షించేది లేదని హోంమంత్రి అనిత తేల్చిచెప్పారు. జైలులో ఎక్కడా భద్రతా లోపాలు లేకుండా చర్యలు చేపట్టామన్నారు. గత ప్రభుత్వ నిర్వాకం వల్లే జైళ్లలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని ఆరోపించారు. వాటిని సరిదిద్దుతున్నట్లు చెప్పారు.
విచారణ చేసిన తర్వాతే విశాఖ సెంట్రల్ జైల్‌లో ఉద్యోగులను బదిలీ చేస్తామని, ఇప్పటి వరకు ఎవ్వరిని సస్పెండ్ చేయలేదని అన్నారు. యూనిఫాం సర్వీసులో ఉన్నవారు ధర్నాలో, బందులో పాల్గొనకూడదని, కొత్త సూపరింటెండెంట్ సెంట్రల్ జైల్‌ను ప్రక్షాళన చేస్తున్నారన్నారు. టెక్నాలజీని కూడా ఉపయోగించుకుంటామని, సెంట్రల్ జైల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామని, పది రోజుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు.
విశాఖ జైలు నుంచి ఇతర జైళ్లకు: విశాఖ సెంట్రల్ జైల్ నుంచి కొంతమంది ఖైదీలను రాజమండ్రి జైల్‌కు తరలిస్తున్నామన్నారు. గత ఐదు సంవత్సరాలు సెంట్రల్ జైల్‌ను విజిట్ చేసిన దాఖలాలు లేవని విమర్శించారు. గత ప్రభుత్వం శాంతిభద్రతల అంశం గాలికి వదిలేసిందని మండిపడ్డారు. టెక్నాలజీ నుంచి ఎవరూ తప్పించుకోలేరన్నారు. పది, పదిహేను రోజుల్లో సెల్ ఫోన్ వ్యవహరంలో విచారణ రిపోర్టు వస్తుందని, జైల్లో సిబ్బందిని పెంచుతామని హోంమంత్రి అనిత స్పష్టం చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగితే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.
"గత ప్రభుత్వం జైళ్ల గురించి పూర్తిగా పట్టించుకోలేదు. అందువల్లే ప్రస్తుతం ఈ పరిస్థితి. జైళ్లలో సెల్‌ఫోన్లు కూడా బయటపడ్డాయి. దీనిపై విచారణ చేస్తాం. తప్పుచేసిన ప్రతి ఒక్కరినీ శిక్షిస్తాం. జైలు లోపల గంజాయి మొక్క కూడా కనిపించింది. శాంతిభద్రతలకు విఘాతం కలిగితే ఉపేక్షించేది లేదు. సిబ్బందిని సైతం పెంచుతాము". - అనిత, హోంమంత్రి
విశాఖ టు రాజమండ్రి - 200 మంది ఖైదీలు కేంద్ర కారాగారానికి తరలింపు