MRPS Leader Kidnap Case Update : హైదరాబాద్ చాంద్రయణగుట్టకు చెందిన సుజాయత్ అలీ, నార్సింగి బృందావన్‌కాలనీకి చెందిన ఫక్రుద్దీన్ భూమాఫియా ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇద్దరు న్యాయవాదులుగా చెలామణి అవుతూ భూ కబ్జాలు చేస్తున్నారు. వివాదాస్పద, విదేశాల్లో ఉండే ప్రవాసుల స్థలాలను గుర్తించి ఆక్రమించి గంటల వ్యవధిలో ప్రహరీ నిర్మిస్తారు. వాటికి సంబంధించిన నకిలీ దస్త్రాలు సృష్టిస్తారు. తాజాగా ఎమ్ఆర్పీఎస్ నేత అపహరణ కేసులో దర్యాప్తు చేస్తున్న పోలీసుల విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి.
ఎదురుతిరిగితే కిడ్నాప్ :అక్రమంగా నిర్మించిన ఫాంహౌస్‌ను అడ్డాగా చేసుకుని బాధితులను చిత్రహింసలు పెడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితులు ఫాంహౌస్‌లో పదుల సంఖ్యలో కుక్కలను కాపలాగా ఉంచుతారు. యజమానులు భూమి గురించి ప్రశ్నిస్తే దాడులకు తెగబడుతారు. లేకపోతే మాట్లాడకుందామంటూ కిడ్నాప్ చేసి శంషాబాద్ మున్సిపాలిటీ పరిధి ధర్మవరంలో అక్రమంగా నిర్మించిన ఫాంహౌస్‌కు తరలిస్తారు.
కుక్కల మధ్య బంధించి చిత్రహింసలు :కుక్కల మధ్యలో బంధించి చిత్రహింసలు పెడతారు. సుజాయత్ అలీ, ఫక్రుద్దీన్ అనుచరులపై నార్సింగిలో ఐదు, శంషాబాద్ ఠాణాలో ఒక కేసు ఉన్నాయి. ఇవన్నీ భూకబ్జాలు దాడులు, కిడ్నాప్‌నకు సంబంధించినవే నిందితులు కోర్టుల్ని తప్పుదోవ పట్టించేలా డాక్యుమెంట్లు తయారుచేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. సుజాయత్ అలీ, ఫక్రుద్దీన్ గ్యాంగ్ నార్సింగిలో ఒక భూ వివాదంలో ఎమ్ఆర్పీఎస్ నేత నరేందర్, ప్రవీణ్‌ను అపహరించి చిత్రహింసలు పెట్టి వదిలేశారు.