Maoist Warning Letters to Mla Vinod kumar :మంచిర్యాల జిల్లాలో ఒక్కసారిగా మావోయిస్టుల కలకలం రేగింది. బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్‌ను బెదిరిస్తూ రాసిన లేఖలు పోలీస్ శాఖను అప్రమత్తం చేశాయి. మావోయిస్టుల నుంచి గడ్డం వినోద్‌కు ప్రమాదం ఉందని నిర్ణయించిన పోలీసులు భద్రత పెంచారు. ఎమ్మెల్యే గడ్డం వినోద్ క్యాంపు కార్యాలయంలో డోర్ ఫ్రేమ్ మెటల్ డిటెక్టర్, హ్యాండ్ హోల్డ్ మెటల్ డిటెక్టర్ లాంటి ఆధునిక యంత్రాలతో తనిఖీ చేస్తున్నారు. ఎంఎల్ఏ భద్రతను 3+3 కు పెంచారు.
మంచిర్యాల జిల్లా ఎమ్మెల్యేకు వార్నింగ్ లెటర్ - అప్రమత్తమైన పోలీసులు - MAOIST WARNING LETTERS TO MLA
మంచిర్యాల జిల్లాలో మావోయిస్టుల లేఖలు - బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్‌ను హెచ్చరిస్తూ లెటర్ - భద్రత పెంచిన పోలీసులు
Published : Nov 8, 2024, 8:23 PM IST
కాంగ్రెస్ కార్యకర్తలతో పాటు క్యాంప్ కార్యాలయానికి వచ్చే ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా తనిఖీ చేసిన తరువాతే లోనికి పంపిస్తున్నారు. జిల్లాలో బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్‌తో పాటు అతని అనుచరుల ఆగడాలు మితిమీరిపోయాయని గతంలో ఓ లేఖ విడుదల చేశారు. తాజాగా ఎమ్మెల్యే కోసం మరో లేఖ రావడం కలకలం సృష్టించింది. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన పోలీసులు గడ్డం వినోద్‌కు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మావోయిస్టుల లేఖలతో బెల్లంపల్లి నియోజకవర్గంలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ప్రస్తుతం మంచిర్యాల జిల్లాలో మావోయిస్టుల ప్రభావం అంతంతమాత్రంగానే ఉంది.
వరుసగా రెండుసార్లు బెదిరింపు లేఖ : దండకారణ్యంలో ఇటీవల మావోయిస్టులకు భారీగా ఎదురుదెబ్బలు తగిలాయి. ఛత్తీస్‌గఢ్ అడవుల్లో అటు సీఆర్పీఎఫ్, కోబ్రా దళాలు, తెలంగాణ నుంచి గ్రేహౌండ్స్ కమాండోలు వరుస దాడులతో మావోయిస్టులను దెబ్బతీస్తున్నారు. దీంతో రాష్ట్రంలో మావోయిస్టుల కదలికలు అంతంతమాత్రంగానే ఉన్నాయని నిఘా వర్గాలు అంచనావేసినట్లు సమాచారం. అయితే ఎమ్మెల్యేకు వరుసగా రెండుసార్లు బెదిరింపు లేఖ రావడంతో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా భద్రతను పెంచినట్లు తెలుస్తోంది.